ప్రపంచానికే ఆదర్శం..లైఫ్ లైన్ ఎక్స్‌ప్రెస్
ప్రపంచ వ్యాప్తంగా ఎందరో బిలియనీర్లు, కరోడ్‌పతిలు..బిజినెస్ పీపుల్స్ ..సెలబ్రెటీలు ..ప్లేయర్స్ ..ఇలా చెప్పుకుంటూ పోతే ..అంతా డబ్బున్న వాళ్లే. టెక్నాలజీలో మార్పులు చోటు చేసుకున్నా ఇంకా పేదరికం పోలేదు. కోట్లాది జనంలో సగానికి పైగా కనీస అవసరాలకు నోచుకోవడం లేదు. ఆకలితో అల్లాడుతున్నారు. గుక్కెడు నీటి కోసం తల్లడిల్లుతున్నారు. ఇండియాలో విద్య, వైద్యం, ఉపాధి అందని ద్రాక్ష పండులా తయారైంది. లెక్కలేనన్ని సంక్షేమ పథకాలు..నీళ్ల లాగా నిధులు ఖర్చై పోతున్నాయి.
కానీ సామాన్య ప్రజలకు అందడం లేదు. తీవ్రమైన వివక్ష కొనసాగుతోంది. బతుకు దెరువు దొరకక తీవ్ర అనారోగ్యానికి ..చెప్పుకోలేని రోగాలకు లోనవుతున్నారు. ఎక్కువగా స్లమ్ ఏరియాలలో ఉండడం..మెరుగైన సౌకర్యాలకు నోచుకోక పోవడంతో వేలాది మంది వైద్యం సకాలంలో అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దేశం పల్లెల్లో జీవిస్తోంది. 75 శాతానికి పైగా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రైవేట్ రంగంలో కార్పొరేట్ కంపెనీలు ఎంటర్ కావడంతో ఆరోగ్యం పక్కదారి పట్టింది. అక్కడ కూడా జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నారు. బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. హాస్పిటల్ అంటేనే గుండె గుభేల్ అనే స్థాయికి తీసుకు వచ్చారు.
విద్య,వైద్యం ప్రాథమిక హక్కుల్లో చేర్చినా దానిని పాలకులు కాగితాలకే పరిమితం చేశారు. దీంతో అప్పులు చేసి బతకడం కోసం తీర్చలేక తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా పల్లెల్లో జీవిస్తున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఏకంగా రైలునే హాస్పిటల్‌గా మార్చిన చరిత్ర ఒక్క ఇండియాలోనే ఉన్నదంటే నమ్మశక్యంగా లేదు కదూ. ఇది వాస్తవం కూడా . వరల్డ్‌లోనే ఈ ట్రైన్ హాస్పిటల్ మొదటిది ఇదే. 1991 జూలై 16న మొదటిసారిగా ముంబయి ఛత్రపతి శివాజీ టెన్నెల్ నుండి ఈ లైఫ్ లైన్ ఎక్స్‌ప్రెస్ రైలు బయలు దేరింది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. గత 20 ఏళ్లుగా నిరాటంకంగా పేద రోగులకు ఉచితంగా సేవలు అందజేస్తోంది. ఇందులో కార్పొరేట్ హాస్పిటల్‌కు తీసిపోని విధంగా అన్ని రోగాలకు చికిత్స లభిస్తోంది. ప్రాథమిక చికిత్స, మందులు, మనుషులకు వచ్చే సమస్త రోగాలకు ఇక్కడ అద్భుతమైన శస్త్రచికిత్సలు చేస్తున్నారు. క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, గైనిక్ ప్రాబ్లమ్స్, చిల్ట్రన్స్ రోగాలను నయం చేస్తున్నారు.
ఆయా రైల్వే స్టేషన్‌లకు ఈ లైఫ్ లైన్ ఎక్స్‌ప్రెస్ రైలు చేరుకుంటుంది. ఇందులో నర్సులు, అటెండర్లు, డాక్టర్లు, అనెస్తీసియా , ఫిజియో థెరపిస్టులు సేవలు అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలే టార్గెట్. దీనికి మరో పేరు కూడా ఉంది..అదే జీవన్ రేఖ ఎక్స్‌ప్రెస్. ఈ అద్భుతమైన ఐడియాను క్రియేట్ చేసిన ఘనత ..ముంబయి కేంద్రంగా స్వచ్ఛంద సేవలు అందిస్తున్న ఎన్‌జీఓ ఇంపాక్ట్ ఇండియా ఫౌండేషన్ దే. ఎక్కడో దూరంగా ఉన్న హాస్పిటల్స్‌కు వెళ్లాలంటే ఎక్కువ సమయం పడుతుంది. ఖర్చులు కూడా ఎక్కువే. చికిత్సతో పాటు మందులకు కూడా భారీగా ఖర్చుచేయాల్సి ఉంటుంది. అదే ట్రైన్ అయితే బోగీలు ఉంటాయి. వాటిలోనే ఆక్సిజన్ అందించేలా చేయడం. అన్ని సౌకర్యాలు కల్పిస్తే బావుంటుందని ఒక సుదీర్ఘమైన నోట్‌ను రైల్వే శాఖకు అందజేసింది ఆ ఎన్జీఓ.
ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్న ఈ కార్యక్రమానికి రైల్వే శాఖ వెంటనే ఒప్పుకుంది. నీళ్లు, కరెంట్, నిర్వహణ అంతా రైల్వే శాఖ చూసుకునేలా..మందులు, ఆపరేషన్లు, సిబ్బందిని ఐఐఎఫ్ సమకూర్చేలా ఒప్పందం కుదురింది. ఈ లైఫ్ లైన్ ఎక్స్‌ప్రెస్‌కు మూడు కోచ్‌లు ఇచ్చింది రైల్వే. ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే వేలాది మంది పేదలకు లబ్ధి చేకూరింది. ఎందరికో తక్కువ టైంలో వైద్య సేవలు అందాయి. డాక్టర్లు , సిబ్బంది నిస్వార్థంగా సేవలందించారు. రోగుల సంఖ్య పెరగడం, బాధితులు రావడంతో క్యాన్సర్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేసేందుకు రైల్వే అదనంగా మరో రెండు బోగీలను ఏర్పాటు చేసింది. ఇందులోనే ఆపరేషన్ థియేటర్లు, రోగులకు టైంకు పాలు, ఆహారం అందించేందుకు క్యాంటీన్, ఉచితంగా మందుల దుకాణం అన్నీ ఇందులో ఉన్నాయి. దీంతో అనతి కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆ నోట ఈనోట పాకి..సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది..ఈ లైఫ్ లైన్ ఎక్స్‌ప్రెస్.
రోగులకు వచ్చిన తక్షణమే స్టాఫ్ టీ, స్నాక్స్ అందిస్తారు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులేమిటో సావధానంగా వింటారు. స్పెషలిస్టు డాక్టర్లతో బాధితులను అనుసంధానం చేస్తారు. ఆపరేషన్‌కు సిద్ధం చేస్తారు. రోగులు అన్న భావన లేకుండా చేస్తారు. బాధితులతో కలిసి పోతారు. ఎక్కడా నిర్లక్ష్యం కాని..డబ్బులు తీసుకోవడం కానీ ఉండదు. ఐఐఎఫ్ మదిలో మెదిలిన ఈ ఐడియా..వేలాది గ్రామీణ ప్రజల జీవితాలకు భరోసా ఇస్తోంది. భారత రైల్వే శాఖ చూపిన ఔదార్యం ఎందరికో పాఠంగా చదువుకునేలా చేసింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేందుకు ఎన్జీఓలు ముందుకు వస్తే..భావి భారతం రోగాల బారి నుండి గట్టెక్కే అవకాశం ఉంది. మిలియన్ ప్రజలు దీని సేవలు పొందారంటే ఆశ్చర్యం వేస్తోంది. కోట్లున్న మారాజులు ఒక్కసారి ఆలోచించండి..సంపాదించిన దాంట్లో కొంతైనా పేదలకు పంచండి. జీవితానికి సార్థకత ఏర్పడుతుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి