ప్రమాదంలో ప్రజాస్వామ్యం
ప్రజల భాగస్వామ్యం లేకుండా ప్రజాస్వామ్యం మనుగడ సాగించిన దాఖలాలు ఎక్కడా లేవు. భావ ప్రకటన స్వేచ్ఛతో పాటు సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరమైన రంగాలలో భాగస్వామ్యం కల్పించిన చరిత్ర ఆయా దేశాలు ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగాలలో పొందు పరిచారు. హింసకు తావులేని వ్యవస్థ డెమోక్రసిది. కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఏ రంగానికి చెందిన వారైనా..ఏ వర్గానికి చెందిన వారైనా..ఏ కులానికి , ఏ మతానికి చెందిన వారైనప్పటికీ ఎలాంటి విద్యార్హతలతో సంబంధం లేకుండా చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించే అద్భుతమైన మార్గదర్శనం ప్రజాస్వామ్యం ద్వారానే దొరుకుతుంది.
నేరుగా ప్రజల దగ్గరకు వెళ్లడం..సామాజిక బాధ్యతను భుజాలకు ఎత్తు కోవడం ..జనం కోసం జవాబుదారీగా ఉండడం దీని ద్వారానే సాధ్యమవుతుంది. ప్రపంచానికే తలమానికంగా..ఆదర్శ ప్రాయంగా ఉంటూ వచ్చిన చరిత్ర భారత దేశానిది. దాదాపు వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఇండియాలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. మనీ..మీడియా..మాఫియా రాజ్యమేలుతున్నాయి. తరాలు మారినా ..టెక్నాలజీలో పెను మార్పులు చోటు చేసుకున్నా వ్యాపార దిగ్గజాలు, కార్పొరేట్ కంపెనీల యాజమాన్యాలు, బాధ్యులు , సెలబ్రెటీలు, బిగ్ పర్సనాలిటీలు రాజకీయాల్లోకి రావడం..డబ్బులు వెదజల్లడం, భయభ్రాంతులకు గురి చేయడం లాంటి అనైతిక కార్యకలాపాలు అనూహ్యంగా పెరిగి పోవడం ..ప్రజాస్వామ్యానికి చెరుపుగా మారాయి.
ఎన్నడూ లేనంతగా హింస పెచ్చరిల్లి పోయింది. చట్టాలను రూపొందించి ప్రజలకు ..సమాజానికి జవాబుదారీగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు తమ ఆస్తులను పెంచుకోవడం, తమ వారికే ప్రాధాన్యత ఇవ్వడం, అనుచరులకు పనులు అప్పగించడం లాంటివి చేయడంతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న సంకేతాలు గోచరిస్తున్నాయి. సమస్త జనానికి ప్రజాప్రతినిధులపై నమ్మకం లేకుండా పోతోంది రోజురోజుకు. జవాబుదారీతనాన్ని గాలికి వదలి వేశారు. కాసుల సంపాదనే ధ్యేయంగా రాజకీయాలు తయారయ్యాయి. ప్రభుత్వాలకు వెన్ను దన్నుగా ఉంటూ వచ్చిన ప్రధాన రంగాలన్నీ ..వ్యవస్థలన్నీ దిక్కూ దివానం లేకుండా తయారయ్యాయి. ఓటు బ్యాంకు రాజకీయాలకు విపరీతమైన ప్రయారిటీ పెరిగింది.
ఫర్ ద పీపుల్..బై ద పీపుల్..టు ద పీపుల్..ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మగా రక్షణాత్మకంగా తయారు చేసుకుంటూ వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితం రాబట్టలేక పోయాం. స్పష్టమైన ప్రణాళికలు తయారు చేయక పోవడం..ప్రజల భాగస్వామ్యం లేకుండానే సంక్షేమ పథకాలను రూపొందించడం..వల్లనే ఇలాంటి దుర్గతి పట్టింది. 1947 తర్వాత నుండి నేటి దాకా ఈ దేశం ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. ఎన్నో కష్టాలను అధిగమించింది. రాజులు పోయినా..రాజ్యాలు అంతరించినా..ఇంకా ఆ రాచరిక వాసనలు పోలేదు. వ్యక్తుల కంటే వ్యవస్థ గొప్పది. వ్యక్తి నిర్మాణం వ్యక్తిత్వంతో ముడి పడి ఉన్నది. విద్య, ఉపాధి, కూడు, గూడు , భూమిని కేటాయించాలేని స్థితిలో నేటి పాలకులుండడం క్షమించరాని నేరం. అర్ధరాత్రి సమయంలో మహిళ ఒంటరిగా తిరిగి నప్పుడే అసలైన ప్రజాస్వామ్యం వచ్చినట్టు పేర్కొన్న మాటలు నీటి మూటలుగా మిగిలి పోయాయి.
అవినీతి పరంగా చేపట్టిన రేటింగ్‌లో మన దేశం మొదటి స్థానంలో ఉండడం..మహిళలపై లైంగిక వేధింపులు విపరీతంగా పెరిగి పోయాయి. చట్ట సభల్లో నేర చరిత్ర కలిగిన వ్యక్తులే అధికంగా ఉన్నారు. వీరికి ప్రజలకు సేవ చేయాలన్న తలంపు ఎలా కలుగుతుంది. చట్టాలను చుట్టాలుగా మార్చుకునే వ్యవస్థను ఏర్పాటు చేవారు. ప్రజలకు విలువ లేకుండా చేశారు. ఆర్థిక నేరాలు పెరిగి పోయాయి. ప్రజల సొమ్ములను కాజేసే వ్యక్తులు ఎక్కువయ్యారు. దేశానికి సంబంధించిన సంపదను ఇతర దేశాలకు, ప్రాంతాలకు తరలించడం చేస్తూ వచ్చారు. స్విస్ బ్యాంకులో అధిక శాతం మనవారు కోట్లాది రూపాయలను దాచుకున్నారన్న సమచారం ఇటీవల స్నోడెన్ ప్రకటించి..సంచలనం రేపారు.
హత్యా రాజకీయాలను ప్రోత్సహించడమే కాకుండాప్రత్యక్షంగా పాల్గొనడం ..తోటి మహిళల పట్ల జుగుస్సాకరమైన రీతిలో వ్యవహరించడం..లెక్కలేనన్ని కేసులు నమోదు కావడం డెమోక్రసీని కోలుకోలేకుండా చేసింది. స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలను పనిగట్టుకుని ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తూ వచ్చాయి. అవినీతి నిరోధక శాఖ, ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు , రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తదితర వ్యవస్థలన్నింటిపై రాజకీయ పెత్తనం పెరిగి పోయింది. దీంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైంది. దేశానికి స్వేచ్ఛ లభించినా..స్వతంత్రం వచ్చినా 75 శాతానికి పైగా ప్రజలు కనీస సౌకర్యాలకు నోచు కోవడం లేక పోవడం ప్రమాదాన్ని సూచిస్తున్నది. నిరుద్యోగం, నిరక్షరాస్యత, వివక్ష, సామాజిక అంతరాలు అంతకంతకూ పెరిగి పోతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల సైనిక కూటముల చేతుల్లో బందీ అయి పోయాయి. ఇప్పటికీ ప్రజాస్వామ్యం అంటేనే అంతా ఇండియా వైపే చూపిస్తారు. ప్రపంచాన్ని ఒంటిచేత్తో శాసిస్తున్న అమెరికా సైతం ఒంటెత్తు పోకడలు ప్రదర్శిస్తోంది. ప్రతి దేశంపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది. దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించాల్సిన సదరు పెద్దన్న ఆర్థికంగా, వ్యాపార పరంగా, వాణిజ్య పరంగా కుట్రలు పన్నుతూ..కుతంత్రాలు చేస్తూ ..కఠినతరమైన నిబంధనలను రూపొందిస్తూ ..తన చెప్పుచేతుల్లో పెట్టుకోవాలని చూస్తోంది. ఆధిపత్యధోరణితో ..అణిచివేత వ్యూహంతో ఎప్పటికప్పుడు చెక్ పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఐక్య రాజ్య సమితి వాచ్ డాగ్ గా గమనిస్తూనే ఉన్నా ఏమీ చేయలేక పోతోంది. ఎలాంటి చర్యలు చేపట్టలేక చేష్టలుడిగింది. ఆర్థికపరంగా బలమైన స్థాయిలో ఉండడం ఓ కారణంగా చెప్పుకోవచ్చు.
ఇలాంటి చర్యల వల్లనే డెమోక్రసీకి కష్టకాలం దాపురించిందనే అనుకోవాల్సి వుంటుంది. అంతర్జాతీయ పరంగా అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆయుధ సంపత్తి అత్యధికంగా కలిగి ఉండడం ప్రజాస్వామ్యాన్నే నమ్ముకున్న దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రమాదపుటంచుల్లోకి నెట్టి వేయబడిన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించు కోవాల్సిన బాధ్యత ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరిపైనా వున్నది. ప్రజలతో పాటు మేధావులు , భావసారూప్యత కలిగిన వారంతా ఒకే తాటిపైకి రావాలి. ఇదో ఉద్యమంగా సాగాలి.
ప్రజలకు ..సమాజానికి మేలు చేకూర్చే ఎన్నో మార్పులు ..చట్టాల ద్వారా చోటు చేసుకున్నాయి. ఉపాధి హామీ చట్టం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్, ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ, మైనార్టీ, బీసీలకు సముచిత స్థానం కల్పించడం, సమాచార హక్కు చట్టం -2005..లాంటి ఎన్నో ప్రభావితం చేశాయి. ప్రజలంతా ఒకేత్రాటిపై వచ్చేలా..ఉద్యమాలు ..పోరాటాలు..ఆందోళనలు నిర్వహించుకునే స్వేచ్ఛను పొందడం ..కూడా..డెమోక్రసీ బతికే ఉందనడానికి నిదర్శనం..ప్రజలు చైతన్యవంతం కావాలి..మరింత అవగాహన పెంపొందిచు కోవాలి. సేవ్ డెమోక్రసీ..సేవ్ ద సొసైటీ ..కోసం యుద్ధ ప్రాతిపదికన ..చైతన్యవంతంతో కదలాల్సిన అవసరం వున్నది. మనం మారాలి..అప్పుడే ఈ వ్యవస్థ లో మార్పులు చోటు చేసుకోవడం కాయం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి