దేశం మెచ్చిన దేవుడు - ప్రాతఃస్మ‌ర‌ణీయుడు..ఆద‌ర్శ‌ప్రాయుడు

నిస్వార్థంగా స‌మాజానికి సేవ‌లందించిన నిజ‌మైన దేవుడు సంత్ గాడ్డే బాబా మ‌హ‌రాజ్‌. కోట్లాది భ‌క్తుల కొంగు బంగారంగా కొలిచే షిర్డీ సాయినాథుడికి స‌మ‌కాలీనుడు. మ‌హారాష్ట్ర అమ‌ర‌వాతి జిల్లా షేన్‌గావ్ లో 1876 ఫిబ్ర‌వ‌రి 23న సంత్ గాడ్డే జ‌న్మించారు. 80 ఏళ్లు జీవించారు. ఇండియ‌న్ పీఎం న‌రేంద్ర మోడీ చేప‌ట్టిన స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మానికి ఊపిరి పోసింది బాబానే. ఏ చ‌దువులేని వ్య‌క్తి మ‌హోన్న‌త మాన‌వుడిగా ఎలా ఎదిగాడో తెలుసు కోవాలంటే..ఈ క‌థ చ‌ద‌వాల్సిందే. సంచారి, సంస్క సంస్క‌ర్త‌, ఆధ్యాత్మిక దీప‌ధారి, స్వ‌చ్ఛ‌త ఉద్య‌మానికి ఆద్యుడు. కుల నిర్మూల‌న కోసం పాటు ప‌డిన వ్య‌క్తి. ప్ర‌తి ఒక్క‌రు అక్ష‌రాస్యులు కావాల‌ని విద్యాదానం చేసిన ఆద‌ర్శ‌ప్రాయుడు. ప‌రిశుభ్ర‌త కోసం..అంట‌రానిత‌నం నిర్మూల‌న కోసం శ్ర‌మించిన ఉద్య‌మ‌కారుడు.సంత్ బాబా.
ర‌జ‌క కుటుంబంలో జ‌న్మించిన బాబా త‌ల్లిదండ్రులు జింగ్రాజీ, స‌క్కుబాయి. సంత్ అస‌లు పేరు దేబూజీ ఝింగ్ రాజీ జానోర్క‌ర్‌. సంత్ మ‌హ‌రాజ్ నుండి గాడ్గే బాబాగా సుప్ర‌సిద్ధులు. జ‌గ‌మెరిగిన జ‌గ‌ద్గురువు.. సాధువుగా ..సంచార భిక్షువుగా ఆయ‌న త‌న ప్రస్థానం సాగింది. అంద‌రూ అస‌హ్యించుకునే చీపురుక‌ట్ట‌నే త‌న ఆయుధంగా మల్చుకున్నారు సంత్‌. ప‌క్క‌వారితో ప్రేమ‌గా ఉండ‌డం, సాటి వారి ప‌ట్ల ద‌య క‌లిగి ఉండ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. గ్రామాల్లో శుభ్ర‌త‌, క‌లిసి ఉండేలా చేయ‌డం, నిస్వార్థంగా సేవ‌లో పాల్గొనాల‌ని ప్ర‌చారం చేశాడు.
తండ్రి దేబూజీ చిన్నతనంలోనే మద్యపానానికి బానిసై మరణించడంతో దేబూజీ మేనమామ ఇంట్లో ఆశ్రయం పొందారు. మేనమామ కూడా మంచి భూవసతి కలిగినవాడు కావడంతో పశువుల్ని చూసుకుంటూ, పొలంపనులు చేస్తూ కుటుంబంలో మంచిపేరు తెచ్చుకున్నారు. చిన్నతనం నుంచీ భజన మండళ్ళలో కీర్తనలు, పాటలు పాడుతూ చుట్టుపక్కల గ్రామాలలో పేరొందారు. షావుకారు తన ఆస్తిని అన్యాయంగా ఆక్రమించుకో బోగా దానిని సహించలేక ఎదురు తిరిగారు. షావుకారు గూండాలను పంపితే దేబూజీ ఒక్కడే వారందరినీ తన్ని తరిమేశారు.
దేబూజీ తన 29వ ఏట ఫిబ్రవరి 5న 1904లో కుటుంబాన్ని అర్థరాత్రి వేళ విడిపెట్టి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఆయనకు తల్లి, తాత, భార్య, పిల్లలు ఉన్నారు. ఇద్దరు బిడ్డల తండ్రి కావడంతో పాటు భార్య గర్భవతిగా ఉంది. అనంతర కాలంలో ఆయన సన్యాసం స్వీకరించి, గాడ్గేబాబాగా సుప్రసిద్ధులయ్యారు. తర్వాతి కాలంలో కుటుంబం అనుసరించగా వారిని ఎప్పటి లాగానే సామాన్యమైన పూరిల్లులో ఉంచారు.
దేవూజీ సన్యాసాశ్రమాన్ని స్వీకరించాకా రంగు రంగుల పీలికలను కలిపి కట్టుకునేవారు. ఆయన భిక్షను స్వీకరించే మట్టి పాత్ర (మరాఠీలో గాడ్గే) తలపై పెట్టుకుని తిరుగుతూ ఉండడంతో ఆయనను గాడ్గే బాబాగానూ, గాడ్గే మహరాజ్ గానూ పిలిచే వారు. గ్రామాల్లో సంచరిస్తూ భిక్షను స్వీకరించడమే కాక వారికి స్వయంగా రచించిన కీర్తనలను ఆలపిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక సాంఘిక విషయాల పట్ల చైతన్యం రేకెత్తించారు. సేవా కార్యక్రమాలు చేప‌ట్టారు. ఆకలితో వున్నవారికి ఆహారం, దాహంతో అలమటిస్తున్న వారికి నీరు, దుస్తులు లేనివారికి వస్త్రాలు, పేదలకు నాణ్యమైన విద్య, రోగులకు వైద్యం, తల దాచుకునేందుకు నివాసం, జంతువులకు రక్షణ, నిరుద్యోగులకు ఉపాధి, నిస్సహాయులకు ఆలంబన, పేద యువతీ యువకులకు వివాహం జ‌రిపించారు. బాబా ఒక్క‌డే జీవితమంతా కృషి చేశారు.
భక్తులను ప్రోత్సహించి, వారి విరాళాలతో మహారాష్ట్ర వ్యాప్తంగా 150 పాఠశాలలు, ధర్మశాలలు, శరణాలయాలు, గోశాలలు, ఆస్పత్రులు, విద్యార్థినుల వసతి గృహాలు నిర్మించారు. వందలాది సేవా సంస్థలను, ట్రస్టులను నిర్మించారు. ఇందుల్లో త‌న కుటుంబీకుల్లో ఏ ఒక్క‌రు ఉండ‌కుండా చేశారు. త‌న నిజాయితీని చాటుకున్నారు.
సంచార సన్యాసిగా ఏ గ్రామానికి వెళ్తే అక్క‌డున్న మురికిని, చెత్తను చీపురుతో శుభ్రం చేశారు. ఆయన జీవితాంతం ప‌రిశుభ్ర‌త కోసం అంకితం చేసిన వ్య‌క్తిగా చ‌రిత్ర‌లో నిలిచి పోయారు. ఊడ్చ‌డం..ప‌రిశుభ్రంగా ఉండ‌డం అంటే దైవాన్ని చేరుకోవ‌డ‌మేన‌ని బాబా బోధించాడు. కొన్నేళ్లు గడిచాకా గ్రామాలలో అపరిశుభ్రతను రూపు మాపేందుకు చీపురు దండును నెలకొల్పాడు. బాబా స్థాపించిన చీపురుదండులో ఎందరో తదనంతర కాలంలో రచయితలుగా, పత్రికా సంపాదకులుగా, రాజకీయ నాయకులుగా ఎదిగారు. బాబా భావజాలానికి ప్రత్యక్ష పరోక్ష వ్యాప్తిని కల్పించారు.
బాబా కులవివక్షను, కులతత్త్వాన్నీ తీవ్రంగా వ్యతిరేకించార‌. గాడ్గే బాబాను ఎవరైనా మీదే కులం అని ప్రశ్నిస్తే, నేను దళితుణ్ణని సమాధానం చెప్పేవారు. పండరిపూర్‌లో స్వామివారి ఉత్సవాలు వర్షా కాలంలో జరిగేవి. ఈ ఉత్సవాలలో పాల్గొనేందుకు దూరతీరాల నుంచి వచ్చి పాల్గొనే భక్తులతో క్షేత్రమంతా కిక్కిరిసిపోయేది. అప్పట్లో ఆలయ ప్రవేశార్హత లేక కేవలం ఆలయంపై వుండే కలిశాన్ని చూసేందుకు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళే దళిత కులస్తుల ఇక్కట్లు మరీ ఎక్కువగా వుండేవి.
వారు విశ్రాంతి తీసుకునేందుకు, బసచేసేందుకు ఏర్పాట్లూ లేవు. వారి ఇబ్బందులను గమనించిన గాడ్గే బాబా భక్తులు, ప్రజల సహకారాలను అర్థించి అక్కడ చొక్క మేళా పేరుతో ఓ ధర్మశాల నిర్మించారు. దళిత భక్తుల కోసం కట్టించిన తొలి ధర్మశాలగా ఇది ప్రఖ్యాతి పొందింది. బాబా తన పర్యటలనలో జంతు బలులను ఖండించారు. సంతానం కలిగినపుడు ఇచ్చే జంతుబలులను ఉద్దేశించి ఒక జీవి పుట్టుక సందర్భంగా ఇంకో జీవిని బలి ఇవ్వడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
విద్యాభ్యాసమే సమాజంలోని మూఢత్వానికి, వెనకబాటుతనానికి విరుగుడని నమ్మే బాబా తన భక్తులిచ్చిన విరాళాలను వినియోగించి అనేక పాఠశాలలు, వసతి గృహాలు నిర్మించారు. వందకు పైగా పాఠశాలలను ఆయన నెలకొల్పారు.
రోగులకు, ఆర్తులకు ఇళ్ళులేని, ఆధారంలేని వృద్ధులను ఆదరించేందుకు వృద్ధాశ్రమాలు నిర్మించారు. సమాజం నుంచే కాకుండా అత్యంత సన్నిహితుల నుంచి కూడా దూరమై దారుణ‌మైన వివక్షను అనుభవిస్తున్న కుష్ఠు రోగులకు సేవాశాలలు నిర్మించి ఆదుకున్నారు.
చిన్నతనంలో తండ్రిని తాగుడు కారణంగా పోగొట్టుకున్న గాడ్గే బాబా వ్యసనాలపై వ్యతిరేకత జీవితాంతం కొనసాగింది. తన కీర్తనల ద్వారా మద్యపానం, ధూమపానం, జూదం వంటి దుర్వ్యసనాలకు వ్యతిరేకంగా చైతన్యాన్ని ప్రజల్లో వ్యాపింపజేశారు. తాగుడు వ్యసనం కుటుంబాల ఆర్థిక స్థితిని, వ్యక్తి ఆరోగ్యస్థితిని, మానసికస్థితిని ఎలా దెబ్బతీస్తుందో మనస్సుకు హత్తుకునేలా వివరించారు.. తాగి ఇంటికి వస్తే తండ్రినైనా కొట్టి మాన్పించమని బాబా బోధించారు. మహారాష్ట్ర సమాజంపైన సంత్ గాడ్డే బాబా సామాజిక బోధ‌న‌ల ప్ర‌భావం ఉంది.
భార‌త రాజ్యాంగ నిర్మాత‌..సామాజిక ఉద్య‌మ‌కారుడు డాక్ట‌ర్ బి.ఆర్. అంబేద్క‌ర్ పై గాడ్గే ప్ర‌భావం అధికంగా ఉంది. మ‌తం మార్చుకోవాల‌ని భావిస్తున్న స‌మ‌యంలో అంబేద్క‌ర్ బాబాను స‌ల‌హా కోరారు. నేను చ‌దువు కోలేదు. ధ‌ర్మ‌మేదో..అధ‌ర్మ‌మేదో..ఏది స‌త్య‌మో ఏది అస‌త్య‌మో నీకే ఎక్కువ‌గా తెలుసు..కానీ ఏ మ‌తానికి హానీ క‌ల‌గ‌కుండా చూడు అని బాబా చెప్పిన మాట‌లు జీవిత‌కాలం వెంటాడేలా చేశాయి.
మాజీ సీం బి.జి.ఖేర్ స్వాతంత్ర పోరాట స‌మ‌యంలో గాడ్డే బాబా చేస్తున్న సేవాల కార్య‌క్ర‌మాల గురించి మ‌హాత్మా గాంధీకి వివ‌రించారు. కొన్నేళ్ల త‌ర్వాత సంచార స‌మ‌యంలో వార్దాను సంద‌ర్శించారు సంత్‌. విష‌యం తెలుసుకున్న గాంధీ ..గాడ్గేను త‌న ఆశ్ర‌మానికి ఆహ్వానించారు. వారిద్దరూ సమాజంలోని అవిద్యను, అంటరానితనాన్ని, దుర్వ్యసనాలను రూపమాపడం వంటి విషయాలపై చర్చించారు. నెహ్రూ మంత్రివర్గంలో పనిచేసిన పంజావ్ రావు, బాబూరావ్ పాటిల్, ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ జి.డి.తపసే, పాత్రికేయులు అనంత్ హరిగద్రే, ప్రబోంధాకర్ థాకరే, మరాఠా రచయిత పి.కె.ఆత్రే ( బాల్ థాకరే తండ్రి), జి.ఎన్.దండేకర్ సహా ఎందరో ప్రముఖులు ఆయన శిష్యులు. వీరంతా చీపురు దండులో సభ్యులుగా పని చేసిన వారే.
సంఘంలోని సంస్కరణల కోసం కృషి చేసిన పలువురు సాధువుల నుంచి స్ఫూర్తి పొందారు. చొక్కమేళ అనే దళిత సాధువును అభిమానించే గాడ్గే బాబా.. ఆయన పేరు మీదుగానే తాను దళితుల కొరకు నిర్మింప జేసిన ధర్మశాల పేరు పెట్టారు. గాడ్గే మహరాజ్‌కు ఆయన సమకాలికులైన మెహర్ బాబాపై చాలా గౌరవాభిమానాలుండేవి. ఆయనను స్వయంగా తన కుష్ఠురోగుల ఆశ్రమానికి ఆహ్వానించి ఇద్దరూ కలిసి రోగులకు స్నానాలు చేయించారు గాడ్గే మహరాజ్ సమకాలికుడు, ఆయన తర్వాతి తరపు సంఘ సంస్కర్త అయిన తుక్డోజీ మహరాజ్‌తో కూడా సత్సంబంధాలు నెరిపారు.
అమరావతిలో సంత్ గాడ్గే పేరు మీద 1983న అమరావతి విశ్వ విద్యాలయాన్ని నెలకొల్పారు. 1977 సంవత్సరంలో దేవకీ నందన్ గోపాలా పేరుతో గాడ్గే బాబా జీవితాన్ని చలన చిత్రంగా ప్రముఖ నిర్మాత డడ్డీ దేశ్‌ముఖ్ నిర్మించారు. ఆ చిత్రానికి పురస్కారాలు, విదేశీ చలన చిత్రాల్లో పాల్గొనే అవకాశాలు కూడా లభించాయి.1999లో భారత ప్రభుత్వం గాడ్గే బాబా గౌరవార్థం తపాలా స్టాంపును విడుదల చేసింది. 2001లో వాజపేయి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం భారతదేశ వ్యాప్తంగా గ్రామ స్థాయి పరిశుభ్రతను మెరుగు పరిచేందుకు సంత్ గాడ్గే బాబా అండ్ గ్రామ్ స్వచ్ఛతా అభియాన్ పేరిట పథకాన్ని తయారుచేసి అమలుపరిచింది.
ఎక్క‌డో మారుమూల ప‌ల్లెలో జ‌న్మించిన ఈ మాన‌వ‌తామూర్తి..1956 డిసెంబ‌ర్ 20న అమ‌రావ‌తి వెళుతూ..పేధీ న‌దీ తీరాన ఉన్న వ‌ల‌గావ్ ద‌గ్గ‌ర త‌నువు చాలించారు. బ‌తుకంతా స‌మాజ సంస్క‌ర‌ణ కోసం..దీనబాంధ‌వుల కోసం బ‌తికిన ఆ మ‌హోన్న‌త మాన‌వుడు ఇక సెల‌వంటూ వెళ్లిపోయాడు. ఆయ‌న అడుగు జాడ‌లు ప‌దిలంగా ఇంకా ఉన్నాయి. అవి కోట్లాది ప్ర‌జ‌ల గుండెల్లో నిక్షిప్త‌మై సంచ‌రిస్తూనే ఉన్నాయి. సంత్ ..నువ్వు లేవ‌ని ఎవ‌ర‌న్నారు..స్వ‌చ్ఛంగా సూర్య‌చంద్రులు ఉన్నంత కాలం ఉద‌యిస్తూనే వుంటారు.

కామెంట్‌లు