రసకందాయం..ఏపీ రాజకీయం..! -కుర్చీలాటలో కింగ్ మేకర్ ఎవ్వరో
ఇండియన్ పాలిటిక్స్‌లో ఒకప్పుడు నార్త్ ఇండియన్స్ దే హవా. ఇపుడు సీన్ మారింది. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు చక్రం తిప్పడం ప్రారంభించారు. తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో దివంగత ఎన్టీఆర్ ఢిల్లీ రాజకీయాలను ప్రభావితం చేశారు. తమిళనాట ఎంజీఆర్..కుమారి జయలలిత, కరుణానిధి , కర్ణాటకలో దేవెగౌడ, శివరాజ్ పాటిల్ లాంటి వాళ్లు పేరొందారు. ఏపీ వరకు వస్తే చంద్రబాబు పాలిటిక్స్‌లో కింగ్ మేకర్‌గా నిలిచారు. యుపీఏలో అన్ని పార్టీలను కూడగట్టడం వాజ్‌పేయిని ప్రధాని చేయడం, జీఎంసీ బాలయోగిని స్పీకర్‌గా, అబుల్ కలాంను ప్రెసిడెంట్ కుర్చీలో కూర్చోబెట్టే దాకా బాబు తన మంత్రాంగాన్ని సమర్థవంతంగా నడిపించారు.
బాబు ఎక్కడికి వెళ్లినా వార్తే..ఓ సంచలనమే. సౌత్ ఇండియా అంటేనే ఒకరకమైన ఏవగింపు ..ఢిల్లీలోని అన్ని పార్టీలకు..పాలకులకు..దానిని బాబు, కేసీఆర్‌లు మార్చేశారు. ఈ ఇద్దరు చంద్రులు ట్రబుల్ షూటర్స్‌గా..అపర చాణుక్యులుగా ..మోస్ట్ ఫేవరబుల్ లీడర్స్‌గా పేరొందారు. హస్తినలోని అన్ని ప్రింట్ అండ్ మీడియా ఇపుడు దక్షిణాది రాష్ట్రాల వైపు దృష్టి పెట్టాయి. ములాయం, నవీన్, లాలూ , మాయావతి, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, తమిళనాట స్టాలిన్, కర్ణాటక దేవెగౌడ, అఖిలేష్ యాదవ్ లాంటి వారిని ఒక తాటిపైకి తీసుకు రావడంలో బాబు సక్సెస్ అయ్యారు. థర్డ్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ ట్రై చేశారు. మళ్లీ ఢిల్లీలో చక్రం తిప్పుతానంటూ ప్రకటిస్తున్నారు.
ఇదిలా ఉంటే దేశ రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొన్నేళ్లుగా బద్ధ శత్రువులుగా ఉన్న కాంగ్రెస్‌తో టీడీపీ స్నేహం చేసింది. బాబు..రాహుల్‌లు మోడీ, కేసీఆర్‌లను గద్దె దించాలన్న లక్ష్యంతోనే కలిసామని ప్రకటించారు. ప్రతిష్టాత్మకంగా మారిన సార్వత్రిక ఎన్నికల్లో సీపీఐ, టీజేఎస్, కాంగ్రెస్ పార్టీలతో కలిసి టీడీపీ మహాకూటమిగా ఏర్పడి బరిలో నిలిచింది. ఇద్దరూ కలిసి ప్రచార సభల్లో, రోడ్ షోల్లో పాల్గొన్నారు. తెరాస, బీజేపీల ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు.
ఇండియన్ పాలిటిక్స్‌లో చక్రం తిప్పుతున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన సమయంలో అన్నింటిని తట్టుకుని నిలబడ్డారు. ప్రభుత్వానికి కావాల్సిన మెజారిటీని సాధించారు. తొమ్మిదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్నారు. రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలను తట్టుకుని నిలబడ్డారు. ఒంటరి పోరాటం చేశారు. తన వారు హత్యలకు గురైనా చెక్కు చెదరలేదు.
వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేసింది. జగన్ విస్తీతంగా పర్యటించారు. ఇప్పటికీ పాదయాత్రల పేరుతో నడుస్తూనే ఉన్నారు. ఏపీ సర్కార్ భూములను కొల్లగొట్టిందని, అక్రమాలకు పాల్పడిందని, నేరస్తులను ప్రోత్సహిస్తోందని, విపక్షాలను టార్గెట్ చేస్తోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఎలాగైనా ఏపీకి ముఖ్యమంత్రి కావాలని పావులు కదుపుతున్నారు. జైలుకు వెళ్లి వచ్చారు. కాంగ్రెస్‌తో ఉన్న ఆయన బయటకు వచ్చారు. స్వంతంగా పార్టీ పెట్టారు.
ఆర్థిక నేరాల అభియోగం మీద అప్పటి డీజీపీ లక్ష్మినారాయణ జగన్‌ను జైలుకు తరలించారు. విడుదలయ్యాక..ఏపీపై కాన్ సెంట్రేషన్ చేశారు. తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన వారు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఇపుడు లోపాయికారీగా టీఆర్ఎస్‌తో జత కట్టారన్న ఆరోపణల్ని టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్నారు. డోంట్ కేర్ అంటూ..సమస్యలపై నిలదీస్తున్నారు. జనంలోకి వెళుతున్నారు. దీంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇపుడే ఎన్నికల వాతావరణం నెలకొంది.
చంద్రబాబు మాత్రం కూల్‌గా తన పని తాను చేసుకు పోతున్నారు. నాలుగున్నర ఏళ్లుగా బీజేపీతో దోస్తీ కట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో సయోధ్య కుదుర్చుకుని ఎన్నికల్లోకి వెళ్లారు. మళ్లీ పవర్‌లోకి వచ్చారు. అభివృద్ధి, ముందుచూపు , ఐటీ పట్ల అపారమైన అభిమానం కలిగిన చంద్రబాబు ప్రపంచంలోనే సింగపూర్ తరహాలో ఏపీని మార్చేందుకు కష్టపడుతున్నారు. చాలా సార్లు ఇతర దేశాలకు వెళ్లి వచ్చారు. ఎక్కడ టాలెంట్ ఉన్నా..ఎవరైనా కనబర్చినా వెంటనే గుర్తించి ప్రోత్సహించడంలో బాబుకు బాబే సాటి. ఈ విషయంలో డౌట్ లేదు.
తన కేబినెట్‌లో ఎస్‌సీ, ఎస్టీ, మహిళలకు చోటు కల్పించారు. తన కొడుకు లోకేష్ బాబుకు ప్రాముఖ్యత కలిగిన ఐటీ శాఖ అప్పగించారు. తెలంగాణతో ఏపీ ధీటుగా పోటీ పడుతోంది. టెక్నాలజీని అందిపుచ్చు కోవడంలో, స్కిల్ డెవలప్‌మెంట్‌లో నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడం, ఉపాధి అవకాశాలు కల్పించడంలో లోకేష్ సక్సెస్ అయ్యారు. తండ్రి గన్నవరం, అమరావతిని . ఏపీని, రోల్ మోడల్‌గా చేసేందుకు ప్రయత్నం చేస్తుంటే..కొడుకు ఐటీని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.
కేబినెట్‌లొ కొందరు అప్ డేట్ కాక పోవడంపై బాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా..వారిని కూడా ఎప్పటికప్పుడు దగ్గరుండి నడిపిస్తున్నారు. ఎలాగైనా సరే ఈసారి జరగబోయే ఎన్నికలు బాబు భవిష్యత్‌కు ఒక అగ్ని పరీక్ష. ఓ వైపు కమలనాథులతో కటీఫ్ చెప్పడం, ధర్మ సభ పేరుతో సమావేశాలు నిర్వహించడం , ఏకంగా ఇండియన్ పీఎం మోడీని ఢీకొనడం బాబు చేశారు.
ఒక రకంగా ఆయన ధైర్యానికి మెచ్చు కోవాల్సిందే. ఎక్కడా తనకు ఎదురే లేకుండా చేసుకున్న మోడీ పరివారానికి బాబు ఎదురు తిరగడం, విపక్షాలను ఏకం చేయడం మింగుడు పడడం లేదు. బాబును దెబ్బ తీసేందుకు నానా రకాలుగా ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ ఎప్పటికపుడు జాగ్రత్త పడుతూ ఒంటరి పోరాటం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బాబు రాహుల్‌తో జత కట్టారు. రాబోయే ఎన్నికల్లో ఇరు పార్టీల ఓటు బ్యాంకు మరింత బలపడే అవకాశం ఉంది.
గత ఎన్నికల్లో టీడీపీకి బహిరంగంగానే మద్ధతు పలికి ప్రచారంలో పాల్గొన్న పవర్ స్టార్ కొత్త పార్టీ జనసేనతో ముందుకు వచ్చారు. ఆయన చంద్రబాబును టార్గెట్ చేశారు. ఏపీ పేదల భూములు లాక్కున్నదని, ఉద్దానం లాంటి సంఘటనలు జరగడం బాధాకరమని, రాబోయేది తమ సర్కారేనంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు. ఏకంగా బాబును, కొడుకును టార్గెట్ చేశారు. ఢిల్లీలో పీఎం మోడీతో స్నేహం చేస్తూనే బాబుపై విరుచుకు పడుతున్నారు. అనంతపురం వెళ్లారు. అక్కడ జనం ఎదుర్కొంటున్న సమస్యలపై నిలదీశారు. పవన్ కూడా సభలు నిర్వహిస్తున్నారు. చెన్నైకి వెళ్లిన సందర్భంగా తానే సీఎం అవుతానంటూ ప్రకటించారు.
ఓ వైపు మోడీ ఆయన పరివారం మరో వైపు వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్‌లు మూకుమ్మడి దాడి ప్రారంభించారు. ఇంత జరిగినా చంద్రబాబు మరింత రాటు దేలుతున్నారు. ముగ్గురే కాదు ఎంతమంది వచ్చినా సరే అభివృద్ధి ఆగదంటూ నినదిస్తున్నారు. పోరాటానికి, యుద్ధానికి సై అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో తిరిగి టీడీపీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో మరింత బలాన్ని పెంచుతూ నడిపిస్తున్నారు.
ఇటు తెలంగాణలో టీడీపీ విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుంటే..అటు ఏపీలో ముక్కోణపు పోటీని ఎదుర్కోబోతోంది. ఏ సమయంలోనైనా..ఏ సమస్య వచ్చినా తట్టుకుని నిలబడే రాజకీయ చైతన్యం , అనుభవం కలిగిన ట్రబుల్ షూటర్ చంద్రబాబుకు రాబోయే ఎన్నికలు మాత్రం కత్తి మీద సామేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజలు అభివృద్ధిని చూస్తారా లేక విపక్ష నేతల ఆరోపణలు, విమర్శలకు ఓటు వేస్తారో వేచి చూడాలి. అంత దాకా ఏపీలో కుర్చీ కోసం ఆట కొనసాగుతూనే ఉంటుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి