కేసీఆర్ అంతర్మథనం ..అంతటా ఆశ్చర్యం ..!
ఆయన ఏది మాట్లాడినా అది ఓ చరిత్ర. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నాయకుడు. ఎంతో మంది రాజకీయ ఉద్దండులను తన పదునైన మాటలతో ఆశ్చర్య పోయేలా చేసిన అధినేత. ప్రపంచ పోరాటపు పటంలో తనకంటూ శాశ్వతమైన చోటు సంపాదించిన ఘనమైన ప్రజా వారసత్వపు కలిగిన లీడర్. అతనే తెలంగాణ మట్టిలోంచి నిటారుగా మొలకెత్తిన మనిషి...కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. అపారమైన అనుభవం..అత్యద్భుతమైన ..అసాధ్యమైన జ్ఞానం స్వంతం చేసుకున్న మేధావి. పలు భాషల్లో పట్టు కలిగిన నేత. ఐటీ నుండి ఆధ్యాత్మికం దాకా అన్నింటిపై సాధికారకమైన పట్టు కలిగిన ఆయన ఉన్నట్టుండి ఓడిపోతే అన్న పదం వాడడం ప్రతిపక్షాలనే కాదు ప్రజలను తీవ్ర విస్మయానికి గురి చేసింది. అంతేనా స్వంత పార్టీ అభ్యర్థులే అవాక్కయ్యారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం సందర్భంగా గులాబీ బాస్ మాట్టాడిన మాటలు ఒకింత పునరాలోచనలో పడేశాయి.
అసెంబ్లీ రద్దు సందర్భంగా ఎంతో ఆర్భాటంగా ..ధీమాతో టీఆర్ ఎస్ అధినేత వంద సీట్లకు పైగా గెలుచు కుంటామని..డిసెంబర్ 11న ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి తానే నాయకత్వం వహిస్తానంటూ ప్రకటించారు. సమీకరణలు మారడం..పరిస్థితులు ఆశాజనకంగా లేక పోవడం..ప్రజా వ్యతిరేకత మూటగట్టు కోవడం..ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులకు నిరసన సెగలు ఎదురు కావడం ఒకింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎలాంటి సందర్బంలోనైనా సరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచే దమ్మున్న నేతగా కేసీఆర్‌కు పేరుంది. ప్రతి అంశంపై పట్టు కలిగి ఉండడం..సమగ్ర సమాచారాన్ని ఘంటా పథంగా ప్రజలకు వారి భాషల్లోనే తెలియ చెప్పడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. వృత్తి పరంగా రాజకీయ నేత అయినప్పటికీ కేసీఆర్ మాత్రం సాహితీ పిపాసకుడు. ఏ ప్రాంతానికి వెళ్లినా సరే..అక్కడి పరిస్థితులను..సమస్యలను ఆకళింపు చేసుకోవడం..అందుకు తగ్గట్టుగా జనాన్ని మెస్మరైజ్ చేయడం ఆయనకే చెల్లింది.
విపక్షాలను నామ రూపాలు లేకుండా చేయాలనే ప్లాన్‌తో కేసీఆర్ పరిపాలన చేపట్టి నుండి గ్రౌండ్ వర్క్ చేస్తూ వస్తున్నారు. ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిని గులాబీ కండువాలు కప్పి టీఆర్ ఎస్ లో చేర్చుకున్నారు. అంతేకాకుండా వారికి కేబినెట్‌లో పెద్దపీట వేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన సీనియర్ నేతలు కే.కేశవరావుతో పాటు ధర్మపురి శ్రీనివాస్‌కు మేలైన పదవులే అప్పగించారు. పట్నం మహేందర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, పోతుగంటి రాములు, మందా జగన్నాథం, తదితరులకు ప్రయారిటీ ఇచ్చారు. ఇంకో వైపు ఎంఐఎంతో అంతర్గత దోస్తీ కొనసాగిస్తూ వచ్చారు. కేంద్రంలో కొలువుదీరిన కమలానికి స్నేహ హస్తం చాపారు. నాలుగున్నర ఏళ్ల పాటు పవర్‌లో ఉన్న కేసీఆర్ ఉన్నట్టుండి ముందస్తుకు తెర తీసారు.
ప్రజా ఆశీర్వాద సభ పేరుతో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలలో జరిగిన సమావేశాల్లో ప్రజలను ఉద్ధేశించి టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ ఓడిపోతే నాకేం నష్టం జరగదు. ఫాం హౌస్‌లో వ్యవసాయం చేసుకుంటా. మళ్లీ ప్రజలకు కష్టాలు మొదలవుతాయి. కరెంట్ కష్టాలు స్టార్ట్ అవుతాయి..అయినా వచ్చేది మా అధికారమేనంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఓటమిని ఏనాడూ ఒప్పుకోని కేసీఆర్ ఇలాంటి మాటలు మాట్లాడడం వెనుక అర్థం ఏమై ఉంటుందని పార్టీ వర్గాలతో పాటు ప్రతిపక్షాలు ఆలోచనలో పడ్డాయి. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే తన వైపునకు తిప్పుకునే దమ్ము, ధైర్యం కేసీఆర్‌కు ఉంది. ప్రస్తుతం మరో సంగ్రామాన్ని తలపింప చేస్తున్న ప్రస్తుత ఎన్నికల్లో కేసీఆర్ ఇలాంటి మాటలు మాట్లాడటాన్ని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నేతలు, అభ్యర్థులు, అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.
ఏది ఏమైనా..కేసీఆర్..ఈ మూడు అక్షరాలు మరింత పవర్‌ను కలిగి ఉన్నాయి. ఆయనను తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు. గతం..వర్తమానం..భవిష్యత్ పట్ల పూర్తి పట్టు కలిగి ఉన్న నేత ఆయన. స్పష్టమైన విజన్..దానిని సాధించేందుకు కావాల్సిన అన్ని సాధనాలను కేసీఆర్ ఇప్పటికే సిద్ధం చేశారు. ఆ దిశగా పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం సై అంటున్నారు. మరో వైపు గతంలో జరిగిన ఎన్నికల కంటే ఈసారి ఎన్నికలు గులాబీ బాస్ పనితీరుకు అద్దం పట్టనున్నాయి. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మొదటిసారిగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రస్తుత అధ్యక్షుడు రాహుల్‌లు పర్యటించడం మరింత హీట్‌ను పెంచాయి. అన్ని పార్టీలకంటే కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో కు ఆదరణ పెరగడం అందరిని ఆలోచించేలా చేయడం విస్మయానికి గురి చేస్తోంది. కేసీఆర్ మనసులో ఏముందో ..ఆ కాలమే సమాధానం చెప్పాలి. అంతకవరకు వేచిచూడటం తప్ప చేయగలిగింది ఏమున్నది..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి