అడవి కోసం అతివల ఉద్యమం..దిగొచ్చిన ఒడిస్సా ప్రభుత్వం ..!
వాళ్ల దగ్గర ఆయుధాలు లేవు..మందీ మార్బలం లేదు. బతికేందుకు ఏ ఆధారం లేదు..ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వం అండగా నిలవాల్సింది పోయి లిక్కర్ ఫ్యాక్టరీకి పచ్చ జెండా ఊపింది. భూములు లాక్కోవాలని చూసింది. జిల్లా అధికార యంత్రాంగం వారిపై పోలీసులను ఉసిగొల్పింది. ఇంత జరిగినా వారు చెక్కు చెదరలేదు. కొన్నేళ్లుగా ..తరతరాలుగా తమకు కూడు పెడుతున్న ఈ చెట్లను..అడవిని విడిచి వెళ్లమంటూ భీష్మించుకు కూర్చున్నారు. మా ప్రాణాలు తీసుకోండంటూ వారు చెట్లను హత్తుకున్నారు. కోర్టును ఆశ్రయించినా అన్యాయమే మిగిలింది. ఆ అతివల..అడవి బిడ్డల ఆత్మవిశ్వాసం ముందు సర్కార్ తలొంచింది. ఇదంతా నిన్నే జరిగిన కన్నీటి కథ..అంతులేని వ్యధ.
సుందర్ లాల్ బహుగుణ గుర్తున్నారా..చిప్కో ఉద్యమానికి ఆద్యుడు. ప్రపంచం మెచ్చిన సామాజిక..పర్యావరణ వేత్త. చివరి వరకు అడవులను కాపాడుకోవాలంటూ జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి. ఈ అడవిబిడ్డలు చేసిన సాహసం మరోసారి ఆయనను తలుచుకునేలా చేశాయి. ఇక కథలోకి వెళితే. ఒడిసా రాష్ట్రంలోని దెంకనాల్ జిల్లా బలరాంపూర్ గ్రామస్తులు అడవిపైనే ఆధారపడి బతుకుతున్నారు. వీరికి ఇదే జీవనాధారం. ఇది లేక పోతే వారికి బతుకు లేదు. చావే శరణ్యం. ఉన్నట్టుండి ఈ ప్రభుత్వానికి ఈ గ్రామంపై కన్ను పడింది. ఎందుకంటే ఇక్కడ 102 కోట్ల రూపాయలతో లిక్కర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందు కోసం భూములను స్వాధీనం చేసుకుంటున్నామని ..అడవిని వదిలి వేయాలంటూ హుకూం జారీ చేసింది. జింకర్‌గాడి అటవీ ప్రాంతంలో దీనిని ఎస్టాబ్లిష్ చేయాలని రంగంలోకి దిగారు. ఈ అటవీ ప్రాంతం 243 హెక్టార్ల విస్తీర్ణం కలిగి వుంది. 2014లో పారిశ్రామిక వాడ పేరుతో భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్లాన్ వేసింది.
ఈ అడవిపై బలరాంపూర్ గ్రామం ఒక్కటే కాదు మరో 11 గ్రామాల ప్రజలు దీని మీదే ఆధారపడి బతుకుతున్నారు. గత నాలుగేళ్లుగా పరిశ్రమల ఏర్పాటు వద్దంటూ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. పి అండ్ ఏ బాట్లెర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లిక్కర్ ఫ్యాక్టరీ పేరుతో అడవికి చెందిన 11 ఎకరాలు కేటాయించింది సర్కార్. 17 ఏళ్ల కాంచీ అనే అడవిబిడ్డ అందరినీ కూడగట్టింది. తమకు ఈ లిక్కర్ ఫ్యాక్టరీ వద్దంటూ ..తమ అడవి తమకే దక్కాలంటూ హైకోర్టును ఆశ్రయించింది. న్యాయం కావాలని కోరింది. అయినా కోర్టు వీరి మొర వినలేదు. 2017లో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందంటూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. అయినా ఎలాంటి మార్పు రాలేదు. ట్రైబ్యునల్ కూడా న్యాయం చేయక పోవడంతో అతివలంతా ఒక్కటై ప్రాణాలు పోయినా సరే భూములు ఇచ్చే ప్రసక్తే లేదంటూ పోరుబాట పట్టారు.
వీరి న్యాయపరమైన ఆందోళన దేశ వ్యాప్తంగా వైరల్ అయింది. ఎట్టకేలకు ఒడిసా సీఎం నవీన్ పాట్నాయక్ దిగి వచ్చారు. బాధితులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అయినా వీరు వినలేదు. ప్రాణాలు తీసుకోండి..కానీ మా చెట్లు మాకు కావాలి. మా అడవి మాకు దక్కాలి. లేకపోతే మేం బతకమని చెప్పారు. జిల్లా పోలీసులు వారిపై తుపాకులు ఎక్కుపెట్టారు. అయినా చలించలేదు. మహిళలు ఒక్కో చెట్టును హత్తుకున్నారు. వీరి తెగువను చూసిన సీఎం తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్టు ప్రకటించారు. ఇది అడవి బిడ్డలు సాధించిన అద్భుత విజయం.
(శుభా శ్రీవాత్సవకు కృతజ్ఞతలతో )
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి