అతిరథుల చూపు తెలంగాణ వైపు
దేశమంతా ఒక వైపు..తెలంగాణ ఒక్కటి ఒక వైపు అన్న చందంగా రాజకీయాలు మారిపోతున్నాయి. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ప్రధానంగా అన్ని పార్టీలు ఈ ప్రాంతంపైనే కన్నేశాయి. ఉద్యమాలకు, పోరాటాలకు , ఆందోళనలకు కేరాఫ్‌గా మారిన తెలంగాణ ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. కొత్త రాష్ట్రం ఏర్పాటై నాలుగున్నర ఏళ్లు గడిచాయి. అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ ఉన్నట్టుండి తొమ్మిది నెలల ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఎన్నికల ప్రక్రియ అనివార్యమైంది. నోటిఫికేషన్లు విడుదల చేయడం..డెడ్ లైన్ విధించడం జరిగింది. డిసెంబర్ 7న పోలింగ్ జరగనుంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రత్యేకించి వృద్ధులు, పిల్లలు కలిగిన తల్లులు, వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యాలను కల్పించేలా ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు దగ్గరుండి చూస్తున్నారు.
మరోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారు. ఇప్పటికే సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. జనాన్ని తన ప్రసంగాలతో మెస్మరైజ్ చేస్తున్నారు. సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను వల్లె వేస్తున్నారు. ఆయనకు తోడుగా ట్రబుల్ షూటర్‌గా పేరొందిన అల్లుడు హరీష్ రావు, కొడుకు కేటీఆర్, కూతురు కవిత, కుటుంబీకుడు సంతోష్ తో పాటు ఈటెల రాజేందర్, నాయని నరసింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు ప్రచారంలో పాల్గొంటున్నారు. మహాకూటమిపై ఆరోపణలు సంధిస్తున్నారు. ఇక గులాబీదళంతో పాటు బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, టీజెఎస్, ఇంటి పార్టీ, సీపీఐ పార్టీలు కేసీఆర్‌ను టార్గెట్ చేశాయి. ప్రజా ఆశీర్వాద సభ పేరుతో కేసీఆర్ తిరుగుతుంటే..కాంగ్రెస్ యుపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో అన్ని పార్టీల సమన్వయంతో మేడ్చెల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ఊహించని దానికంటే ఎక్కువగా జనం హాజరయ్యారు.
ఈ పార్టీలకు తోడుగా ఇంటి పార్టీ, బీఎస్‌పీ, బీఎల్ఎఫ్, ఎంఐఎం పార్టీలు బరిలో నిలిచాయి. ఆయా పార్టీలకు మద్ధతుగా ఆయా రాజకీయ పార్టీల అధినేతలు, పార్టీ అధిపతులు రంగంలోకి దిగారు. బీజేపీ అభ్యర్థులకు మద్ధతుగా ఓట్లు అడిగేందుకు సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా , బీఎస్పీ అధినేత్రి మాయావతి, టీడీపీ నుండి ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, టీజెఎస్ అధినేత కోదండరాం, సీపీఐ నుండి నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, ఎంఐఎం నుండి అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ప్రచారం చేయబోతున్నారు. ఇక స్పెషల్ అట్రాక్షన్‌గా యుపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, ప్రజా యుద్ధ నౌక గద్దర్‌లు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న మోడీ, సోనియా, రాహుల్, మాయావతి, చంద్రబాబు, ఆదిత్యనాథ్, తదితరులు రానుండడంతో తెలంగాణ దంగల్ ఎన్నికల ప్రచారం మరో యుద్ధరంగాన్ని తలపింప చేస్తోంది.
గులాబీ బాస్ కేసీఆర్ మాటలు , సోనియా, రాహుల్ గాంధీల ఛరిష్మా, అమిత్ షా, ఆదిత్యానాథ్, మాయావతి మాటలు ఏ మేరకు ఓట్లు రాలుస్తాయో వేచి చూడాల్సిందే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి