కొలువులు బారెడు..భర్తీ మూరెడు
అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైందీ తెలంగాణలోని నిరుద్యోగుల పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాలు కోకొల్లలుగా వున్నప్పటికీ భర్తీ కాక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నానా అగచాట్లు పడ్డారు. స్థానికేతరుల హవా కొనసాగడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పోరుబాట పట్టారు. పెచ్చరిల్లిన నిరుద్యోగం నక్సలిజం వైపు మళ్లేలా చేసింది. గతంలో ఏలిన కాంగ్రెస్, టీడీపీలు ఆయా ప్రభుత్వ శాఖల్లో వేలాది ఖాళీలున్నా భర్తీ చేసిన పాపాన పోలేదు. ఆత్మహత్యలకు పాల్పడ్డారు. భారీ ఎత్తున ఎన్‌కౌంటర్లకు పాల్పడ్డారు. ప్రధానమైన కొలువులన్నీ రాయలసీమ, ఆంధ్ర వారితో నింపబడ్డాయి. బాజాప్తాగా ఉద్యోగాలను ఎగరేసుకు పోవడంతో తెలంగాణ అగ్నిగుండమై రగిలింది.
నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం ప్రారంభమైంది. నిరుద్యోగులు, ఉద్యోగులు, సకల జనులంతా ఆత్మ గౌరవం కోసం భారీ ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. జైలు పాలయ్యారు. లెక్కలేనన్ని కేసులు నమోదు చేశారు. అన్నింటిని భరించారు. కేవలం కొలువుల కోసం పిల్లలు తమ విలువైన జీవితాలను బలిదానం చేశారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా కొన్ని నెలల పాటు స్వచ్చంధంగా జనం రోడ్లపైకి వచ్చారు. నక్సలైట్ల ఎజెండానే తమ ఎజెండా అంటూ ప్రకటించిన ఎన్టీఆర్ హయాంలోను, ఆ తర్వాత మామను వెన్నుపోటు పొడిచి పవర్‌లోకి వచ్చిన చంద్రబాబు హయాంలోను ఎన్‌కౌంటర్లు నిరాటంకంగా సాగాయి. తెలంగాణ పేరు ఎత్తితే చాలు కేసులు నమోదు చేసేదాకా వెళ్లింది. తీవ్ర నిర్బంధం మొదలైంది. ప్రజల జీవితాల మీద వివక్ష సాగింది.
జర్నలిస్టులు, మేధావులు, ప్రజా సంఘాలు, కళాకారులు, కవులపై ఆంక్షలు ప్రకటించారు. మోసమే తప్ప గోస పట్టని ప్రపంచ బ్యాంకుకు బాబు ద్వారాలు తెరిచారు. సెజ్ పేరుతో బడా కంపెనీలకు విలువైన భూములను దారదత్తం చేశారు. ఉపాధి హామీ పథకం రావడంతో పల్లెల్లో రైతుల సాగుకు ఇబ్బందిగా మారింది. పెట్టుబడి రెట్టింతలు కావడంతో ఆత్మహత్యలు కొనసాగాయి. బషీర్ బాగ్ దగ్గర అన్నదాతలపై పోలీసులు కాల్పులు జరిపారు. ప్రపంచాన్ని ఈ దురాగతం ఉలిక్కిపడేలా చేసింది. అంతర్జాతీయ, జాతీయ మీడియా ఈ సంఘటనను కళ్లకు కట్టినట్టు ప్రసారం చేశాయి. వ్యవసాయం కుదేలైంది. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ వ్యవస్థకు తెర తీశారు. వీటి ఏజెన్సీలన్నీ స్థానికేతరుల చేతుల్లోకి వెళ్లి పోయాయి. దీంతో ఉద్యోగాలు భర్తీ కాక విద్యార్థులు ఏజ్ బార్‌కు లోనయ్యారు. చాలా మంది కూలీలుగా మారారు.
బాబు దెబ్బకు తెలంగాణ ప్రాంతం తల్లడిల్లి పోయింది. ఆ తర్వాత జనరంజకమైన పాలనను అందిస్తానని పవర్‌లోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డి విలువైన భూములపై కన్నేశారు. హత్యా రాజకీయాలకు తెర తీశారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. నక్సలైట్లను చర్చలకు పిలిపించి..మట్టుపెట్టారు. తండ్రిని అడ్డం పెట్టుకుని కొడుకు కోట్లు కొల్లగొట్టాడు. ఏకంగా సీఎం సీటుపై కన్నేశాడు. ప్రైవేట్ సైన్యాన్ని ఉసిగొల్పాడు. సమైక్య రాగం ఆలాపించాడు. మానుకోటకు బయలు దేరాడు. తెలంగాణ ప్రజలు వెంటపడి తరిమారు. దెబ్బకు జగన్ భారీ సెక్యూరిటీతో వెనుదిరిగాడు. ఆ తర్వాత సీఎం పదవి చేపట్టిన రోశయ్య చేతులెత్తేశాడు. అనంతరం ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వనని ప్రకటించాడు.
దీంతో కేసీఆర్ సారధ్యంలో ..కోదండరాం నేతృత్వంలో నాలుగున్నర కోట్ల మంది ఒక్కటై పోరు సాగించారు. కేంద్రం దిగి వచ్చింది. తెలంగాణ ఇచ్చింది. రెండున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఒక్క పోస్టు భర్తీ కాలేదు. మళ్లీ నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. స్వరాష్ట్రంలో తమ కలలు సాకారం అవుతాయని భావించిన ఈ ప్రాంతపు బిడ్డల ఆశలు ఆవిరై పోయాయి. నాలుగున్నర ఏళ్లు పాలన సాగించిన కేసీఆర్ మాయ మాటలు చెప్పారు. ఎంతో ఆర్బాటంగా ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు ప్రకటించడమే తప్పా..కొలువులను భర్తీ చేయడంలో చేతులెత్తేసింది. 18 లక్షల మందికి పైగా నిరుద్యోగులు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో కొలువుల కోసం తమ పేర్లు నమోదు చేశారు. 2014 ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి మాట తప్పారు. కనీసం 30 వేల పోస్టులు భర్తీ చేయలేక పోయారు.
తెలంగాణ పాలనలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు వ్యవస్థ అంటూ ఉండదని..ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పిస్తానంటూ నమ్మించారు. ఏకంగా లక్ష ఉద్యోగాలు ఇచ్చేశామంటూ ప్రకటించారు. ఈ విషయాన్ని సాక్షాత్తు తన కేబినెట్‌లో కీలక శాఖను నిర్వహిస్తున్న ఈటెల రాజెందర్ మాత్రం చెప్పిన రీతిలో భర్తీ చేయలేక పోయామని వాపోయారు. మళ్లీ అధికారమిస్తే తక్షణమే ఉద్యోగాలు నింపుతామని నమ్మించే ప్రయత్నం చేశారు. దీంతో నిరుద్యోగులు పదేళ్ల కు పైగా వయసు కోల్పోయారు. చాలా మంది ఇపుడు ప్రకటించ బోయే ఉద్యోగాలకు అనర్హులుగా మిగిలారు. లక్షలాది కొలువులు భర్తీ కాక తెలంగాణ బిడ్డలు కేసీఆర్ సర్కార్‌పై యుద్ధం ప్రకటించారు. ప్రస్తుతం జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపిస్తామంటూ సవాల్ విసురుతున్నారు. మొత్తం మీద ఈ సర్కార్‌కు భారీ ఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉంది. పక్కనే ఉన్న ఏపీలో పెద్ద ఎత్తున భర్తీ ప్రక్రియ చేపడితే..అన్ని వనరులు ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టలేక పోయిందో అర్థం కావడం లేదని మేధావులు ప్రశ్నిస్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి