ధిక్కార పతాకం - మూగబోయిన స్వరం - జన నాయకుడు ఇక లేడు..!
విలువలే ప్రామాణికంగా బతికిన అరుదైన రాజకీయ నాయకుడు జార్జ్ ఫెర్నాండెజ్ ఇక సెలవంటూ వెళ్లిపోయారు. ఇందిర ఎమర్జెన్సీ కాలంలో ఉప్పెనలా ఎదిగివచ్చారు. అపారమైన అనుభవం కలిగిన వ్యక్తిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఈ దేశంలో జరిగిన ప్రధాన ఉద్యమాలతో జార్జ్ కు ప్రత్యక్షంగానో..లేక పరోక్షంగానో సంబంధం ఉంది. ప్రభాకరన్ స్థాపించిన ఎల్ టీటీఇకి ఆయన బేషరత్తుగా మద్ధతు ప్రకటించి అప్పట్లో సంచలనం రేపారు.
రాజకీయవేత్తగా..మేధావిగా..రచయితగా..జర్నలిస్టుగా..సంపాదకుడిగా..కార్మికపక్ష నేతగా ఎదిగారు. రాజకీయాలలో సుదీర్ఘమైన ప్రయాణం చేసిన ఆయన ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఉన్నత స్థాయి పదవులను చేపట్టినా ఏరోజు ప్రజలను మరిచి పోలేదాయన. ప్రపంచ చరిత్రలో అరుదైన రైల్వే సమ్మెకు నాయకత్వం వహించి రికార్డు సృష్టించారు. మానవుల పక్షాన నిలిచారు. ప్రజల గొంతుకకు ప్రాణం పోశారు. ముంబైలో హాకర్స్ యూనియన్ లీడర్‌గా జీవితాన్ని ఆరంభించిన ఫెర్నాండేజ్ అంచెలంచెలుగా ఎదిగారు. దేశ రాజకీయాలలో విస్మరించలేని నాయకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. ప్రజల హక్కులకు ఎక్కడ భంగం వాటిల్లినా అక్కడ వాలిపోయే వారు. ప్రజాస్వామికవాదులకు స్నేహ హస్తం చూపిన ఘనత ఆయనదే.
రామ్‌మనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్ ల ప్రభావంతో అసలైన సోషలిస్టు నేతగా అవతరించారు. కర్ణాటకలో 1930లో పుట్టిన జార్జ్ ఫెర్నాండెజ్ 2019లో కన్ను మూశారు. ఆయన మృతి పేదలకు..ప్రజలకు ..పోరాట శక్తులకు తీరని లోటుగానే భావించాలి. ఒక బలమైన పునాది ఇవాళ లేకుండా పోవడం బాధాకరం. ఆనాడు ఇపుడున్న పరిస్థితులు లేవు. ప్రతి చోటా నిర్బంధమే ..ఇందిరాగాంధి హవాను తట్టుకుని నిలబడటం మామూలు విషయం కాదు. ఎమర్జెన్సీ రోజుల్లో జైలుకు వెళ్లినప్పటికీ అక్కడ కూడా ఆయన ఊరుకోలేదు. జనపక్షమే వహించారు. నిర్బంధంలోంచే లోక్‌సభకు పోటీ చేశారు. భారీ మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు. ఎన్నికల ప్రచార సభల్లో జార్జ్ దే పైచేయి. నిగ్గదీసి సమస్యలను ప్రస్తావించడం..ప్రభుత్వ దమనకాండను ప్రశ్నించడం ..ప్రజలకు అర్థమయ్యేలా ప్రసంగించడం ఆయనకే చెల్లింది. అందుకే ఫెర్నాండెజ్‌ను అంతా తమ వాడిగా అక్కున చేర్చుకున్నారు.
చేతులకు సంకెళ్లతోనే కోర్టుకు హాజరయ్యారు. ఇందిరకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 1977లో జనతా ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. మల్టీ నేషనల్ కంపెనీలపై కొరడా ఝులిపించారు. కంటి మీద కునుకే లేకుండా చేశారు. వాజ్‌పేయి సర్కార్‌లో రక్షణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కార్గిల్ యుద్దం, పోఖ్రాన్ అణుపరీక్ష జరిగింది. సైనికుల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టారు. అనుకోని రీతిలో శవపేటికల కుంభకోణంలో ఇరుక్కోవడంతో అనూహ్యంగా పదవి నుండి తప్పుకున్నారు. 19 ఏళ్లపుడే కొంకిణి యువక్‌కు పనిచేశారు. కన్నడలో వచ్చిన రైతువాణి పత్రికకు, ఇంగ్లీష్ వీక్లీ ది డాక్‌మన్ కు ఎడిటర్‌గా వ్యవహరించారు. సోషలిజంపైనా, సమకాలీన రాజకీయాలపై అనేక వ్యాసాలు, పుస్తకాలు రాశారు. జార్జ్ ఫెర్నాండేజ్ స్పీక్స్ పేరుతో తన ఆత్మకథను రాసుకున్నారు.
ఫ్రీ థింకర్‌గా పేరు తెచ్చుకున్న జార్జ్..బీహార్ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. తొమ్మిది సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎంపికయ్యారు. జనతాదళ్ పార్టీలో ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారు. సమతా పార్టీని స్థాపించారు. 1946లో ప్రీస్ట్ గా శిక్షణ పొందేందుకు మంగళూరుకు వచ్చారు. అక్కడి నుండి జాబ్ కోసం ముంబయికి పయనమయ్యారు. అక్కడే పోరాటాలకు , ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. ట్రేడ్ యూనియన్ లీడర్‌గా ఎదిగారు. కార్మికులను కూడగట్టారు. బంద్‌లు, సమ్మెలు చేపట్టారు. కనీస వేతనాలు ఇవ్వాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. 1950 నుండి 1960 దాకా రైల్వే శాఖ కార్మికులతో పనిచేశారు. దక్షిణ ముంబయిలో కాంగ్రెస్ అభ్యర్థి పాటిల్ చేతిలో జార్జ్ ఓడిపోయారు. ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్‌కు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 1974లో దేశ వ్యాప్తంగా సమ్మె ప్రకటించారు.
ఇందిర ఎమర్జెన్సీని నిరసించారు. అండర్ గ్రౌండ్‌కు వెళ్లి పోయారు. 1976లో బరోడా డైనమెట్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. 1977లో ఎమర్జెన్సీ తొలగి పోయింది. ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ ఓటమి పాలైంది. జనతా సర్కార్ అధికారంలోకి వచ్చింది. బీహార్‌లోని ముజహర్‌పూర్ గెలుపొంది కేంద్ర మంత్రి పదవిగా బాధ్యతలు చేపట్టారు. అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ కంపెనీలు ఐబీఎం, కొకోకోలాలను దేశం నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత బరాక్ మిస్సైల్ స్కాండల్, తెహల్కా స్టింగ్ ఆపరేషన్ లో చిక్కుకున్నారు. కర్ణాటకలో జన్మించినా ముంబయి కేంద్రంగా చేసుకున్నా..చివరి వరకు ఆయన బీహార్ ను వీడలేదు.
జాబ్ కోసం ముంబయికి వచ్చిన ఆయన తన పోరాటాన్ని ఇక్కడి నుండే ప్రారంభించారు. రోడ్లపై పడుకున్నారు. జనం బాధలను దగ్గరుండి చూశారు. అదే సమయంలో సోషలిస్టు లీడర్ లోహియాను కలుసుకున్నారు. ఫుల్ టైం కార్యకర్తగా..కార్మిక నేతగా ఎదిగారు. ముంబయి లేబర్ మూవ్‌మెంట్ లో కీలక పాత్ర పోషించారు. సోషలిస్ట్ ట్రేడ్ యూనియన్ మూవ్‌మెంట్ లో చేరారు. పరిశ్రమల్లో, హోటళ్లలో, రెస్టారెంట్లలో పని చేసే వారికి కనీస వేతనాలు లేవని గ్రహించి..ఉద్యమించారు. కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడారు. జైలుకు వెళ్లారు. 1961 నుండి 1968 దాకా బాంబే మున్సిపల్ కార్పొరేషన్ సభ్యుడిగా సేవలందించారు.
మెట్రోపాలిటన్ సిటీలో లేబర్స్ ఇబ్బందుల గురించి నిలీదీశారు. అక్కడి నుండి 1967లో జనరల్ ఎలక్షన్లలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. సంయుక్త సోషలిస్ట్ పార్టీ నుండి సౌత్ బొంబాయి నుండి పోటీ చేసేందుకు పిలుపు వచ్చింది. రెండు దశాబ్ధాల రాజకీయ అనుభవం కలిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కే. ఎస్. పాటిల్‌కు మంచి పట్టుంది. ఆయనపైనే ఫెర్నాండెజ్ పోటీకి దిగారు. 48.5 శాతం ఓట్లతో పాటిల్‌పై జార్జ్ విజయం సాధించారు. దీంతో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన పాటిల్‌కు ఈ అపజయంతో ఫుల్ స్టాప్ పడ్డట్టయింది. ఆ సమయంలో జార్జ్ ఈజ్ జాయింట్ కిల్లర్ అనే పేరు వచ్చింది.
దేశ చరిత్రలో విస్మరించని రోజు ..సుదీర్ఘమైన పోరాటానికి పెట్టింది పేరు జార్జ్ . ఓ వైపు ఎమర్జెన్సీ అయినా..దేశంలోని కార్మికులందరినీ ఒకే తాటిపైకి తీసుకు వచ్చిన ఘనత ఆయనదే. ఆల్ ఇండియా రైల్వేస్ ఫెడరేషన్‌కు నాయకుడిగా ఉన్న జార్జ్..దేశ వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. 1947 నుండి 1974 వరకు పే కమిషన్స్‌ను మార్పు చేశారు. నేషనల్ కోఆర్డినేటింగ్ కమిటీ రైల్వేమెన్స్ స్ట్రగుల్ పేరుతో అన్ని రైల్వే కార్మిక యూనియన్లన్నీ ఒక్కటయ్యాయి. ప్రతిపక్ష పార్టీలు, నేతలు, వివిధ కార్మిక సంఘాలన్నీ ఒక్కటయ్యాయి. రైల్వే కార్మికుల న్యాయమైన పోరాటానికి మద్ధతు ప్రకటించాయి. ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ తో పాటు టాక్సీ డ్రైవర్లు ముంబయిలో సమ్మెకు దిగారు. గయ, బీహార్, తదితర ప్రాంతాలలో కార్మికులు రైల్వే ట్రాక్‌లపైకి వచ్చారు. తమ ఆందోళనను చేపట్టారు. మదరాసులోని ఇంటీగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుండి 10 వేల మంది కార్మికులు మూకుమ్మడిగా కార్మికుల మద్ధతు ప్రకటించారు.
దేశ వ్యాప్తంగా వేలాది మంది కార్మికులను అరెస్ట్ చేశారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కార్మికుల అణచివేతపై నిలదీసింది. 30 వేల మందికి పైగా అక్రమంగా అరెస్ట్ అయ్యారని పేర్కొంది. ఆ తర్వాత సమ్మెను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. అయినా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయలేదు. ఈ విషయంపై జార్జ్ మరో పోరాటానికి శ్రీకారం చుట్టారు. ఎమర్జెన్సీని ఎత్తి వేయడం..కార్మికులు , నేతలు బయటకు రావడం జరిగింది. సమ్మె ప్రభావంతో చాలా కంపెనీలు, సంస్థలు కనీస వేతన చట్టాన్ని అమలు చేయడం ప్రారంభించాయి. ఈ సమ్మె దేశ చరిత్రలో రికార్డుగా నిలిచి పోయింది. ఇదంతా జార్జ్ ఫెర్నాండెజ్ తీసుకున్న నిర్ణయం వల్లనే జరిగింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జనతాపార్టీ పవర్లోకి వచ్చింది. మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
దూరదర్శన్ కేంద్రాన్ని నవీకరణ చేశారు. కాంతి థర్మల్ పవర్ స్టేషన్‌ను ప్రారంభించారు. మహిళలే చేపట్టిన లిజ్జత్ పాపడ్ పరిశ్రమకు మరింత ఊతం ఇచ్చారు. వీపీ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. కొంకణ్ రైల్వే ప్రాజెక్టును చేపట్టారు. మంగళూరు నుండి ముంబయికి రైలు మార్గాన్ని సుగమం చేశారు. రక్షణ శాఖ మంత్రిగా కీలకమైన నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలోనే కార్గిల్ వార్ జరిగింది. పాకిస్తాన్ తోక ముడిచింది. పోఖ్రాన్‌లో అణు విద్యుత్ పరీక్షలు జరిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో స్నేహం నెరిపారు. తెహల్కా డిఫెన్స్ స్కాండల్ వెలుగులోకి వచ్చింది. దీంతో పదవి నుండి తప్పుకున్నారు. 2009లో రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకు వ్యతిరేకంగా ఏ ఒక్కరు నిలబడలేదు. ఇది ఆయనపై ఉన్న గౌరవానికి నిదర్శనం.
1997 వరకు తమిళ టైగర్స్‌కు బహిరంగంగానే మద్ధతు పలికారు. ఏకంగా ఢిల్లీలో సమావేశానికి హాజరయ్యారు. తమిళ్ గెరిల్లా గ్రూపులకు ఆయుధాలు అక్రమంగా సరఫరా చేశారన్న అపవాదును మూటగట్టుకున్నారు. అప్పటి శ్రీలంక ప్రభుత్వం బాహాటంగా ఫెర్నాండెజ్ పై విమర్శలు చేసింది. రక్షణ శాఖ మంత్రి ఎల్టీటీఇకి సపోర్ట్ చేస్తున్నారంటూ ఆరోపించింది. చైనాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న టిబిటెన్ రెఫ్యూజీలకు మద్ధతు పలికారు. మయన్మార్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న సంస్థలకు ఆయన ఊతమిచ్చారన్న అపవాదు మూటగట్టుకున్నారు. సిఐఏ, ఫ్రెంచ్ గవర్నమెంట్ నుండి అక్రమంగా ఎమర్జెన్సీ కాలంలో సోషలిస్ట్ పార్టీకి ఫండ్స్ వచ్చాయని అప్పట్లో ఇందిర ఆరోపించారు. మాథ్యూ శ్యాముల్ ఆధ్వర్యంలో తెహల్కా కోసం స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ వెస్ట్ ఎండ్ పేరుతో బంగారు లక్ష్మణ్, జయా జైట్లీలు అడ్డంగా ఇరుక్కున్నారు. వీరిద్దరు ఫెర్నాండెజ్ మనుషులేనని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.
ఆ తర్వాత జార్జ్ ప్రమేయం లేదని తేలిపోయింది. బరాక్ మిస్సైల్ స్కాండల్ వెలుగులోకి వచ్చింది. 2006లో సీబీఐ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. ఫెర్నాండెజ్, జయా జైట్లీతో పాటు మాజీ నేవీ చీఫ్ సుశీల్ కుమార్ కు ప్రమేయం ఉందంటూ ఆరోపణలు చేసింది. పోఖ్రాన్ అణు పరీక్షల సమయంలో చైనా దుందుడుకును ఫెర్నాండెజ్ ప్రశ్నించారు. సోనియా గాంధీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నో ఎత్తు పల్లాలు చవిచూసిన నేతగా..రాజకీయ నాయకుడిగా..వెన్ను చూపని వ్యక్తిగా ...కడదాకా సోషలిస్టునేనంటూ ప్రకటించిన జార్జ్ ఫెర్నాండెజ్ ..మనల్ని వీడి పోవడం బాధాకరం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి