సారుకు స‌లాం - జ‌య‌హో జ‌స్టిస్

పోరాటాల‌కు..త్యాగాల‌కు..బ‌లిదానాల‌కు చిరునామా తెలంగాణ‌. అపార‌మైన వ‌న‌రులు ..అద్భుత‌మైన చ‌రిత్రను స్వంతం చేసుకున్న ఈ గ‌డ్డ ఎంద‌రో వీరుల‌ను క‌న్న‌ది. మ‌రెంద‌రో బిడ్డ‌లను త‌న‌లో ఇముడ్చుకున్న‌ది. ఉస్మానియా ఊపిరి పోసింది. ఈ మ‌ట్టికి ఎన‌లేని క‌థ ఉన్న‌ది. దీని గురించి చెప్పాలంటే కొన్ని త‌రాలు..మ‌రికొన్నేళ్లు ప‌డుతుంది. ఈ గ‌డ్డ వీరులను క‌న్న‌ది. ప్ర‌పంచం నివ్వెర పోయేలా క‌వులు, క‌ళాకారులు, మ‌ట్టి బిడ్డ‌ల‌ను అందించింది.
అలాంటి వారిలో త‌రాలు గుర్తుంచుకునే మేధావిని..ద‌ర్మాన్ని కాపాడి..న్యాయాన్ని ర‌క్షించే న్యాయ‌మూర్తిని క‌న్న‌ది. అక్ర‌మార్కుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించి..అవినీతి ప‌రుల‌కు కునుకు లేకుండా చేసి..క‌ర‌ప్ష‌న్ కింగ్‌లుగా మారిన పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించి..ఎన్నో చారిత్రాత్మ‌క తీర్పులు వెలువ‌రించిన ..మ‌న అచ్చ‌మైన తెలంగాణ బిడ్డ బి. సుద‌ర్శ‌న్‌రెడ్డి. సారు గురించి ఎంత చెప్పినా త‌క్కువే.
ఆయ‌న వెలువ‌రించిన తీర్పులు.. ఆ సంద‌ర్బంగా చేసిన వ్యాఖ్యానాలు నేటికీ పాఠాలుగా మ‌నం చ‌దువుకోవ‌చ్చు. కోట్లాది రూపాయ‌లు చెంత‌కు చేరినా..పుట్టిప్ప‌టి నుంచి నేటి దాకా ఉన్న‌త ప‌ద‌వులు అధిరోహించినా సుద‌ర్శ‌న్ రెడ్డి చెక్కు చెద‌ర‌లేదు. నికార్స‌యిన వ్య‌క్తిత్వం..నిండుద‌నం..క‌చ్చిత‌త్వం..సూటిద‌నం..నిజాయితీకి నిలువుట‌ద్దంగా నిలిచారు. దేశానికి ఆయువు ప‌ట్టుగా ..సామాన్యుడికి గొంతుక‌గా ..స‌ర్వోన్న‌త‌మైన న్యాయ‌స్థానంగా భావించే ..సుప్రీంకోర్టుకు ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హించారు. వ‌ర్ధ‌మాన న్యాయ‌వాదులకు, న్యాయ‌మూర్తుల‌కు సుద‌ర్శ‌న్‌రెడ్డి మార్గ‌ద‌ర్శకంగా నిలిచారు.
నాలుగున్న‌ర సంవ‌త్స‌రాల పాటు దేశం గ‌ర్వించ‌దగిన తీర్పులు వెలువ‌రించిన ఘ‌న‌త ఆయ‌న‌దే. న్యాయం ఎక్క‌డుంద‌ని ప్ర‌శ్నించిన కోట్లాది జ‌నానికి ఆయ‌న దిక్సూచిలాగా నిల‌బ‌డ్డారు. ఒక్కో తీర్పు ఒక్కో జీవితానుభ‌వాన్ని ప్ర‌తిఫ‌లించేలా చేశారు మ‌న రెడ్డి.
2007 జ‌న‌వ‌రి 12న ఆయ‌న సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా అప్పాయింట్ అయ్యారు. రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ‌, ఆర్థిక నేర‌వ్య‌వ‌స్థ‌, ప‌న్నుల వ్య‌వ‌స్థ‌, న్యాయంతో పాటు మాన‌వ హ‌క్కులు..ఉల్లంఘ‌న ..ప‌రిర‌క్ష‌ణ లాంటి ఎన్నో క్లిష్ట‌మైన అంశాల‌పై పార‌ద‌ర్శ‌కంగా..ఎలాంటి ప‌క్ష‌పాతం లేకుండా నిబ‌ద్ధ‌త‌తో కూడిన తీర్పుల‌ను వెలువ‌రించారు సుద‌ర్ష‌న్ రెడ్డి. దేశ సంప‌ద‌ను కొల్ల‌గొట్టి ఇత‌ర దేశాల‌కు త‌ర‌లించిన బ్లాక్ మ‌నీ విష‌యంలో రెడ్డి ఇచ్చిన తీర్పు చారిత్రాత్మ‌క‌మైన‌ది.
ఎక్క‌డ వున్నా స‌రే ..ఎవ‌రైనా స‌రే..ఎంత‌టి వారైనా..ఏ స్థానంలో ఉన్నా స‌రే వారిని గుర్తించండి. వారిపై కేసులు న‌మోదు చేయండి. ఆర్థిక నేర‌గాళ్లుగా ప‌రిగ‌ణించి..వారెవ‌రో ..వారి చ‌రిత్ర ఏమిటో ప్ర‌జ‌ల‌కు తెలియ చెప్పాలంటూ చేసిన వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపాయి. విశ్రాంత ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఆధ్వ‌ర్యంలో విచార‌ణ చేప‌ట్టాల‌ని తీర్పు వెలువ‌రించారు. జ‌స్టిస్ రెడ్డి ..బెంచ్‌లో ఉన్నారంటే ప్ర‌భుత్వాలు గ‌డ‌గ‌డ లాడాయి. ఏ స‌మ‌యంలో
ఎలాంటి తీర్పు వినాల్సి వ‌స్తుందోన‌ని బెంబేలెత్తి పోయారు. అక్ర‌మార్కులు, మాఫియాలు, లంపెన్ గ్రూపులు, బిజినెస్ టైకూన్స్‌..ఇలా చెప్పుకుంటూ స‌భ్య స‌మాజాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్ర‌తి దానిపై వ్యాఖ్య‌లే కాదు తీర్పులు చెప్పారు.
న‌క్స‌లైట్ల పేరుతో అమాయ‌కులైన కోయ‌ల్ని, అడ‌వి బిడ్డ‌ల్ని వేధింపుల‌కు గురి చేయ‌డం చ‌ట్ట‌రీత్యా నేర‌మేన‌ని..ఇది పూర్తిగా మాన‌వ హ‌క్కుల‌కు భంగం వాటిల్ల‌డం త‌ప్ప మ‌రొక‌టి కాదంటూ సుద‌ర్శ‌న్ రెడ్డి చ‌త్తీస్‌గ‌ఢ్ ప్ర‌భుత్వానికి కోలుకోలేని షాక్ ఇచ్చారు. రాజ్యాంగం క‌ల్పించిన ప్రాథ‌మిక సూత్రాల‌కు భంగం క‌లిగిస్తూ..స‌మాన అవ‌కాశాలు క‌ల్పించ‌కుండా పాల‌కులు చేస్తున్న అనైతిక చ‌ర్య‌ల వ‌ల్ల‌నే ఇలాంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృత‌మ‌వుతున్నాయి.
సామాజిక అంత‌రాలు లేని స‌మాజం కోస‌మే మ‌నం రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న‌ది. ప్ర‌జ‌ల‌కు బాధ్య‌త వ‌హించ‌కుండా వ‌న‌రుల‌ను విధ్వంసం చేస్తూ పోతే ప్ర‌భుత్వాలు ఎలా మ‌న‌గ‌లుగుతాయ‌ని రెడ్డి సంధించిన ప్ర‌శ్న‌లు ఆయా కాలంలో ఏలిన పాల‌కులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి.
దేశం అంటే ..మ‌నుషుల స‌మూహం. ప్ర‌జ‌లే చ‌రిత్ర నిర్మాతలు. అంతిమంగా ఏ వ్య‌వ‌స్థ అయినా వారి సంక్షేమం కోస‌మే ప‌ని చేయాలి. ఓటు అనేది నోటుకు అమ్ముడు పోయేది కాదు..అది ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ క‌వ‌చం లాంటిది. పాల‌కులు ప్ర‌జ‌ల‌కు ..స‌మాజానికి ..అంతిమంగా అన్ని వ్య‌వ‌స్థ‌ల‌కు, సంస్థ‌ల‌కు ప‌రిర‌క్ష‌కులుగా..వాచ్ డాగ్ లాగా ఉండాలి. లేక‌పోతే ప్ర‌జాస్వామ్యం మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌క‌మ‌వుతుంది.
కోట్లాది మంది నేటికీ అవ‌కాశాలకు దూరంగా ఉన్నారు. వారు ఏం చేయాలో..ఎలా బ‌త‌కాలో తెలియ‌కుండానే చ‌నిపోతున్నారు. న‌దులు, నీళ్లు..అట‌వీ సంప‌ద‌, గ‌నులు..ఇలా ప్ర‌తిది ఈ ప్ర‌జ‌ల‌కు చెందిన‌దే. ప్రాథ‌మిక హ‌క్కులు ఉన్న‌ది పాల‌కుల‌కు వంత పాడ‌టానికి లేదా వారు పారేసే ఎంగిలి మెతుకుల‌కు కాదు..స‌మ‌స్త జ‌నానికి ర‌క్ష‌ణ క‌వ‌చం లాగా ఉండాల‌న్న‌దే కానిస్టిట్యూష‌న్ రాసుకోబ‌డ్డ‌ది.
తెలంగాణ‌లోని రంగారెడ్డి జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లానికి చెందిన ఈ తెలంగాణ బిడ్డ ఏది మాట్లాడినా అదో సంచ‌ల‌నం. దేశ వ్యాప్తంగా సుద‌ర్శ‌రెడ్డి మాట‌లు వైర‌ల్ అవుతాయి. అమాయ‌కులు ప్రాణాలు కోల్పోయారు. ఎంద‌రో బ‌లిదానాలు, ఆత్మ త్యాగాలు చేసుకున్నారు. అలుపెరుగ‌ని పోరాటాలు, ఆందోళ‌న‌లు చేప‌ట్టి ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో బ‌తికే ప‌రిస్థితులు లేక పోవ‌డంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న జ‌రుగుతోంద‌ని..ఇది స‌మాజానికి..ప్ర‌భుత్వానికి మంచిది కాద‌ని హెచ్చ‌రించారు. రెడ్డి స్వ‌చ్ఛ‌మైన తెలంగాణ వాది..ఆయ‌న హృద‌యం ఈ మ‌ట్టిదే. జ‌స్టిస్ ఏం చెప్పినా చ‌రిత్రే. ఇలాంటి వీరుని క‌న్నంద‌కు తెలంగాణ త‌ల్లికి వంద‌నాలు చెప్ప‌డం మ‌నంద‌రి క‌నీస ధ‌ర్మం. కాదంటే ..ఒప్పుకోక పోతే మ‌నం మ‌నుషులం కాకుండా పోతాం. ఈ మ‌ట్టికి చెరుపు చేసిన వాళ్ల‌వుతాం క‌దూ.!

కామెంట్‌లు