డర్టీ పాలిటిక్స్ - మిథాలీ ధైర్యానికి హ్యాట్సాఫ్ - బిడ్డా నిను మరువదు ఈ గడ్డ
ఇండియాలో ఉన్నన్ని డర్టీ పాలిటిక్స్ఇం కెక్కడా లేవనే చెప్పాలి. ఈ దేశాన్ని పాలకుల పేరుతో కార్పొరేట్ కంపెనీలు..బిజినస్ బఫూన్లు రాజ్యమేలుతుంటే డెమోక్రీసీ ఉందని ఎలా అనుకుంటాం. ఇండిపెండెన్స్ డే లేదా రిపబ్లిక్ డేల సందర్భంగా ఎగిరే జాతీయ పతాకాలను చూసి మనకు స్వేచ్ఛ లభించిందని ఆనంద పడతాం. మనమూ స్వీట్లు పంచుకుని మురిసి పోతాం. యధా మామూలుగా స్మార్ట్ ఫోన్లలో మునిగి పోతాం. దేశం ఏమై పోతేనేం ఎవ్వడికీ పట్టదు. జెండా అంటే జాతి నిర్మాణానికి..ఆత్మ గౌరవానికి ప్రతీక. అదో మార్చలేని సింబల్.
అదో బ్రాండ్. జనం ఆకాంక్షలకు ప్రతిరూపం. ఆశలకు ప్రతిబింబం. లెక్కలేనన్ని జాతీయ పతాకాలు ఎగిరే క్షణాలు ఒక్క ఆటల్లోనే కనిపిస్తాయి. కనువిందు చేస్తాయి. ఆటగాళ్లు పసిడి పతకాలతో విజేతలుగా జేజేలు అందుకుంటున్నప్పుడు వాళ్లు ఇండియన్ ప్లాగ్స్ పట్టుకుని ముద్దాడుతుంటే ..గుండెలు ఉవ్వెత్తున ఎగసి పడుతుంటాయి. అలాంటి అరుదైన క్షణాలు సామాన్యుల కంటే ప్లేయర్స్‌కే అనుభవంలోకి ఎక్కువ. ఇండియా అంటేనే క్రికెట్. ఇది మన ఆట కాదు. మన దేశపు క్రీడ. గ్రామీణ క్రీడలను ఏనాడో మరిచి పోయాం.
ఆసియన్ గేమ్స్ పుణ్యమా అంటూ వంద కోట్లకు పైగా జనాభాలో మన స్థానం ఆఖరులోనే. ఫుట్‌బాల్, వాలీబాల్, టెన్నిస్..ఇలా అన్ని క్రీడల్లోను మనం పడుతూ లేస్తున్నాం. ఏ దేశాల్లో లేని విధంగా ఇక్కడ రాజకీయాలకు చోటు ఎక్కువ. ఎందుకంటే వీరిని శాసించేది..నియంత్రించేది వీరే కనుక. ప్రపంచాన్ని క్రికెట్ ఊపేస్తోంది. శాసిస్తోంది. కోట్లాది అభిమానులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ఆట. బాల్‌కు బ్యాట్‌కు మధ్య జరుగుతున్న పోరులో బెట్టింగ్‌లు..కోట్లు..చేతులు మారుతున్నాయి.
ఇప్పటికే దీనిపై మ్యాచ్ ఫిక్సింగ్ భూతం కమ్మినా దాని ప్రభావాన్ని దాటుకుని బిలియన్ డాలర్ల మార్కెట్‌నుదాటేసింది.ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రీడా సంస్థల్లో బీసీసీఐ మొదటి పది స్థానాల్లో నిలిచిందంటే అర్థం చేసుకోవచ్చు..దాని పవర్ ఏమిటో. ఇటీవల జరిగిన వేలం పాటల్లో వేలాది కంపెనీలు స్పాన్సర్‌షిప్ దక్కించుకునేందుకు పోటీ పడ్డాయి. ఆఖరుకు మార్కెట్ దిగ్గజ కంపెనీ సోని దక్కించుకుంది. వివో ప్రకటనలకే పరిమితమైంది. ఈ దేశానికి ఏడాది కరువు వస్తే..తీర్చేంత సొమ్మును కలిగి ఉన్నది బిసీసీఐ.
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పేరుకు ఉందే కానీ..దీనిలో ఎన్ని సభ్య దేశాలున్నా ..ఇండియాదే పై చేయి. మోడీ సర్కార్ వచ్చాక బీసీసీఐపై లుక్ వేశారు. కొన్ని మార్పులు చేసేందుకు సై అన్నారు. కానీ దానిలోకే ఎంటర్ కానీయకుండా అడ్డుకున్నారంటే ఆశ్చర్యం వేయక మానదు. తమది స్వతంత్ర సంస్థ అని..తమ ఆస్తులను వెల్లడించమంటూ చేసిన బీసీసీఐ ప్రకటనకు భారత సమాచార హక్కు కమిషన్ తాఖీదులు ఇచ్చింది. దెబ్బకు దిగి వచ్చింది. సర్వోన్నత న్యాయ స్థానం చీవాట్లు పెట్టింది. ఈ దేశంలో ఏ సంస్థ అయినా..వ్యక్తులైనా సరే..రాజ్యాంగానికి, చట్టానికి లోబడి ఉండాల్సిందేనంటూ స్పష్టం చేసింది.
బీసీసీఐలో మహిళల కోసం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేశారు. క్రికెట్‌లో రిటైర్ అయిన వాళ్లను బోర్డు నియమించింది. భారత మహిళల క్రికెట్ జట్టుకు దశాబ్ధ కాలంగా ప్రాతినిధ్యం వహిస్తూ మహిళల వరల్డ్ కప్‌తో పాటు పలు కప్పులను ఇండియాకు అందించిన ఘనత మన హైదరాబాదీ అమ్మాయి మిథాలీ రాజ్‌కు దక్కుతుంది. ఇపుడు దేశ మంతటా ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. వెస్ట్ ఇండీస్‌తో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌లో అర్ధాంతరంగా మిథాలీరాజ్‌ను పక్కన పెట్టడం తీవ్ర విమర్శలు చెలరేగాయి. దేశమంతటా ఈ నిర్ణయాన్ని తప్పు పడుతూ అభిమానులు బీసీసీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత 20 ఏళ్లుగా అన్ని ఫార్మాట్‌లలో మిథాలీ రాజ్ రాణిస్తున్నారు. అద్భుతమైన ప్రదర్శనతో ఎన్నో విజయాలు ఇండియా జట్టుకు అందించారు. పూర్తి ఫిట్ నెస్. అద్భుతమైన ఫాం. మైదానంలో చురుకైన పాత్ర పోషిస్తున్న ఆమెను కావాలనే పక్కన పెట్టారన్న అపప్రదను మూటగట్టుకుంది. దీనిని తట్టుకోలేక ..కన్నీటి పర్యంతమైన మిథాలీ ఏకంగా ఈమెయిల్ ద్వారా తనకు జరిగిన అన్యాయంపై గళం విప్పారు. నేరుగా బీసీసీఐ సిఇఓకు రాశారు.
కావాలనే పక్కన పెట్టారని..ఇదంతా సభ్యులైన పొవార్, డయానా ఎడుల్జీ కారణమంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. విండీస్ జరిగిన మ్యాచ్‌లో ఆమె ఆఫ్ సెంచరీతో గట్టెక్కించారు. ఫాం లేకపోతే ఆటగాళ్లను పక్కన పెట్టడం చూశాం..కానీ ఇక్కడ సీన్ రివర్స్. క్రీడాపరంగా మంచి ఊపుమీదున్న ఈమె పట్ల బీసీసీఐ పెద్దలు మాత్రం పక్కన పెట్టేయడం దారుణం కదూ.
క్రికెట్ ఆటనే నమ్ముకుని..జీవితాన్ని త్యాగం చేసి..అపురూపమైన విజయాలను అందించి..దేశ గౌరవాన్ని ప్రపంచంలో తలెత్తుకునేలా చేసిన మిథాలీ రాజ్ పట్ల బీసీసీఐ అనుసరించిన ఈ వివక్షా పూరితమైన నిర్ణయం పట్ల అటు క్రీడాలోకమే కాకుండా జాతి యావత్తు జీర్ణించుకోలేక పోతోంది. మిథాలీ రాజ్..నువ్వెందుకు కన్నీళ్లు పెట్టుకోవాలి.
నీలో ఆడే దమ్ముంది. నీ వెనుక ఈ దేశం ఉంది. శరీరంలో సత్తువ ఉన్నంత దాకా నువ్వు ఆడుతూనే ఉండాలి. క్రికెట్ అభిమానుల గుండెలు భారత మువ్వెన్నల పతాకాలతో ఎగసి పడేలా చేయాలి. నీకు జరిగిన అన్యాయానికి ఓ క్రీడాకారాణికి నీవు స్పందించిన తీరు గొప్పది. అందుకే నువ్వు మైదానంలోకి రావాలి. పరుగుల వరద పారించాలి. ఆమెకు మనమంతా అండగా నిలుద్దాం. తెలంగాణ బిడ్డకు జేజేలు పలుకుదాం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి