అందరి దృష్టి అయోధ్య పైనే
మళ్లీ అయోధ్య వార్తల్లోకి వచ్చింది. ప్రతి ఎన్నికల సందర్భంలో అయోధ్య పేరు తరుచుగా వినిపిస్తూనే వుంటుంది. బీజేపీకి దాని అనుబంధ సంస్థలైన విశ్వ హిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భజరంగ్ దళ్ లాంటి సంస్థలకు అదో ఆయుధం. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు అగ్నిపరీక్షలా మారాయి. అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ధర్మ సభకు రమారమి 3 లక్షల మందికి పైగా సాధువులు, హిందూ పరివారం హాజరైంది. ఎటు చూసినా అయోధ్య కాషాయంతో కళకళలాడింది. దేశంలో ఎన్నో నగరాలు, పట్టణాలు, ప్రాంతాలున్నా అయోధ్య మాత్రం అందుకు మినహాయింపు ఇవ్వాల్సిందే. ఎందుకంటే కొన్నేళ్లుగా ఈ నగరం ప్రపంచపు దృష్టిని తన వైపునకు తిప్పుకుంది. ఇక్కడ రామమందిరం..మసీదు వివాదం ముసురుకుని ఉంది.
దేశానికి స్వతంత్రం వచ్చి 70 ఏళ్లకు పైగా గడిచినా ఇంకా అయోధ్య రావణకాష్టంలా రగులుతూనే వున్నది. ఈ స్థలం మాదంటే మాదంటూ హిందూ..ముస్లింలు లెక్కలేనన్ని ఆందోళనలు చేపట్టారు. నిరసన వ్యక్తం చేశారు. వినయ్ కటియార్, మురళీ మనోహర్ జోషి, అద్వాణి లాంటి సీనియర్ నేతలు అయోధ్యలో మందిరం కట్టాల్సిందేనంటూ దేశంలోని ప్రతి ఊరు నుండి ఓ కార్యకర్త, హిందువులు భారీ ఎత్తున తరలి వచ్చారు. దేశ మంతటా టెన్షన్ వాతావరణం నెలకొంది. అప్పటి దేశ ప్రధాని పి.వి.నరసింహారావు చూస్తూ ఉండిపోయారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. బీజేపీకి అయోధ్య ఓ ఆయుధంలా ఉపయోగపడుతోందని..ఎన్నికలప్ పుడు మాత్రమే అది గుర్తుకు వస్తుందని..ఆ తర్వాత షరా మామూలేనంటూ కాంగ్రెస్, ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి.
రాముడికి గుడి కట్టాలంటే ఎక్కడైనా కట్టుకోవచ్చు..ఇక్కడే కట్టాల్సిన అవసరం ఏముందంటూ మేధావులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు సవాలక్ష సమస్యలతో అల్లాడిపోతుంటే చూస్తూ నిమ్మకుండి పోయిన ఈ పాలకులకు తగిన రీతిలో ఓటు అనే ఆయుధంతో బుద్ది చెప్పాలని పిలుపునిస్తున్నారు. అటు అయోధ్య వివాదం రగులుతూనే ఉండాలి..ఇటు ఓట్లు రాలుతూనే ఉండాలన్నది బీజేపీ ఎత్తుగడగా భావించాల్సి ఉంటుందన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేశ మంతటా రామ మందిరం నిర్మాణం కోసం అద్వానీ ఆధ్వర్యంలో రోడ్ షోలు నిర్వహించారు. విస్తృతంగా పర్యటించారు. అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు సంయమనం పాటించాలని, ప్రజల భావోద్వేగాలను అర్థం చేసుకోవాలని..ఇది ఇరు వర్గాలకు సంబంధించిన సున్నితమైన అంశం కనుక ఆచితూచి వ్యవహరించాలని సూచించింది.
అయోధ్యకు అద్భుతమైన చరిత్ర వుంది. గంగానదికి సమీపంలో ఈ నగరం వుంది. ఇక్కడే బాబ్రీ మసీదు స్థలంలో రామాలయం కట్టాలంటూ 1984లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దేశమంతటా నిరసన సెగలు అంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ నగరం వార్తల్లో నిలిచింది. కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టి చివరకు ప్రభుత్వం నుండి దిగిపోయేలా చేసింది. ఆ తర్వాత అటల్ బిహారి వాజ్‌పేయి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడింది. ఒకే ఒక్క ఓటుతో ఓడిపోయిన ప్రధానమంత్రిగా చరిత్రలో నిలిచి పోయారు. ఇటీవలే ఆయన తుది శ్వాస విడిచారు. స్వతహాగా కవి అయిన పార్లమెంట్ సాక్షిగా చేసిన ప్రసంగాలు ప్రజలను ప్రభావితం చేశాయి. ప్రజలతో ఎన్నుకోబడిన వారు ఎలా బాధ్యతగా వ్యవహరించాలో చూసి నేర్చుకోవాలని బోధించారు. తన జీవితమే తన సందేశంగా పేర్కొనే నేతల్లో మహాత్మా గాంధీ, నెహ్రూ, లింకన్ , జేపీతో పాటు వాజ్ పేయి కూడా ఉన్నారు.
ఇన్నేళ్లు గడిచినా..ప్రభుత్వాలు మారినా నిన్నటి దాకా ప్రశాంతంగా వున్న అయోధ్య మళ్లీ రగిలిపోతోంది. కాషాయం ధరించిన సాధువులు లక్షలాదిగా తరలి వచ్చారు. జై శ్రీరాం..జై జై భారత్ కీ మాతా అంటూ దేశం దద్దరిల్లి పోయేలా నినాదాలు చేశారు. ఈ స్థలం మాదే..ఈ దేశం మాదే..ఈ దేశంలో ఉండాలంటే ఎవ్వరైనా సరే భారత్ మాతా కీ జై అనాల్సిందేనంటూ వీహెచ్‌పీ చేసిన నినాదాలు హోరెత్తాయి. చెవులు పిక్కటిల్లేలా..రోమాలు నిలిచేలా అయోధ్య కాషాయంలో మునిగి పోయింది. గంగా నది నిండా భక్తులే..సాధువులే.. ఎక్కడి అయోధ్య..ఎందుకీ రాద్ధాంతం అంటూ వాపోయిన వారికి దీని వెనుక జరుగుతున్న తంతు ఏమిటో అర్థం కాక తలపట్టుకుంటున్నారు.
మళ్లీ బీజేపీకి దాని అనుబంధ సంఘాలకు అయోధ్య కావాలి. ఎవ్వరు ఏమై పోతేనేం ఈ స్థలం తమదేనంటూ..ఇక్కడే శ్రీ రాముడు జన్మించాడని..ఆయనకు గుడి కట్టి తీరాల్సిందేనంటూ ..అంత దాకా ఈ దేశాన్ని నిద్ర పోనివ్వమంటూ ప్రతిన బూనారు. ఇపుడు అయోధ్య ఒక నగరమే కాదు..రగులుతున్న అగ్ని గుండం. ఇందులో ఎవరైనా దూకాలని అనుకుంటే దుస్సాహసమే అవుతుంది. ఓట్ల మాట దేవుడెరుగు కానీ జనం మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ లో ఉన్నారు. మోడీ , షా మాత్రం మౌనాన్ని ఆశ్రయించారు. రాహుల్ గాంధీ రఫెల్ స్కాం ను ఎత్తుకున్నారు. మాయావతి, బెంగాల్ దీదీ పీఎం పదవిపై కన్నేశారు. రాబోయే ఎన్నికలు వీరందరికి పరీక్ష కానున్నాయి. రామ మందిరం కడతారా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి