బీజేపీపై కాంగ్రెస్ ఫైర్ - పౌర సమాజానికి పూర్తి మద్దతు

ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే రీతిలో కేంద్రంలో కొలువుతీరిన బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని జాతీయ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తోందంటూ ధ్వజమెత్తింది. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల జాబితా పేరుతో దేశ ప్రజల మధ్య మరింత విద్వేషాలు పెంచేలా చేస్తోందంటూ ఆరోపించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మెజారిటీ జనమంతా కుల, మతాలకు అతీతంగా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేసింది. తాజాగా బీజేపీ ఈ రెండింటినీ ఫోకస్ చేస్తూ ఎన్నికల ప్రచారం చేసినా, అధికారం కోల్పోయిందన్న విషయాన్నీ గుర్తించాలని హెచ్చరించింది. ప్రతి చోటా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యార్థులు, యువతీ యువకులు, ప్రజలతో పాటు రాజకీయ పక్షాలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు, ప్రజా సంఘాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. పాలన కూడా. దేశంలోని ప్రజలను మభ్య పెట్టేందుకే పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల జాబితాలను తెరపైకి తీసుకు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది...