ఇద్దరు చంద్రులు..ఉద్దండులు..ఘనాపాఠిలు -నిలిచేదెవ్వరు..గెలిచేదెవ్వరు
దేశమంత ఒక ఎత్తయితే..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిది మరో ఎత్తు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ఒక వెలుగు వెలిగింది. ప్రత్యేక రాష్ట్రాలుగా తెలంగాణ..ఆంధ్రప్రదేశ్ లు విడిపోయాక పరిస్థితులు మారి పోయాయి. ఇరు ప్రాంతాలకు ముఖ్యమంత్రులుగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు..నారా చంద్రబాబు నాయుడులు అపారమైన రాజకీయ అనుభవం కలిగిన వారు. ఇద్దరు ఉద్దండులు..ఘనులు.. రాజకీయ రణరంగంలో ఆరితేరిన యోధులు. అపర చాణుక్యులన్న పేరును మూటగట్టుకున్నారు.
ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను చిత్తు చేయడంలో ఎక్స్‌పర్ట్స్. పరిపాలనా పరంగా దేశ వ్యాప్తంగా చరిత్ర సృష్టించారు. వైకుంఠపాళి ఆటలో ఆరితేరిన వారు. ఒకప్పుడు ఇద్దరూ తెలుగుదేశం పార్టీలో ఉన్నవారే. మామకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లపాటు ఏపీని ఏలిన ఘనమైన చరిత్ర చంద్రబాబు నాయుడుకు ఉంది. ఆయన కేబినెట్‌లో డిప్యూటీ స్పీకర్‌గా ..ప్లానింగ్ ఎక్స్‌పర్ట్ కమిటీలో కేసీఆర్ ప్రధానమైన వ్యక్తి. ఎప్పటికప్పుడు ప్లాన్స్ రూపొందించడం..ఆచరణలో పెట్టడం..విపక్షాలు, ప్రత్యర్థులకు దిమ్మ తిరిగేలా షాక్‌లు ఇవ్వడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య.
బాబు ముందుచూపునకు..అభివృద్ధి మంత్రానికి ఆద్యుడైతే..దివంగత ఎన్టీఆర్‌ను ఆకర్షించి..మెప్పించిన ఘనత కేసీఆర్‌ది. మంత్రి వర్గ విస్తరణలో చంద్రబాబు ..కేసీఆర్‌కు నో చెప్పారు. దీనిని అవమానంగా భావించిన కల్వకుంట్ల ఏకంగా తన పదవికి రాజీనామా సమర్పించారు. బాబుకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఆయన రాజీనామాను ఈజీగా తీసుకున్న బాబుకు ..ఆ తర్వాత కాలంలో చుక్కలు చూపించారు కేసీఆర్. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. మరెన్నో అవమానాలను భరించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏ రకంగా మోసపోయిందో..గోస పడుతున్నదో కేసీఆర్ పసిగట్టారు. దీనినే అవకాశంగా మల్చుకున్నారు. తనను తాను అద్భుతమైన లీడర్‌గా మార్చుకున్నారు.
తెలంగాణ చరిత్ర, సంస్కృతి, యాస, భాషను అవలోకనం చేసుకున్న కేసీఆర్ దేశ రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారు. 14 ఏళ్లకు పైగా ఒంటరి పోరాటం చేశారు. సకల జనులను, ప్రజా సంఘాలను, మేధావులను, తెలంగాణలోని ప్రతి ఒక్కరిని కదిలించారు. ఉద్యమాలను నిర్వహించారు. తానే నాయకత్వం వహించి జనాన్ని ముందుండి నడిపించారు. జైలుకు వెళ్లారు. నిరసన దీక్ష చేపట్టారు. ప్రపంచాన్ని తన వైపు తిప్పుకునేలా తెలంగాణను తీర్చిదిద్దారు. సకల జనుల సమ్మెతో ప్రభుత్వాన్ని గడగడలాడించారు. అన్ని పార్టీలను ఒప్పించారు. కేంద్రంలో అప్పటి కాంగ్రెస్ ను ఒప్పించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రానంత వరకు ఢిల్లీ నుండి హైదరాబాద్‌లో కాలు పెట్టనంటూ ప్రతిన బూనారు.
దేశ వ్యాప్తంగా ప్రధాన పార్టీలన్నింటిని కూడగట్టారు. పార్లమెంట్‌లో బిల్లు పాస్ అయ్యేలా చేశారు. అసాధ్యమనుకున్న ప్రత్యేక రాష్ట్ర సాధనను ఆచరణలో తీసుకు వచ్చి తాను అసలైన..సిసలైన ప్రజా నాయకుడినని నిరూపించుకున్నారు. అనంతరం తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ ..పరిపాలనలో మరింత దూకుడు పెంచాలన్నా..కొత్త రాష్ట్రంలో నెలకొన్న ఇబ్బందులు తొలగాలన్నా..
అభివృద్ధిలో ముందంజలో ఉండాలంటే తనలాంటి విజన్ ఉన్న నాయకుడు కావాలంటూ మాట మార్చారు. తానే సీఎం కుర్చీని ఆక్రమించారు. ఎక్కడలేని సంక్షేమ పథకాలు, కార్యక్రమాలతో పేరు తెచ్చుకున్నారు. కేంద్రంతో కుస్తీ పడ్డారు. మోడీతో సఖ్యత కొనసాగించారు. మొదట్లో సోనియమ్మ దేవత అని ప్రశంసించిన ఆయనే దెయ్యం అని వర్ణించే స్థాయికి దిగజారారు. బంపర్ మెజారిటీతో పవర్లోకి వచ్చిన కేసీఆర్ లోపాయికారీగా ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నారు.
తొమ్మిది నెలలు ఉండగానే ముందస్తుగా ప్రజల అనుమతి లేకుండానే ప్రభుత్వాన్ని రద్దు చేశారు. సర్కార్ అంటేనే కేసీఆర్ ..కేసీఆర్ అంటేనే తెలంగాణ అనే స్థాయికి తీసుకు పోయారు. తన కొడుకును రాజకీయ వారసుడిగా ప్రకటించారు. తన పరివారానికి పెద్దపీట వేశారు. ఎవరు ఏమన్నా సరే డోంట్ కేర్ అన్నారు. మాటల తూటాలు పేల్చుతూ..ప్రగతి భవన్‌ను తన స్వంతానికి వాడుకున్నారు. అక్కడి నుండే పాలనను నడిపించారు. ఫాం హౌస్ నుండి నిర్ణయాలు తీసుకున్నారు.
చిన్న జీయర్ స్వామిని తన కుర్చీలో కూర్చోబెట్టారు. యజ్ఞ యాగాలతో కాలాన్ని గడిపారు. ఒన్ మెన్ షో నిర్వహించారు. ఇదే సమయంలో పాలనా పరంగా ఏపీ, తెలంగాణ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది. బాబు కేసీఆర్‌పై నిప్పులు చెరగడం..కేసీఆర్ బాబును టార్గెట్ చేయడం షరా మామూలైంది. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు గవర్నర్ నరసింహన్ ప్రయత్నాలు చేశారు. ఓటుకు నోటు కేసు దెబ్బకు ఇద్దరు చంద్రుల మధ్య మరింత దూరం పెరిగింది.
నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరుకుంది వీరిద్దరి రాజకీయం. ఈ క్రమంలో కేసీఆర్‌ను మోడీ దగ్గరకు తీశారు. బాబుకు కటీప్ చెప్పారు. కేంద్ర మంత్రి వర్గంలో ఉన్న టీడీపీ అనూహ్యంగా వైదొలిగింది. ఇరు పార్టీల మధ్య ఉన్న స్నేహం బెడిసి కొట్టింది. ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. థర్డ్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ ఇతర రాష్ట్రాలు తిరిగారు. అందరినీ కలిశారు. కానీ సక్సెస్ కాలేక పోయారు. మోడీ, కేసీఆర్‌లు తనను దెబ్బ కొట్టే ప్లాన్ అమలు చేస్తున్నారని పసిగట్టిన చంద్రబాబు ..వీరిని టార్గెట్ చేశారు.
బీజేపీతో కలిసి నాలుగన్నర ఏళ్ల పాటు దోస్తీ కట్టిన బాబు ఊహించని రీతిలో రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. ఏ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ ఏర్పడిందో..అదే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు. కర్ణాటక ఎన్నికల్లో ఇరు పార్టీలు స్నేహ హస్తం చాపారు. తెలంగాణలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడేలా చేశారు. ఎలాగైనా సరే ఈసారి కేసీఆర్‌ను గద్దె దించాలని బాబు పట్టుదలతో ఉన్నారు.
ఒకప్పుడు ఒక్కటైన ఇద్దరు చంద్రులు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారారు. హైదరాబాద్‌ను ఐటీ పరంగా ప్రపంచం గర్వించేలా చేసిన ఘనత చంద్రబాబుదైతే. దేశరాజకీయాలతో నూతన అధ్యాయానికి తెర తీసిన చరిత్ర కేసీఆర్‌ది. ఇపుడు రాజకీయ ఉద్ధండులైన వీరిద్దరి మధ్య పోటీ నడుస్తోంది. బాబు మంత్రాంగం..చాణక్యం ఫలిస్తుందా లేక కేసీఆర్ రాజకీయ అనుభవం ఆచరణలోకి వస్తుందో చూడాలి. అంతదాకా కొన్ని రోజులు ఆగాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి