అన్నార్థుల పాలిట ఆరాధ్య దైవం -పిల్ల‌ల నేస్తం రోటీ బ్యాంక్

జ‌నానికి పోలీసులంటేనే భయం..కోపం. క‌ఠినంగా ఉంటార‌ని, అక్ర‌మంగా కేసులు బ‌నాయిస్తార‌ని..అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వేధింపుల‌కు పాల్ప‌డుతున్నార‌నే అభిప్రాయం జ‌నాల్లో ఉంది. దేశంలో ఎక్క‌డికి వెళ్లినా ఇదే ఒపినియ‌న్‌. ఖాకీల్లో కూడా కారుణ్యం క‌లిగిన వారుంటారు. వారిలో మాన‌వ‌త్వం ఉంటుంద‌ని నిరూపిస్తున్నారు. తాము కూడా మ‌నుషులేనంటూ చాటి చెబుతున్నారు. ప్ర‌పంచ ద‌యాగుణం క‌లిగిన దినోత్స‌వం రోజున ఓ వ్య‌క్తి ముంబ‌యి న‌గ‌రంలో నిరాద‌ర‌ణ‌కు గురైన 20 వేల మంది అనాధ పిల్ల‌ల‌కు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. అత‌నే మ‌హారాష్ట్రకు చెందిన మాజీ డీజీపీ డి.శివ‌నంద‌న్‌. చాలా మంది ప‌వ‌ర్‌ను ఎంజాయ్ చేస్తారు. అధికార ద‌ర్పాన్ని ప్ర‌ద‌ర్శిస్తారు. కానీ శివ‌నంద‌న్ విధుల్లోను..రిటైర్ అయ్యాక త‌న‌లోని సేవా గుణాన్ని మాత్రం వ‌దులు కోలేదు. 

మాన‌వ‌త్వం క‌లిగి ఉండ‌డం పుట్టుక‌తో వ‌స్తుంది. అది ఒక‌రు నేర్పితే రాదు. ఈ దేశంలో లెక్క‌లేనంత మంది ఉగ్ర‌వాదుల‌తో నిండి పోయింది. వారు చేస్తున్న ఆగ‌డాల దెబ్బ‌కు ట‌న్నుల కొద్దీ ఆహారం వృధా అవుతోంది. ఈ దేశంలో 20 కోట్ల మంది ప్ర‌తి రోజు అన్నం కోసం అర్రులు చాస్తున్నారు. ఆక‌లి చావుల‌కు గుర‌వుతున్నారు. ఈ విష‌యం గుర్తించిన శివ‌నంద‌న్ తానెందుకు ఆదుకోకూడ‌దు అనుకుంటూ సాయం చేసేందుకు రంగంలోకి దిగారు. రోటీ బ్యాంక్ ఏర్పాటు చేశారు. ముంబ‌యిని చుట్టుముట్టారు. ప్ర‌తి గ‌ల్లీ గ‌ల్లీ తిరిగారు. రెస్టారెంట్లు, హోట‌ళ్లు, చిన్న చిన్న అంగ‌ళ్లు, ఫంక్ష‌న్ హాల్స్‌, ఇల్లిల్లు తిరిగారు. తిను ప‌దార్థాల‌ను పారేయొద్దు..మిగిలిన వాటిని నాకివ్వండి అంటూ విజ్ఞ‌ప్తి చేశారు. ఆయ‌న అభ్య‌ర్థ‌న‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. క్ల‌బ్స్‌, పార్టీలు, డిస్ట్రిబ్యూట‌ర్ల ద‌గ్గ‌ర‌కు ఆయ‌న వెళ‌తారు. 

ఈ మాజీ పోలీసు అధికారి చేసిన ప్ర‌య‌త్నానికి అన్ని వ‌ర్గాల నుండి మ‌ద్ధ‌తు ల‌భించింది. ఆస‌రా దొరికింది. వేలాది మంది పిల్ల‌ల‌కు రోజూ అన్నం దొరికేలా చేసింది. బాల్యం ఓ వ‌రం. వారికి ఆ స్థితిలో ఆక‌లి నుండి ర‌క్షించ‌డమే మ‌న‌ముందున్న క‌ర్త‌వ్యం. ఇంత‌కంటే ఏం చేయ‌గ‌లం అంటారు శివ‌నంద‌న్‌.  మొద‌ట్లో ఆయ‌న ప్రొఫెస‌ర్‌గా ఉన్నారు. ఎక‌న‌మిక్స్ లో పాఠాలు బోధించారు. యుపీఎస్సీకి అప్ల‌యి చేశారు. ఐపీఎస్‌కు ఎంపిక‌య్యారు మొద‌టి ప్ర‌య‌త్నంలోనే. 
పేద‌రికం, ఆక‌లి పోవాలంటే ఏం చేయాలి..స‌క‌ల స‌మ‌స్య‌ల‌కు మూలం ఆక‌లి. దీనిని నివారించాలంటే ఏం చేయాలి. మందులు లేవు ఆహార‌మే జీవ‌నాధారం. ఆయ‌న పోలీసు అధికారిగా ఉన్న స‌మ‌యంలో ముంబ‌యిలో అల్ల‌ర్లు చెల‌రేగాయి. ఎన్నో సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. వాట‌న్నింటిని శివ‌నంద‌న్ ప‌రిష్క‌రించారు. త‌న‌దైన శైలిలో ట్రీట్‌మెంట్ ఇచ్చారు. 

విధి నిర్వ‌హ‌ణ సంద‌ర్బంగా గ‌డ్చిరౌలికి వెళ్లా. అక్క‌డ కేవ‌లం ఆహారం కోసం అల్లాడుతున్న పిల్ల‌లు, పెద్ద‌ల‌ను చూశా. క‌డుపు త‌రుక్కు పోయింది. ఎంతో కొంత వారికి ఇవ్వ‌గ‌లిగితే క‌నీసం చావ‌కుండానైనా బ‌తుకుతార‌న్న ఆలోచ‌న వ‌చ్చింది. అదే రోటీ బ్యాంక్‌. అదే రోజు ఆయ‌న ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. తానే ఎందుకు ముందుకు రాకూడ‌దంటూ ..సాయం చేయ‌డం ప్రారంభించారు. మూడు స్కూళ్ల‌లోని పిల్ల‌ల‌కు అన్నం పెట్టారు. ఇపుడు వంద‌లాది స్కూళ్ల‌ను శినంద‌న్ ద‌త్త‌త తీసుకున్నారు. ఆక‌లి కోసం పిల్ల‌లు అడ‌గ‌డం లేదు. వారంతా చ‌దువుకుంటున్నారు. కొంత‌మందితో ప్రారంభ‌మైన ఈ రోటీ బ్యాంక్ ఇపుడు 4500 మంది పిల్ల‌ల పాలిట దైవంగా మారింది. 

ప్రార్థించే పెద‌వుల కంటే సాయం చేసే చేతులే మిన్న అన్న మ‌ద‌ర్ థెరిస్సా మాట‌ల‌ను మాజీ డీజీపీ శివ‌నంద‌న్ నిజం చేస్తున్నారు. వేలాది మంది ఖాకీల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. ఎన్‌కౌంట‌ర్ల‌కు పాల్ప‌డుతూ..కేసులు న‌మోదు చేస్తూ..వేధింపుల‌కు పాల్ప‌డుతున్న పోలీసులు శివ‌నంద‌న్‌ను చూసి నేర్చుకోవాలి. అనాధ పిల్ల‌ల పాలిట దైవంగా మారిన ఈ మాజీ డీజీపీ మాత్రం తానేమీ చేసిందేమీ లేదంటారు. 

కామెంట్‌లు