కవి సంగమం - కవిత్వంతో కరచాలనం
ఎవరన్నారు కవిత్వానికి కాలం చెల్లిందని. కవిత్వమే అఖ్కర్లేదని. బతుకును కాన్వాస్‌లో బంధించాలంటే..సమాజాన్ని లెన్స్‌లో చూడలంటే ఏం కావాలి..కవిత్వమే. అవును కవిత్వం తీరని దాహం. అదో సముద్రం. అదో జీవనాదం.. సజీవ నదుల సంగమం. కవిత్వం తీరని దాహం. మట్టిని..ప్రకృతిని..మనిషిని..ప్రవాహాన్ని అందిపుచ్చుకుని కొత్త పుంతలు తొక్కుతోంది కవిత్వం. జొన్న కంకుల్లా నిటారుగా నిలబడ్డది. నిగ్గదీసి నిలదీస్తోంది. కవిత్వంతో సమస్యలపై కవాతు చేస్తోంది. లోకాన్ని ఏలుతోంది. జనాన్ని జాగృతం చేస్తోంది. ప్రజల పక్షాన గొంతుకై భరోసా కల్పిస్తోంది. న్యాయమైన పోరాటాలకు..అన్యాయమై పోయిన హక్కులకు తోడుగా నిలుస్తోంది. తరాలు మారినా..అంతరాలు పెరిగినా..కుటుంబాలు విధ్వంసమైనా..ప్రపంచీకరణ ఆధిపత్యం చెలాయించినా అమెరికా పెద్దన్న ఆగడాలను ప్రశ్నిస్తోందీ..ఈ కవిత్వమే.
కలాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆలోచనలకు రెక్కలు తొడిగి..సకల జనుల ఆశలకు జీవం పోస్తున్నాయి. కవిత్వం జీవనాడులకు ఆక్సిజన్ అందిస్తోంది. అంతేనా చావు బతుకుల మధ్య ప్రాణం పోలేక కొట్టుమిట్టాడుతున్న సకల ప్రాణులకు అండగా నిలుస్తోంది. ఈ లోకాన్ని వెలిగించే పనిని భుజానికి ఎత్తుకుంది. ఇదంతా ఒక పార్శమ్వే. కానీ ఇవాళ కవిత్వం ఆయుధమై జనం చేతుల్లో శక్తిని నింపుతోంది. ఏ ఆసరా లేకుండా..పాలకుల దాష్టీకాల్ని ప్రశ్నిస్తూ..అన్యాయాలపై యుద్ధం ప్రకటించిన అడవి బిడ్డలకు..మట్టి బిడ్డలకు బలాన్ని ఇస్తోంది . కవిత్వంతో కరచాలనం చేయడమంటే కొన్ని తరాలను నెమరు వేసుకోవడం. సంబండ వర్ణాల భావోద్వేగాలను పంచుకోవడం. అంతేనా సమస్త ప్రపంచాన్ని ఆవిష్కరించడం.
ప్రాంతం ఏదైతేనేం..కులాలు, మతాలు, వర్గాలు ఏవైతేనేం..కవిత్వం మాత్రం అందరి పక్షాన వాయిస్ గా మారింది. నదులన్నీ కలిసి సముద్రంలో కలిసినట్టే..భిన్న ప్రాంతాలు..విభిన్నమైన సంస్కృతులకు నిలమైన ఈ దేశంలో కవిత్వం ప్రవాహమై చుట్టేస్తోంది. టెక్నాలజీ పెరిగినా..స్మార్ట్ ఫోన్లు జిగేల్ మనిపించినా..ఆండ్రాయిడ్ హవా కొనసాగినా..యాప్‌లు ఆకట్టుకుంటున్నా..సరే కవిత్వం అంతకంతకూ డామినేట్ చేస్తూ ఔరా అనిపిస్తోంది. సామాజిక మాధ్యమాల పుణ్యమా అంటూ సాహిత్యం..కవిత్వం సమాంతరంగా ఎదుగుతూ వస్తున్నాయి. పద్యాలు, గేయాలు, నాటికలు, కవితలు, నవలలు, కథలు..ఇలా చెప్పుకుంటూ పోతే ఏడాదవుతుంది. కవిత్వం ప్రజల కోసమేనంటూ వారి గొంతుకై సామాజిక మాధ్యమాల్లో వకల్తా పుచ్చుకుని చైతన్యవంతం చేసే పనిలో నిమగ్నమై పోయింది.
ప్రపంచాన్ని సంబ్రమాశ్చర్యాల్లోకి నెట్టేసిన తెలంగాణ ఉద్యమానికి కవులు, కళాకారులు, రచయితలు, గాయకులు కీలక భూమికను పోషించారు. పోరాటాన్ని ముందుండి నడిపించారు. శరీరంలో తూటాలు పెట్టుకుని పాటలల్లిన ప్రజా యుద్ధనౌక గద్దర్ కూడా గాయకుడే కాదు కవి కూడా. నిన్ను విడిచి వుండలేనమ్మా అంటూ కవిత్వం సుసంపన్నమవుతోంది. తెలునాట తన స్థానాన్ని పదిలం చేసుకుంది. టంబ్లర్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రాం, ఫేస్ బుక్, ఇలా సామాజిక మాధ్యమాల్లో కవులు కవాతు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా కవిత్వానికి మరింత క్రేజ్‌ను తీసుకొచ్చిన ఘనత మాత్రం ప్రముఖ కవి యాకూబ్ దే.
సజీవ సంగమం - కవి సంగమం - యాకూబ్ ఏ ముహూర్తానా దీనిని ప్రారంభించాడో కానీ తక్కువ సమయంలోనే మరింత పాపులర్ అయింది. వేలాది మంది కవులు తమ కవితా గానంతో ఆకట్టుకున్నారు. అద్భుతమైన కవిత్వాన్ని ఒలికించారు. ఇక్కడ కవిత్వం విరాజిల్లుతోంది. ఇతర ప్రాంతాలతో కవులను ఆశ్చర్య పోయేలా చేసింది. కవి సమ్మేళనాలు నిర్వహించింది. పలు వర్క్ షాప్‌లు ఏర్పాటు చేసింది. వృత్తి రీత్యా పాఠాలు బోధించే యాకూబ్ జీవితమంతా కవిత్వానికే అంకితం చేశాడు. ప్రసేన్, సీతారం, యాకూబ్ వీళ్లంతా నిన్నటి తరానికి ప్రతీకలు..నేటి తరానికి దిక్సూచీలుగా ముద్ర పడ్డారు.
చరిత్ర లిఖించిన యాకూబ్ - ఎలాంటి విమర్శలకు తావు లేకుండా కేవలం కవిత్వమే భూమికగా ఇది కొన్ని సంవత్సరాల పాటు నిరాటంకంగా సాగుతోంది. ఇదంతా కవి యాకూబ్ కృషే. ఆయనకు తోడుగా సతీమణి ..కవయిత్రి శిలాలోతి, నంద కిషోర్, శ్రీనివాస్ ..ఇలా ఎందరో కవిసంగమానికి జీవం పోస్తున్నారు. సజీవమై నిలిచేలా పాటుపడుతున్నారు. ఒక్క రోజులోనే కొందరు పాపులర్ అయిన సందర్భాలు కోకొల్లలు. కవిత్వం ఎక్కడున్నా యాకూబ్ వాలిపోతారు. కొత్త కవులను ప్రోత్సహిస్తూ..మార్గనిర్దేశనం చేస్తూ..తప్పు ఒప్పులను సరి చేస్తూ కవిత్వాన్ని బతికిస్తున్నారు.
నువ్వొక పచ్చని చెట్టయితే, పిట్టలు వాటంతట వచ్చి వాలేను అన్న ట్యాగ్ లైన్‌తో ప్రారంభమైన కవిసంగమం ఇపుడు ప్రభుత్వాన్ని ఆకట్టుకుంది. సాంస్కృతిక దిగ్గజాలను మెస్మరైజ్ చేసింది. ఎక్కడో మారుమూల పల్లెల్లో ఉన్న వారికి..పట్టణాల్లో ఫ్లాట్ ఫాం లేకుండా ఉన్న వారికి..కొందరి పీఠాలుగా వర్దిల్లుతున్న పత్రికలు, మీడియా లాంటి వాటికి చెక్ పెడుతూ కవి సంగమం వెన్ను దన్నుగా నిలుస్తోంది.
నువ్వొక పచ్చని చెట్టయితే, పిట్టలు వాటంతట వచ్చి వాలేను అన్న ట్యాగ్ లైన్‌తో ప్రారంభమైన కవిసంగమం ఇపుడు ప్రభుత్వాన్ని ఆకట్టుకుంది. సాంస్కృతిక దిగ్గజాలను మెస్మరైజ్ చేసింది. ఎక్కడో మారుమూల పల్లెల్లో ఉన్న వారికి..పట్టణాల్లో ఫ్లాట్ ఫాం లేకుండా ఉన్న వారికి..కొందరి పీఠాలుగా వర్దిల్లుతున్న పత్రికలు, మీడియా లాంటి వాటికి చెక్ పెడుతూ కవి సంగమం వెన్ను దన్నుగా నిలుస్తోంది.
ఎలాంటి సిఫారసులు, పైరవీలకు తావు లేకుండా కవి సంగమం సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఇప్పటికే వేలకు పైగా ఇందులో సభ్యులుగా ఉన్నారు. కవిత్వాన్ని తమ శ్వాసగా భావించే వర్దమాన కవులు తమ కలాలకు పని చెబుతున్నారు. స్పష్టంగా..సూటిగా..ప్రశ్నిస్తున్నారు. కవిత్వం లేకుండా బతకలేమంటున్నారు. ఈ కవిసంగమం ఇంతలా విజయవంతం కావడం వెనుక తొమ్మిది మంది అకుంఠితమైన కృషి ఉంది. వీరే అడ్మిన్ బాధ్యతలు చూస్తున్నారు. కవి యాకూబ్‌తో పాటు బూర్ల వెంకటేశ్వర్లు, వాహెద్, కట్టా శ్రీనివాస్, విరించి విరివింటి, యశస్వి, శ్రీనివాసు వాసుదేవ మూర్తి, అనిల్ డానీ, తూముచర్ల కవిత్వం జయహో అనేలా కృషి చేస్తున్నారు. ప్రతి నెలా రెండో శనివారం ఆబిడ్స్ లోని గోల్డెన్ త్రిషోల్డ్ లో సమావేశం నిర్వహిస్తారు. ప్రముఖ కవులు శివారెడ్డి, వాడ్రేవు చినవీరభద్రుడు, సిరాశ్రీ, గోరేటి వెంకన్న , తదితరులతో ముఖాముఖి ఉంటుంది. సవాలక్ష సందేహాలు, ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. కవి సంగమంకు ఫేస్ బుక్‌లో ఓ ప్రత్యేకమైన పేజీ వుంది. రోజు రోజుకు అభిమానుల తాకిడి ఎక్కువవుతోంది. ఇదంతా యాకూబ్ చలవే.
ఖమ్మం జిల్లా రొట్టమాకురేవు అనే పల్లెలో జన్మించిన ఈ కవి ..ఏది మాట్లాడినా పరిమళభరితంగా ఉంటుంది. మన పల్లెతో ముచ్చటించినట్టుగా అనిపిస్తుంది. అంతలా ఆయన అల్లుకు పోయారు. కవి సంగమం తన కేరాఫ్‌గా మార్చుకున్నారు. 35 ఏళ్ల కిందట తన ఊరు నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిర పడ్డారు. తన తండ్రి షేక్ మహమ్మద్ మియా, నరసింహారావు, రామిరెడ్డి పేర్ల మీదుగా రొట్టమాకురేవు తో ప్రతి ఏటా కవులను సత్కరిస్తున్నారు. ఆయన ఇల్లే ఓ సాహిత్య పాఠశాల. వేల పుస్తకాలతో కూడిన గ్రంథాలయం. మీకు వీలైతే కవి సంగమంలో చేరండి లేదంటే ముఖ పుస్తకంలో వెదకండి. టైముంటే కవిత్వాన్ని రాసే ప్రయత్నం చేయండి. రోజుకు ఒక్కసారైనా చదివే అలవాటు చేసుకోండి. మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. అంతేనా ప్రేమించేలా మారిపోతారు. జస్ట్ ఒన్ మినట్..అంతే ఓ కవిత..ఓ వాలు చూపు..ఓ పాట..లైఫ్‌ను లెన్స్‌లో చూడండి. మీకు కొత్తగా అగుపిస్తుంది. అదే కవిత్వానికి ఉన్న శక్తి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి