ఈ ఐఏఎస్ పిల్లల పాలిట దేవత ..!
ఈ దేశంలో సివిల్ సర్వెంట్స్ కు ఎనలేని క్రేజ్. కలెక్టర్, ఎస్పీ పదవులకున్నంత క్రేజ్ ఏ రంగానికీ లేదు. వీరిలో చాలా మంది అధికార దర్పాన్ని ప్రదర్శిస్తే ..ఇంకొందరు మాత్రం ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. ఓ వైపు వృత్తి ధర్మాన్ని పాటిస్తూనే మరో వైపు పేదల కోసం శ్రమిస్తున్నారు. అలాంటి వారిలో ఈ ఐపీఎస్, ఐఏఎస్ అధికారిణి గరిమా సింగ్ వెరీ వెరీ స్సెషల్. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన గరిమాకు పిల్లలంటే ప్రేమ. 2015లో యుపీఎస్‌సీ నిర్వహించిన ఎక్జాంలో ఆల్ ఇండియాలో 55 వ ర్యాంకును సాధించారు ఆమె. మొదట్లో ఎస్పీ కేడర్‌కు ఎంపికయ్యారు. విధుల్లో ఉంటూనే మరోసారి పరీక్ష రాసి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు.
పోలీసు ఆఫీసర్‌గా పనిచేస్తున్న సమయంలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు గరిమా. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె గుర్తించారు. వారి కోసం ప్రత్యేకంగా 1090 టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. ఎవరైనా ..ఎప్పుడైనా..ఎక్కడి నుంచైనా తమ సమస్యను ఈ నెంబర్‌కు చెప్పుకోవచ్చు. తక్షణమే సమస్యకు పరిష్కారం లభించేలా ఆమె కృషి చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మోహన్‌లాల్ గంజ్ రేప్ కేసును గరిమా చాకచక్యంగా ఛేదించారు. దోషులకు శిక్ష పడేలా చేశారు. సమదృష్టి..సమ న్యాయం ..సమ ధర్మం ..తన లక్ష్యం అంటూ చెప్పే గరిమా సింగ్ కు పిల్లలంటే ప్రేమ. ప్రతి ఒక్కరు చదువు కోవాలని ఆమె అంగన్‌వాడి సెంటర్లను తనిఖీ చేస్తూ వచ్చారు.
ఐపీఎస్ నుండి ఐఏఎస్ కు ఎంపికైన గరిమా నిరంతరం పనిలోనే నిమగ్నమై వుంటారు. 2016లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. హజారీబాగ్‌లోని జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. మొత్తం నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా మారిన అంగన్‌వాడీ కేంద్రాలను ప్రక్షాళన చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు దిశా నిర్దేశనం చేశారు. మత్వారీ మసీదు ప్రాంతంలో ఉన్న కేంద్రాన్ని గరీమా సింగ్ దత్తత్ తీసుకున్నారు. దానిని సంస్కరించే బాధ్యత చేపట్టారు. స్వంతంగా తన వద్ద నుండి 50 వేల రూపాయలను దీని కోసం ఖర్చు చేశారు. అందంగా తీర్చిదిద్దారు. పిల్లలు ఆడుకుంటూ..చదువుకునే వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరిలో క్రియేటివీటీ ఉండేలా శిక్షణ ఇచ్చారు.
ఈ అంగన్‌వాడీ కేంద్రాన్ని రాష్ట్రంలోనే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దారు. దీని మోడల్‌ను ఆధారంగా చేసుకుని 50 కేంద్రాలలో మార్పులు రావడం ప్రారంభమయ్యాయి. గరిమా సింగ్ చేసిన కృషిని ..వచ్చిన మార్పును గుర్తించిన మీడియా ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. ఏకంగా ఇండియన్ ఎలక్షన్ కమిషన్ గరిమాను ప్రత్యేకంగా ప్రశంసలతో ముంచెత్తింది. సివిల్ సర్వెంట్స్ అంటే అధికారాన్ని చెలాయించడం కాదు..జనం మధ్యలో ఉండడం..ప్రజలకు సేవలందించడం ..అంటారు..గరీమా..ఆమె మాటల్లో నిజం ఉంది కదూ...!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి