సామాన్యుడు కాదప్పా..గోవిందప్ప
ఎవరీ గోవిందప్ప. దేశం గర్వించదగిన మహోన్నత మానవుడు. లక్షలాది మందికి చూపును ప్రసాదించిన కంటి వైద్యుడు. ప్రపంచంలోనే అతి పెద్ద..అద్భుతమైన సౌకర్యాలతో ఐ హాస్పిటల్‌ను నిర్వహిస్తున్న డాక్టర్. ఆయన అందించిన నిస్వార్థమైన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఈ వైద్యుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. టెక్నాలజీ పెరిగింది కాదనలేం. వైద్యరంగంలో పెను మార్పులు వచ్చినవి. కానీ రోగాన్ని గుర్తించి..బాధితులకు భరోసా ఇచ్చే వైద్యులే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేస్తారు గోవిందప్ప. ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టిన ఈ డాక్టర్ భారీ ఐ ఆస్పత్రిని ఎలా కట్టారో తెలుసుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది.
తమిళనాడులోని వడమాలపురం గ్రామంలో జన్మించారు. కుటుంబంలోని ఐదు మందిలో ఆయన కూడా ఒకరు. మారుమూల పల్లె ఇది. సౌకర్యాల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ..తన కుటంబానికి చెందిన ముగ్గురు వైద్యం అందక మృతి చెందారు. ఈ సంఘటన గోవిందప్పను కదిలించింది. అష్టకష్టాలు పడి చదివారు. డాక్టర్ అయ్యాడు. ఆప్తమాలజీలో ఎంఎస్ చేశారు. మద్రాస్ లోని ప్రభుత్వ ఆప్తాల్‌మిక్ ఆస్పత్రిలో వైద్యుడిగా సేవలందించారు. 1945లో ఇండియన్ ఆర్మీకి సర్జన్‌గా పని చేశారు. మూడేళ్లపాటు అక్కడే ఉన్నారు. అదే సమయంలో గోవిందప్ప శరీరం అనారోగ్యానికి గురైంది. ఏ చేతులైతే సేవలందించారో అవే పనిచేయకుండా పోయాయి. కానీ గోవిందప్ప చలించలేదు. ఆయనలోని పట్టుదలే తిరిగి కోలుకునేలా చేసింది.
ఐ సర్జన్‌గా సేవలందిస్తూ రోగుల నుండి మన్ననలు అందుకున్నారు. మదురైలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని ఆప్తమాలజీ విభాగానికి అధిపతిగా ఉన్నారు. 20 ఏళ్ల పాటు నిరాటంకంగా సేవలందించారు. 1976లో విధుల నుండి రిటైర్ అయ్యారు గోవిందప్ప. విరమణ అన్నది పదవికి వుండొచ్చు..నా శరీరానికి కాదుగా..అందుకే శక్తి ఉన్నంత వరకు చీకటి నుండి వెలుతురు పంచాలన్నదే నా లక్ష్యం అంటారు. ప్రపంచ వ్యాప్తంగా అంధత్వం కలిగిన వారు 30 మిలియన్లకు పైగా ఉన్నారు. ఒక్క ఇండియాలోనే 12 మిలియన్ల మంది చీకట్లోనే తచ్చట్లాడుతున్నారు. ఇది గమనించిన ఈ వైద్యుడు అసాధారణమైన నిర్ణయం తీసుకున్నారు.
మదురైలో కొన్ని భవనాలను అద్దెకు తీసుకుని అరవింద్ ఐ హాస్పిటల్ ను ఏర్పాటు చేశాడు గోవిందప్ప. 11 బెడ్స్ తో ఉన్న ఆస్పత్రిలోనే వేలాది మందికి ఐ ఆపరేషన్స్ చేశారు. ఆ తర్వాత ఇదే హాస్పిటల్‌ను అంచెలంచెలుగా ఎదిగేలా అభివృద్ధి చేశారు. 4000 వేల బెడ్స్, అదనంగా అదే పేరుతో ఏడు హాస్పిటల్స్‌ను నిర్మించారు. 70 ప్రైమరీ ఐ కేర్ సెంటర్లు నెలకొల్పారు. 55 మిలియన్ల మందికి పరీక్షలు నిర్వహించారు. 6.8 మిలియన్ల ప్రజలకు ఐ కాటరాక్ట్ సర్జరీలు చేశారు. వేలాది మంది చీకటిని దాటుకుని వెలుగును చూస్తున్నారు. 1973లో అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు గోవిందప్ప. వైద్యం పేరుతో..ఆపరేషన్లు..మందుల పేర్లతో లక్షలాది రూపాయలు కొల్లగొడుతూ..హాస్పిటల్స్ విస్తరిస్తున్న ఈ తరుణంలో విశిష్ట సేవలందిస్తున్న గోవిందప్ప గొప్పవాడు కాదంటారా.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి