అందరి చూపు చంద్రబాబు వైపు !
దేశ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. నిన్నటి దాకా మోడీ జపం చేసిన జాతీయ స్థాయి మీడియా సైతం ఇపుడు సౌత్‌లో ఏం జరుగుతుందోనంటూ ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తున్నాయి. నిన్నటి దాకా కాషాయం, పసుపు కలిసి మెలిసి ఉన్నప్పటికీ ..ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు బీజేపీ..టీడీపీలను దూరం చేశాయి. దీంతో విమర్శలు..ఆరోపణలు తీవ్ర రూపం దాల్చాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్సుకత జనాన్ని ఓ పట్టాన ఉండనీయడం లేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని గత ఎన్నికల సందర్భంగా సాక్షాత్తు ప్రధాన మంత్రి మోడీ ప్రజల సాక్షిగా హామీ ఇచ్చారు. దానిని నెరవేర్చడంలో మాట తప్పారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ్ టీం తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించడం ప్రారంభించారు.
కనీస వసతులు లేకుండానే ..కట్టుబట్టలతో ఏపీకి వచ్చామని ..ఈ సమయంలో ఆదుకోవాల్సిన కేంద్రం నిధులు మంజూరు చేయకుండా తీవ్రమైన వివక్ష చూపించిందని విమర్శలు గుప్పించారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూనే అన్ని రంగాలలో ముందంజలో ఉండేలా రాష్ట్రాన్ని పరుగులు పెట్టించామని బాబు ప్రకటించారు. అభివృద్ధి విషయంలో ప్రతిసారి సింగపూర్‌ను ఉదహరించే చంద్రబాబు తనదైన శైలిలోనే మరోసారి అమరావతిని ప్రపంచంలోనే ఆదర్శవంతమైన కేపిటల్ సిటీగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. సానుకూల ఆలోచన దృక్ఫథాన్ని ఇష్టపడే బాబు కేబినెట్‌లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఇన్మర్మేషన్ టెక్నాలజీ శాఖను తన కుమారుడు నారా లోకేష్‌కు అప్పగించారు.
హైటెక్ సిటీ ని ఏర్పాటు చేసి వేలాది మందికి సాఫ్ట్ వేర్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత తనదేనంటారు చంద్రబాబు..ప్రతిసారి. ఆయన ఏపీకి సీఎం అయినప్పటికీ హైదరాబాద్‌తో తనకున్న అనుబంధాన్ని మాత్రం తెంచుకోలేక పోతున్నారు. ఎక్కడికి వెళ్లినా తన ప్రసంగంలో మాత్రం ఈ నగరం గురించి ప్రస్తావించకుండా ఉండలేరు. అది ఆయన స్పెషాలిటీ. ఎప్పుడూ అభివృద్ధి మంత్రం జపించడం ఆయనకు అలవాటు. కాదనలేం. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్న తొమ్మిదేళ్లు కాంట్రాక్టు వ్యవస్థకు తెర తీశారు. కరెంట్ కష్టాలను పట్టించు కోలేదు. జన్మభూమి పేరుతో ఉద్యోగులను పరుగులు తీయించారు. ఆర్థిక సంస్కరణలకు తెర తీశారు. ప్రపంచ బ్యాంకుకు ద్వారాలు తెరిచారు. ప్రతి రంగంలో అభద్రతకు పెద్దపీట వేశారు.
ప్రపంచ వ్యాప్తంగా బాబుకు ప్రశంసలు లభించినా ..చివరకు స్వరాష్ట్రంలో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా జనాన్ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది. బాబుకు షాక్ ఇచ్చింది. దీనిని ఆయన తేలిగ్గా తీసుకున్నారు. మార్పు రావాలని నిత్యం కోరుకునే చంద్రబాబు తాను మారలేక పోయారు. తానింతే..తాను నిద్రపోను..ఇతరులను నిద్ర పోనివ్వనంటూ ఆధిపత్య ధోరణి అవలంభిస్తూ పోయారు. మారిన సమీకరణలు..అధికారానికి..పవర్‌కు కొన్నేళ్ల పాటు దూరంగా ఉండడంతో బాబుకు తాను ఎక్కడ పొరపాటు చేశానో పరిశీలించుకునేందుకు సమయం చిక్కింది. ఏ పార్టీకైనా..లేదా ఏ సర్కార్‌కైనా ప్రజలకు ..ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే ఉద్యోగులను సక్రమంగా చూసుకోక పోతే ఇబ్బందులు ఎదురవుతాయన్న వాస్తవం బాబుకు తెలిసొచ్చింది.
తనకు తాను అనధికారికంగా సీఇఓగా పిలుచుకునే చంద్రబాబు గొప్ప పరిపాలనాదక్షుడు. ఆయనకు ఎదురంటూ లేకుండా చేసుకున్నప్పటికీ తెలంగాణ ఆపద్దర్మ సీఎం కేసీఆర్ విషయంలో పొరపడ్డారు. తక్కువ అంచనా వేశారు. తన కేబినెట్‌లో మంత్రి పదవిని ఆశించిన కల్వకుంట్లకు కేవలం స్పీకర్ పదవి ఇచ్చి పక్కన పెట్టారు. అదను కోసం వేచి చూసిన కేసీఆర్ ఉన్నట్టుండి తన పదవికి రాజీనామా చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కొన్నేళ్ల పాటు ఒంటరి పోరాటం చేశారు.. ఆయన హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ప్రభావం దెబ్బకు గత ఎన్నికల్లో బలమైన కేడర్ కలిగిన టీడీపీ చాలా చోట్ల సీట్లను కోల్పోయింది. కొన్నింటినే దక్కించుకుని పరువు పోకుండా కాపాడుకుంది. అనుకోకుండా రేవంత్ రెడ్డి రూపంలో నోటకు ఓటు కేసులో బాబు పేరు ఉండడంతో ఒక్కసారిగా రాజకీయాలు మరింత వేడెక్కాయి.
గవర్నర్ నరసింహన్ ఇద్దరు సీఎంలను కలిపేందుకు ప్రయత్నాలు చేశారు. అయినా వారి మధ్య సయోధ్య కుదరలేదు. మోడీతో నిన్నటి వరకు చెట్టాపట్టాల్ వేసుకు తిరిగిన బాబుకు చెడింది. దీంతో మోడీ, అమిత్ షా, రాం మాధవ్, నరసింహారావు , తదితరులు చంద్రబాబును టార్గెట్ చేశారు. ఇంత జరిగినా బాబు మాత్రం బెదరలేదు. బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టడంలో సక్సెస్ అయ్యారు. ఇదే విషయమై కేసీఆర్ ప్రయత్నాలు చేసినా అంతగా స్పందన రాలేదు. కర్ణాటకలో బాబు మంత్రాంగం ఫలించింది. అక్కడే కాంగ్రెస్‌తో దోస్తీ కుదిరింది. ఎడమొహం పెడ మొహం గా ఉంటూ వచ్చిన బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతిని ఒప్పించారు. ఫైర్ బ్రాండ్ లేడీగా పేరొందిన పశ్చిమ బెంగాల్ దీదీ మమతా బెనర్జీని కలిశారు. స్టాలిన్‌తో సానుకూలతను వచ్చేలా చేశారు. ఢిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఒప్పించారు. ములాయం సింగ్ యాదవ్ , లాలూలను కలిశారు. ఆర్ ఎల్ డీ అధినేత అజిత్ సింగ్ ఓకే అనేలా చేశారు.
భిన్న ధృవాలుగా ఉన్న ఆయా పార్టీల నేతలను ఒకే వేదికపైకి తీసుకు రావడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కేసులతో భయాందోళనలకు గురి చేస్తూ వచ్చిన మోడీని ఢీ కొనేందుకు సై అంటున్నారు. రాజకీయ పరంగా అపారమైన అనుభవం కలిగిన బాబు ..ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరూ అంచనా వేయలేరు. ప్రముఖ భాషా కోవిదుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నట్టు ఆయన తన నీడను కూడా నమ్మరు అని.
ఏది ఏమైనా దేశ వ్యాప్తంగా ఆక్టోపస్ లా విస్తరించిన మోడీ అండ్ షా కంపెనీని ఎదుర్కోవాలంటే చాలా ధైర్యం కావాలి. ఇపుడు అదే పనిని బాబు చాలా సమర్థవంతంగా చేస్తున్నారనే అనుకోవాలి. తెలంగాణలో కాంగ్రెస్‌తో జత కట్టిన టీడీపీ ఎన్నికల్లో ఏ మాత్రం పుంజుకున్నా అది బాబుకు దక్కిన క్రెడిట్ గా భావించాలి. మొత్తం మీద అటు కాంగ్రెస్ కు ఇటు టీడీపీకి ..టీఆర్ ఎస్‌కు ..బిజేపీకి అగ్ని పరీక్షగానే చూడాలి. బాబు చేస్తున్న ప్రయత్నాలను మీడియా హైలెట్ చేయడం ఒకింత మేలు చేకూరుస్తుందా లేక ఇబ్బందులకు గురి చేస్తుందో వేచి చూడటమే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి