నెట్టింట్లో కవాతు చేస్తున్న కవిత్వం
పద్యమో..కవిత్వమో..సాహిత్యమో అనే సరికల్లా కొంత నిర్లక్ష్యం..ఒకింత ఏహ్యభావం ఉండేది. అప్పట్లో గద్యానికి..పద్యానికి ..ఆశు కవిత్వానికి విపరీతమైన ఆదరణ ఉండేది. టెక్నాలజీ మారాక..ఇంగ్లీష్ ప్రాబల్యం పెరిగాక ..మాతృభాషకు ప్రమాదం ఏర్పడింది. వీటన్నింటిని దాటుకుని ..డాలర్లు..నోట్ల కట్లను దాటేసి సాహిత్యం సుసంపన్నమైన రీతిలో సమున్నతమైన స్థానంలో నిలబడింది. కళలన్నా..లిటరేచర్ అన్నా..సామాజిక శాస్త్రాలంటే ఈ ప్రభుత్వాలకు..పాలకులకు అంతగా పట్టదు. కార్పొరేట్ కంపెనీలు..లావాదేవీలు..వ్యాపార..వాణిజ్య పరమైన ఒప్పందాలు..లోపాయికారీ బినామీల భూములపై కన్నేయడం..ఆస్తులను పెంచుకోవడం..ఐటీ జపం చేయడంతోనే సరిపోతోంది.
మనం మన భాష మాట్లాడం. పక్కోళ్లను ..ఫారినర్స్‌ను ఫాలో అవడం..వారి వేష భాషలను ప్రేమించడం..తీరా ఉన్న మూలాలను మరిచి పోవడం షరా మామూలే అయిపోయింది. ఇదంతా ప్రపంచీకరణ పుణ్యం. అమెరికా పనిగట్టుకుని సాంస్కృతిక విధ్వంసానికి పాల్పడుతోంది. ఈ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది. దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధిస్తూ..ఆయుధాలు పోగేసుకుని ..తన గుప్పిట్లోకి తీసుకునేందుకు తంటాలు పడుతోంది. ఆధిపత్యం కోసం జరుగుతున్న ఈ సమయంలో ..కలాలు మరింత పదునెక్కుతున్నాయి.కళాకారులు..కవులు..రచయితలు..మేధావులు..సామాజికవేత్తలు..పౌర సమాజపు కార్యకర్తలు ..కార్మికులు ..అన్ని రంగాలకు చెందిన వారు తమ గొంతుకలను వినిపిస్తున్నారు. సమాజాన్ని ప్రభావితం చేసేలా..ప్రజల పక్షాన పోరాడుతున్నారు. జనాన్ని చైతన్యవంతం చేసేందుకు నడుం బిగించారు. అరేబియన్, ఆఫ్రికన్, లాటిన్ అమెరికా లాంటి దేశాలలో సాహిత్యం జనపక్షాన నిలబడింది.
ప్రజా వ్యతిరక పరిపాలన సాగిస్తున్న పాలకులపై..వారు చేస్తున్న దాష్టీకాలపై కలాలు కవాతు చేశాయి. అత్యద్భుతమైన సాహిత్యం వచ్చింది. కథ, కవిత, నవల, నాటకం, పాటలు, సినిమా మాధ్యమాలన్నీ జనం కోసం గళమెత్తాయి. ప్రజలే చరిత్ర నిర్మాతలు..వారు లేకుండా ఏ ప్రపంచం లేదంటూ యువత రోడ్ల మీదకు వచ్చారు. నియంతలు కళల్ని పట్టించు కోలేదు. కలాలను..గళాలను..కెమెరాలను..అణచి వేసే ప్రయత్నం చేశాయి..ఇప్పటికీ చేస్తూనే ఉన్నాయి. అయినా ఎక్కడా తగ్గడం లేదు. బుల్లెట్లు గాయాలు చేసినా..గుండెల్ని చీల్చినా ..సామాజిక మాధ్యమం రాజ్యమేలుతున్నా సరే..సాహిత్యం నిటారుగా నిలబడ్డది. ఓ వైపు స్మార్ట్ ఫోన్లలో తెలుగు వెలుగుతోంది. మన భాష జనం గోసను కళ్లకు కట్టినట్లు చెబుతోంది. యువత కవిత్వాన్ని ఆశ్రయిస్తోంది. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం, ఫేస్ బుక్, యూట్యూబ్, లింక్‌డ్ ఇన్ , టంబ్లర్, తదితర మాధ్యమాల్లో కళాకారులు తమ కలాలకు పదును పెడుతున్నారు. తమ గళాలను సవరించుకుంటూ చైతన్యవంతం చేస్తున్నారు.
నియంతలు కలాలు, కెమెరాలు, గళాలను మట్టుబెట్టాలని చూశాయి. ఎందరో కవులు ఉరితీయబడ్డారు. ఇంకొందరు తూటాలకు బలయ్యారు. సిరియాలో స్వేచ్ఛ కోసం రేగిన మంటలు ప్రపంచాన్ని కమ్ముకునేలా చేశాయి. ప్రపంచం నివ్వెర పోయేలా చేసిన తెలంగాణ పోరాటమంతా కవులు, కళాకారులు, రచయితలతో నిండి పోయింది. ఈ ప్రాంతపు ప్రజల విముక్తి కోసం కవితలల్లారు..పాటలు కట్టారు. ఆటలు ఆడారు. బతుకమ్మలై ..బందూకులై ఎక్కుపెట్టారు. కేంద్రం దిగి వచ్చింది. అడవి బిడ్డలు ప్రజా వ్యతిరేక పాలకుల భరతం పట్టారు. ఇండియా అంతటా ఇదే స్ఫూర్తి కొనసాగుతోంది. యువతీ యువకులు కవిత్వంతో కరచాలనం చేస్తున్నారు. ఇంష్టాగ్రామ్‌లో యువత కవిత్వంతో అలరిస్తోంది. ఓ వైపు డాలర్లను ప్రేమిస్తూ..అమెరికా జపం చేస్తున్న వారిని తోసిరాజని వీరు జీవితాన్ని వెలిగించేది కవిత్వమేనంటూ కవితలు అల్లుతున్నారు. వారెవరో తెలుసు కోవాలంటే ఇది చూడాల్సిందే.
వినతి బోలా - పట్టుమని 25 ఏళ్లు కూడా నిండని ఈ అమ్మాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాది మందిని తన కవిత్వంతో ప్రభావితం చేస్తుంది. వందలాది మంది ఆమె రాసిన పదాలకు ఫిదా అవుతున్నారు. రైటింగ్స్ ఆఫ్ బోలా పేరుతో ప్రతి రోజూ కవిత రాస్తూ చైతన్యవంతం చేసేస్తోంది. నేను పూలలో..పూల పాన్పులో పుట్టలేదు. పుట్టెడు దుఖాన్ని దాటుకుని జన్మించానంటోంది. ప్రస్తుతం లాయర్ కోర్సు చేస్తోంది. కవిత్వమే కాసింత ఊరటనిస్తోంది అంటోంది.
మేఘా రావు - ఈమె పక్కా ఫెమినిస్టు. మహిళలు లేకుంటే ఈ ప్రపంచం ఎక్కడిదని ప్రశ్నిస్తోంది. అంతటా అతివలే. మేం అక్కరానికి వ్యక్తులం. అయినా మేం తల్చుకుంటే ఏమైనా చేయగలం అంటోంది మేఘా రావు. అందరికీ ఆదివారాలున్నాయి. రేయింబవళ్లు శ్రమించే మా లాంటి వాళ్లకు సెలవెందుకు లేదంటూ కవితల ద్వారా నిలదీస్తోంది.
ఖవాజా ముసాదిక్ - పోయెట్ ఆఫ్ బ్లూస్ పేరుతో ఇన్‌స్టాగ్రాంలో కవితల్ని వండి వడ్డిస్తున్నారు. తక్కువ పదాలు ..ఎక్కువ సందేశాలు ఇచ్చేలా రాస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి ఖర్చు లేదు. ఎవరినీ ఆశ్రయించాల్సిన పనిలేదంటున్నారు. కవిత్వం ఒక జీవనాదం. దానిని కాదనడానికి మనమెవ్వరం అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎముకలు పెసలుగా మారాయని మీరు బాధ పడనక్కర్లేదు. చేతులు ఒంగి పోతున్నాయని ఆందోళన పడాల్సిన పనిలేదు..అన్నింటిని కప్పేసే శరీరం వుందిగా..ఇంకెందుకు ఆలస్యం అంటూ ప్రజా చైతన్యపు స్రవంతిని రగిలిస్తున్నారు ముసాదిక్.
వీరితో పాటు ప్రతీక్షా కత్తార్, మేధా శర్మలు సైతం ఇన్‌స్టాగ్రాంలో కవిత్వాన్ని పండిస్తున్నారు. సామాజిక సమస్యలే వీరి కవిత్వానికి వస్తువులు. కట్టెపుల్లా..సబ్బుబిల్లా..కాదేదీ కవిత్వానికి అనర్హం అన్న మహాకవి శ్రీశ్రీ మాటల్ని వీరు నిజం చేస్తున్నారు. వీలైతే మీరు ట్రై చేయండి. పోయేదేముంది కాసింత ఇంకు తప్ప. వితవుట్ పోయెట్రీ దేర్ ఈజ్ నో లైఫ్ .అన్న వోల్టేర్‌ను ఈ కవులు బతికిస్తున్నారు. ఏమనగలం వీరిని ఫాలో కావడం తప్ప.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి