బంగారుకొండ..విజ‌య దేవ‌ర‌కొండ ..!

నాట‌కంలో ఎవ‌రి పాత్ర ఏమిటో అలా వ‌చ్చి ఇలా వెళ్లి పోతుంది. కానీ సినిమా అలా కాదు. అదో క‌ల‌ల ఖార్ఖానా. వేలాది మంది ఒక్క‌సారైనా త‌మ బొమ్మ చూసుకోవాల‌ని అనుకుంటారు. ఇంకొంద‌రు ఒక్క ఛాన్స్ ఎప్పుడు వ‌స్తుందా అనుకుంటూ లైఫ్‌ను కోల్పోయిన వాళ్లున్నారు. చెన్నై..ముంబ‌యి..క‌ర్ణాట‌క‌..హైద‌రాబాద్‌..ఇలా అన్ని న‌గ‌రాలు సినిమా జ‌పం చేస్తున్నాయి. ఇదో మాయాజాలం. కోట్లాది రూపాయ‌లు ఇక్క‌డ చేతులు మారుతుంటాయి. అగ్రిమెంట్లు..సంత‌కాలు..జిగేల్ మ‌నిపించే తార‌లు..త‌ళుక్కులు..ఛ‌మ‌క్కులు..కొంద‌రు ఉన్న‌ట్టుండి స్టార్లుగా మారిపోతే..ఇంకొంద‌రు స్టార్ చ‌ట్రంలో ఇముడ‌లేక బ‌య‌ట‌కు రాలేక జీవిస్తున్నారు.
టాలీవుడ్ డిఫ‌రెంట్‌. ఇక్క‌డ టాలెంట్ ఉన్న వాళ్ల‌కు కొదువ లేదు. ప్ర‌తిభ‌కు హ‌ద్దే లేదు. కానీ సిఫార‌సులు..పైర‌వీలకు ఇక్క‌డ ప్ర‌యారిటీ ఉంటుంది. వార‌స‌త్వ ముద్రైనా ఉండాలి..లేక‌పోతే నెట్టుకు రావ‌డం క‌ష్టం. ఇలా వ‌చ్చి అలా వెళ్లి పోవాల్సిందే. థియేట‌ర్లు కొంద‌రి చేతుల్లోనే..సినిమాలు ఎన్నో ..ఆడేవి కొన్నే. ఆడించేవి ఎన్నో. ఇక తార‌ల గురించి చెప్పాల్సి వ‌స్తే..టాలెంట్ కంటే అందానికే ప్రాముఖ్యం. హీరోనే అన్నీ. డైరెక్ట‌ర్ లు ఇపుడు నామ్‌కే వాస్తే అన్న‌ట్టుగా త‌యారైంది.
అవే సినిమాలు..అవే పాట‌లు..నాలుగు ఫైట్లు..పంచ్‌లు..ప్రాస‌లు..హ‌త్య‌లు..రాయ‌ల‌సీమ యాస‌..ప్రేమ‌..రొమాన్సు..చంపుకోవ‌డాలు..క‌త్తులు..క‌టార్లు..తెర తీస్తే ఇదీ తెలుగు సినిమా. దేశ‌మంత‌టా సామాజిక స‌మ‌స్య‌ల‌ను ఇతివృత్తంగా ఎంచుకుని సినిమాలు తీస్తే మనం మాత్రం ఫ‌క్తు మాస్ మ‌సాలాల‌ను జోడించి ద‌ట్టించి వ‌దిలేస్తున్నారు. భారీ బ‌డ్జెట్లు, ఊహించని రికార్డులు..వీటికి భిన్నంగా కొన్ని సినిమాలు రికార్డులు తిర‌గ రాశాయి. తెలుగు వాడి..వేడిని హాలీవుడ్ స్థాయి రేంజ్‌లో దుమ్ము రేపాయి. రాజ‌మౌళి బాహుబ‌లి. మ‌న సినిమాల‌కు ఓవ‌ర్ సీస్‌లో మాంచి డిమాండ్‌. ఇన్ని క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డాలంటే ఎంత ద‌మ్ముండాలి. క‌దూ..
ఇవేవీ అక్క‌ర్లేకుండానే ..ఎవ‌రి సిఫార‌సు లేకుండానే ఓ యువ కెర‌టం తెలుగు తెర‌ను మెల్ల‌గా క‌దిలించింది. అది ఉప్పెన‌లా ఎగ‌సి ప‌డ్డ‌ది. అత‌డే విజ‌య దేవ‌ర‌కొండ సాయి. ఇపుడత‌డు అంద‌రికి కావాల్సిన హీరో. మోస్ట్ టాలెంటెడ్ ప‌ర్స‌నాలిటీగా చిరంజీవి, మ‌హేష్ బాబు, అల్లు అర‌వింద్‌, దిల్ రాజులు పేర్కొన్నారు. కాల్ షీట్ల కోసం డైరెక్ట‌ర్లు, నిర్మాత‌లు క్యూ క‌ట్టారు. త‌క్కువ టైంలో ఎలా అత‌డు నిల‌దొక్కుకున్నాడు. ఆయ‌న వెనుకున్న శ‌క్తి ఎవ‌రు. ఒక్క సినిమా వంద కోట్ల క్ల‌బ్‌కు ఎలా చేరుకుంది. ఇదంతే త‌ను క్రియేట్ చేసుకున్న‌దే. అచ్చ‌మైన తెలంగాణ యాస‌..భాష‌. ఇక్క‌డి జ‌నం వెంట‌నే క‌నెక్ట్ అయ్యారు.
1989 మే 9న జ‌న్మించిన విజ‌య్ త‌ల్లిదండ్రులు గోవ‌ర్ద‌న్ రావు, మాధ‌వి. మొద‌ట్లో నాట‌కాలంటే పిచ్చి మ‌నోడికి. బాగా రాణించాడు. నువ్విలా సినిమాతో తెరంగ్రేటం చేశాడు. 2012లో వ‌చ్చిన శేఖ‌ర్ క‌మ్ముల తీసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న పాత్ర పోషించాడు. 2015లో ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం సినిమాలో రిషి పాత్ర‌తో అల‌రించాడు. 2016లో త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పెళ్లి చూపులో చేసిన హీరో పాత్ర పాపుల‌ర్ అయ్యింది. విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌ద‌ర్శించిన న‌ట‌న‌కు ప్ర‌క్షేకులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఈ మూవీ త‌న కెరీర్‌ను మ‌లుపు తిప్పింది. ఆయ‌న జీవితంలోనే అతి పెద్ద హిట్‌గా నిలిచింది. 2017లో ద్వారక అనే సినిమాలో న‌టించాడు. పెద్ద‌గా ఆడ‌లేదు. అదే ఏడాదిలో వ‌చ్చిన అర్జున్ రెడ్డి సినిమా బిగ్గెస్ట్ ..బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా..ఆల్ టైం రికార్డులు బ‌ద్ద‌లు కొట్టింది. విజ‌య్ న‌ట‌న‌లో విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించాడు. ఒక్క‌సారిగా ఇండ‌స్ట్రీలో స్టార్‌గా మారిపోయాడు.
2018లో ఏ మంత్రం వేశావో సినిమా ఆశించినంత‌గా ఆడ‌లేదు. ఆ త‌ర్వాత ర‌శ్మీ మందాన న‌టిగా క‌లిసి న‌టించిన గీత గోవిందం సినిమా అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ కోట్లు కొల్ల‌గొట్టింది. బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఓవ‌ర్సీస్‌లో డాల‌ర్లు కుమ్మ‌రించింది. నోటాతో నిరాశ ప‌రిచినా..టాక్సీవాలాతో స‌క్సెస్ అందుకున్నాడు. రెండు రాష్ట్రాల్లో ఇపుడు విజ‌య దేవ‌ర‌కొండ సెన్సేష‌న‌ల్ హీరో. అత‌ను ఎక్క‌డికి వెళ్లినా ఓ వార్తే.. అంత‌గా పాపుల‌ర్ అయ్యాడు. కంపెనీలకు ప్ర‌చారం చేస్తున్నాడు. యాడ్స్‌లో న‌టిస్తున్నాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ యూత్ ఐకాన్‌. తెలుగు సినిమాకు ఇపుడ‌త‌డు బంగారుకొండ‌. త‌న‌కంటూ ఓ బ్రాండ్ ను ఏర్పాటు చేసుకున్న ఈ యువ హీరో తెలంగాణ‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌. కాద‌న‌గ‌లేం ..!

కామెంట్‌లు