లక్ష్మీనారాయణ రాణించేనా..?
అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించి ..పోలీస్ వ్యవస్థకు మరింత గౌరవం పెంచిన మాజీ పోలీసు ఉన్నతాధికారి లక్ష్మీనారాయణ ఊహించని రీతిలో వీఆర్ ఎస్ తీసుకున్నారు. గత కొంత కాలంగా ఏదో ఒక పార్టీలో చేరుతారన్న వార్తలు గుప్పుమన్నాయి. వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ తానే కొత్త పార్టీని స్థాపించనున్నట్లు ప్రకటించి ఆశ్చర్య పోయేలా చేశారు. చాలా రోజుల నుండి సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ వస్తున్నారు. అవినీతి, అక్రమాలకు అడ్డాగా..హత్యా రాజకీయాలకు ..మాఫియాకు కేరాఫ్‌గా మారిన రాజకీయాల్లోకి ఎంటర్ కావాలను కోవడం ధైర్యంగా తీసుకున్న నిర్ణయంగా భావించాలి.
కడప జిల్లాకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి గురించి ఎంత చెప్పినా తక్కువే. స్పష్టమైన తెలుగు భాషలో వినసొంపుగా మాట్లాడే ఆయన ఏది చెప్పినా అది ఆచరించి చూపాలంటారు. వృత్తి రీత్యా దేశ వ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించారు. అసాధ్యమైన కేసులను ఛేదించి ఔరా అనిపించుకున్నారు. ఆరోపణలను ఎదుర్కొన్నారు. విమర్శలను తట్టుకున్నారు. కొంత కాలం పాటు పోస్టింగ్ కోసం వేచి చూశారు. తెలంగాణ డీజీపీకి దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇక్కడి నుంచి స్పందన లేక పోవడంతో మహారాష్ట్ర కు వెళ్లి పోయారు. అక్కడ కూడా ఆయనకు పూర్తి స్వేచ్ఛ దొరకక పోవడంతో ..స్వచ్ఛంధ పదవీ విరమణ వైపు మొగ్గారు. ఈ నిర్ణయాన్ని ఆయన అనుచరులు, అభిమానులు జీర్ణించుకోలేక పోయారు. తప్పని పరిస్థితుల్లో లక్ష్మీనారాయణ పెట్టుకున్న ఆర్జీని ఆ సర్కార్ ఓకే చెప్పింది.
దీంతో ఆయన ఎక్కడికి వెళుతున్నారు. ఏం చేయబోతున్నారు..ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారోనని ఉత్కంఠ నెలకొన్నది. దానిని పటాపంచలు చేస్తూ త్వరలోనే కొత్త పార్టీని పెట్టబోతున్నానని వెల్లడించారు. 1965లో జన్మించిన ఈ అధికారి ఏది మాట్లాడినా ఓ సంచలనమే. మోస్ట్ వాంటెడ్ పోలీస్ ఆఫీసర్‌గా వినుతి కెక్కారు. మాఫియా గ్యాంగ్‌లకు నిద్ర లేకుండా చేశారు. ఎన్ ఐటీ వరంగల్‌లో ఇంజనీరింగ్ చదివారు. ఐఐటీ మద్రాస్‌లో ఎంటెక్ పట్టా పొందారు. 1990లో ఐపీఎస్ కు సెలెక్ట్ అయ్యారు. కలాంను స్ఫూర్తిగా తీసుకున్న ఆయన లీడ్ ఇండియా ఫౌండేషన్ ద్వారా విద్యార్థులను, జనాన్ని చైతన్యవంతం చేస్తూ వస్తున్నారు.
ఇప్పటికే 15 లక్షల మంది విద్యార్థులు లక్ష్మీనారాయణను అనుసరిస్తున్నారు. ఆయనకున్న ఛరిస్మాను తెలియ చేస్తోంది. మహారాష్ట్రలోని నాందేడ్‌లో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ విభాగంలో ఎస్పీగా పనిచేశారు. 2006లో హైదరాబాద్‌లో డీఐజీగా సమర్థవంతంగా బాధ్యతలు చేపట్టారు. సీబీఐ విభాగంలో ఐదేళ్ల పాటు ఉన్నారు. ఆయన పనితీరుకు మెచ్చిన కేంద్ర హోం శాఖ మరో రెండేళ్ల పాటు పొడిగించింది. ఆయన సర్వీస్‌ను వాడుకుంది. జాయింట్ డైరెక్టర్ గా లక్ష్మీనారాయణకు పదోన్నతి లభించింది. ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్నారు. డీఐజీ ర్యాంకు స్థాయిలో దేశాన్ని కుదిపి వేసిన సత్యం కుంభకోణం కేసును ఛేదించారు. రామలింగరాజును జైలు పాలు చేశారు. 54 సార్లు రక్తదానం చేశారు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహారాష్ట్ర సర్కార్ నుండి పలు పురస్కారాలు అందుకున్నారు.
తండ్రిని అడ్డం పెట్టుకుని కోట్లాది ఆస్తులను కూడగట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను అరెస్ట్ చేశారు. అప్పట్లో ఈ చర్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మైనింగ్ డాన్ ..బీజేపీ లీడర్..బిగ్ బిజినెస్ మెన్..పొలిటీషియన్ అయిన గాలి జనార్దన్ రెడ్డికి చుక్కలు చూపించారు. కంటి మీద కునుకు లేకుండా చేశారు. చిప్పకూడు తినిపించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఓ గ్రామాన్ని ఆయన స్వంతంగా దత్తత తీసుకున్నారు. ఎంవి ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలకు మద్ధతు పలికారు. ఎక్కడికి వెళ్లినా కలాంను, స్వామి వివేకానందను ఆయన కోట్ చేస్తారు. ఇటీవల వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టారు. పురుగు మందులు లేని, ఎలాంటి రసాయనాలు వాడని వ్యవసాయం కావాలని కోరుతున్నారు. ప్రకృతి వ్యవసాయమే మేలంటారు.
ఆ దిశగా రైతులను కలిశారు. వారి అనుభవాలను పంచుకున్నారు. రైతే రాజు కావాలంటారు. రైతులకు మేలు చేకూర్చేందుకు ఏమేం చేయవచ్చో దగ్గరుండి లక్ష్మీనారాయణ పరిశీలించారు. ఉద్యోగిగా ఉంటే కొందరికే సేవ చేయొచ్చు..కానీ రాజకీయపరంగా వుంటే ఎందరికో మేలు జరిగేలా చూడొచ్చంటారు ఆయన. అయితే ఉద్యోగం వేరు..రాజకీయం వేరు. సంపాదనే ధ్యేయంగా నేటి రాజకీయాలు పని చేస్తున్నాయి. ఈ తరుణంలో ఈ మాజీ పోలీసు అధికారి ఎలా రాణిస్తారో వేచి చూడాలి. రైతు సంక్షేమం, యువత, మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ పార్టీని పెట్టబోతున్నారు.
ఆయన వెంట ఎంత మంది వస్తారో..ఎవరెవరు ఉంటారో తేలుతుంది. ఇంకా ఎంతో సర్వీసు ఉన్న ఆయన ఎందుకిలా వీ ఆర్ ఎస్ తీసుకున్నారు. దీని వెనుక ఏమైనా వత్తిళ్లు ఉన్నాయా లేక తానే ఈ నిర్ణయం తీసుకున్నారా..ఉన్న పార్టీల్లో ఇముడలేనని అనుకున్నారు. ఆ దిశగా కొత్త పార్టీ వైపు మొగ్గు చూపారా..పార్టీని నడపాలంటే డబ్బులు కావాలి. ఆర్థికంగా ఎలాంటి బలం లేని ఆయన ఎలా మేనేజ్ చేస్తారో నన్న పలు ప్రశ్నలు కలుగుతున్నవి. ఏది ఏమైనా జీవితం పట్ల..వృత్తి పట్ల ..తన విజన్ పట్ల స్పష్టమైన అవగాహన కలిగిన లక్ష్మీనారాయణ సక్సెస్ కావాలని ఆశిద్దాం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి