పురుష ఓటర్లే అధికం..మహిళా ఓటర్లు కీలకం
రోజులు దగ్గర పడుతున్న కొద్దీ ..తెలంగాణ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కఠినతరమైన నియమ నిబంధనలను అమలు చేస్తున్నా..హెచ్చరికలు జారీ చేస్తున్నా ..ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా..వేలాది మంది టాస్క్ ఫోర్స్..పోలీసు , ఆర్మీ సిబ్బంది , బలగాలు మోహరించినా..నోట్లు చేతులు మారుతున్నాయి. కుల, వన భోజనాలు ఊపందుకున్నాయి. మద్యం ఏరులై పారుతోంది. ఎలక్షన్ క్యాండిడేట్స్ సంపాదించిన సొమ్మునంతా నీళ్ల లాగా ఖర్చు చేస్తున్నారు. కోట్లు కుమ్మరిస్తున్నారు.
ఈసారి జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పురుష ఓటర్లే గెలుపు ఓటములను ప్రభావితం చేయనున్నారు. ఎలక్షన్ కమిషన్ పేర్కొన్న వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల 80 లక్షల 64 వేల 684 ఓటర్లు ఉన్నారు. వీరందరూ ఓటరు గుర్తింపు కార్డులు కలిగి ఉన్న వారే. వీరిలో పురుష ఓటర్లు ఒక కోటి 41 లక్షల 56 వేల 182 మంది ఉండగా ...మహిళా ఓటర్లు ఒక కోటి 39 లక్షల 05 వేల 811 మంది నమోదై ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో 1821 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కొంత మంది రెబల్స్ గా, మరికొంత మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో నిలిచారు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ, ఇంటి పార్టీ, బీజేపీ, టీఆర్ఎస్, బీఎస్పీ, సీపీఎం, ఎంఐఎం తదితర పార్టీలన్నీ ఇప్పటికే బి- ఫారంలు అందజేశాయి. టీజేఎస్ అభ్యర్థి ఫారంను రిటర్నింగ్ అధికారి చెల్లదంటూ కొట్టి వేశారు. స్నేహ పూర్వక పోటీ ఉంటుందని చెప్పినప్పటికీ చాలా చోట్ల అభ్యర్థులు విజయం సాధించే మార్గాలను సుగమం చేసేందుకు బుజ్జగింపులు స్టార్ట్ చేశారు.
సందిట్లో సడేమియా అన్నట్టు రెబల్స్ ప్రధాన పార్టీల అభ్యర్థులకు చుక్కలు చూపించారు. వీరిని బరిలో లేకుండా చేసేందుకు ఆయా పార్టీల పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఆయా నియోజకవర్గాల వారీగా చూస్తే..అత్యధికంగా అభ్యర్థులు మల్కాజ్‌గిరి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీలో ఉన్నారు. ఇక్కడ మహాకూటమి అభ్యర్థిగా కపిలవాయి దిలీప్ కుమార్ బరిలో నిలిచారు. ఇక్కడ 42 మంది పోటీ చేస్తున్నారు. అత్యల్పంగా ఓటర్లు కలిగిన నియోజకవర్గంగా భద్రాచలం నిలిచింది. బోధ్, జుక్కల్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ఏడు మంది చొప్పున బరిలో ఉన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం 16 మంది అభ్యర్థులకు కలిపి ఒక బ్యాలెట్ ఉంటుంది.
ఎక్కువ పోటీ చేస్తున్నట్లయితే అదనంగా బ్యాలెట్లను ఏర్పాటు చేస్తారు. మల్కాజ్‌గిరితో పాటు ఉప్పల్, ఎల్పీనగర్ నియోజకవర్గాల్లో 35 మంది చొప్పున, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 32 మంది , అంబర్‌పేట నుండి 31 మంది , సికింద్రాబాద్, శేర్‌లింగంపల్లి, మిర్యాలగూడ నుండి 29 మంది , కరీంనగర్, గోషామహల్, సూర్యాపేట నుండి 25 మంది , యూకూత్‌పుర, నిజామాబాద్ అర్బన్, మంచిర్యాల, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్ నుండి 21 మంది , కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఇబ్రహీంపట్నం నుండి 20 మంది పోటీ చేస్తుండడంతో ఎన్నికల సంఘం మరికొన్ని బ్యాలెట్లను ఏర్పాటు చేయబోతోంది.
ఓటర్ల మధ్య భారీ వ్యత్యాసం - ఈ ఎన్నికల్లో ఓటర్ల మధ్య భారీ తేడా ఉండడం విశేషం. 64 నియోజకవర్గాల్లో పురుష ఓటర్లు కీలక పాత్ర పోషించనుండగా..55 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల ముఖ్య భూమిక వహించనున్నారు. ఇక ఎన్నికల సంగ్రామం కొద్ది రోజుల్లో ముగియనుండడంతో ..ఈ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు అష్టకష్టాలు పడుతున్నారు. డిసెంబర్ 11న ఎవరు కొలువు తీరుతారో తేలనుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి