బాల్యానికి భరోసా..సేవతో ఆసరా !
జీవితంలో అత్యంత విలువైనది బాల్యం. విద్యా పరంగా..ఆరోగ్య పరంగా మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే. ఏళ్లయినా మార్పు లేదు. వారి బతుకుల్లో వెలుగు లేదు. చాలా మంది అనాధలుగా ఆకలితో అల్లాడుతున్నారు. చిరునామా లేని చావులకు లోనవుతున్న వాళ్లకు కొండంత అండగా నిలిచారు. వారు చదువుకునేలా చేస్తున్నారు ఒకప్పుడు అనాధలైన ఇద్దరు. సేవ చేసేందుకు గుర్తింపు అవసరం లేదు. ఎవ్వరి సిఫారసులు ఉండాల్సిన పనిలేదు.
కావాల్సిందల్లా నిస్వార్థంగా ఆదుకోవాలన్న సంకల్పం. దేవ్ ప్రతాప్ సింగ్, చాందినీ ఖాన్‌లు ఇద్దరూ ముంబయిలోని స్లమ్ ఏరియాలకు చెందిన వారు. వీళ్లిద్దరిది అంతులేని కథ. మెరుగైన జీవితం అనుభవించాలని ప్రతాప్ సింగ్ ఇంటి నుండి బయట పడ్డాడు. రైల్వే స్టేషన్ దగ్గర మూడేళ్ల పాటు తలదాచుకున్నాడు. డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. పోలీసుల కంట పడ్డాడు.
అరెస్ట్ చేశారు. చిన్న పిల్లవాడు కావడంతో జువైనల్ జైలుకు తరలించారు. విడుదలయ్యాక నెలకు 200 రూపాయలకు ఓ రెస్టారెంట్‌లో పనికి కుదిరాడు. అక్కడ పనిలో నైపుణ్యం సంపాదించాడు. దీనికంటే మరింత బెటర్ లైఫ్ ఉండాలని ఆశించాడు. రేయింబవళ్లు శ్రమించాడు. కొన్నేళ్ల తర్వాత బీపీఓ రంగంలో పనికి కుదిరాడు. సేల్స్ డిపార్ట్‌మెంట్ లో ఉద్యోగం సంపాదించాడు. ఏరియా సేల్స్ మేనేజర్ స్థాయికి చేరుకున్నాడు. 40,000 వేల రూపాయల జీతం. ఒకప్పుడు డ్రగ్స్ కు అలవాటు పడిన దేవ్ ప్రతాప్ సింగ్..పెద్ద మొత్తంలో సంపాదిస్తానని అనుకోలేదు. మేనేజర్ గా పనిచేస్తున్న అతను చదువుకున్నది కేవలం ఐదో తరగతి మాత్రమే.
కొన్ని సంవత్సరాల అనంతరం తన వారిని కలుసుకున్నాడు సింగ్. ఆనందంగా ఉన్న సమయంలో ప్రాణప్రదంగా ప్రేమించే తల్లి రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. బిగ్ షాక్. మళ్లీ డిప్రెషన్‌కు లోనయ్యాడు. తిరిగి తనకు నీడనిచ్చిన రైల్వే స్టేషన్‌లో తలదాచుకున్నాడు. తనతో ఉన్న వాళ్లు డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు. ఆలోచనలో పడ్డాడు. అవి వాడడం వల్ల విలువైన లైఫ్ కోల్పోతామంటూ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. తన లాగే జీవితం కోల్పోయిన చందనాఖాన్ తారస పడింది.
ఇద్దరూ ఒక్కటయ్యారు. ఒకటే లక్ష్యం..ఒకటే గమ్యం. బాలలకు భరోసా ఇవ్వడం. ప్రతి ఒక్కరు చదువుకునేలా చేయడం. వారికి మెరుగైన ఆహారం కల్పించడం. ఇదంతా ఖర్చుతో కూడుకున్న పని. కానీ పట్టుదల వదలలేదు. ముంబయి నగరమంతా జల్లెడ పట్టారు. డబ్బున్న వాళ్లను అడిగారు. వారి నుండి సాయం లభించలేదు. అయినా కుంగి పోలేదు. చందనా ఖాన్ ఓ ఎన్జీఓతో కలిసి సర్వీస్ అందిస్తోంది. బాలల కోసం ఏర్పాటైన బాలక్ నామా పత్రికకు ఎడిటర్‌గా పనిచేసింది.
నోయిడాలో చిన్న గది తీసుకుని అనాధ పిల్లలను చేరదీశారు. దానికి వాయిస్ ఆఫ్ స్లమ్స్‌గా పేరు పెట్టారు. అన్నింటిని వారే భరించారు. మెల మెల్లగా వీరు చేస్తున్న సేవా కార్యక్రమాలకు..తోడ్పాటుకు మరింత ఆసరా లభించింది. వందలాది మంది పిల్లలు వీరి చెంతన చింత లేకుండా ఉన్నారు. పిల్లలకు చదువుతో పాటు క్రియేటివిటి పెంచేలా ఫోటోగ్రఫీ, ఫ్యాషన్ డిజైనింగ్, డ్యాన్స్ లలో ట్రైనింగ్ ఇస్తున్నారు. పిల్లలకు బోధించేందుకు టీచర్లు పనిచేస్తున్నారు. ఇంకొందరు స్వచ్చంధంగా సేవలందిస్తున్నారు.
దారులు వేరైనా కాలం కలిపింది వీరిద్దరిని..అనాధ పిల్లలకు ఓ నమ్మకం..ఓ ఆశ..ఓ భరోసా వీరి రూపంలో అందుతోంది. సేవకు వెల కట్టలేం. త్రికరణశుద్ధితో సాయపడటం మాత్రమే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి