తీరని కష్టాలు..తప్పని తిప్పలు
కేంద్రంలో కొలువు తీరిన కమలనాథుల ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ప్రజల పాలిట శాపంగా మారింది. రెండున్నర ఏళ్లు కావస్తున్నా నేటికీ కంటి మీద కునుకే లేకుండా పోయింది. మోడీ అత్యంత సాహసోపేతమైన నిర్ణయమని ప్రకటించినా జనం నమ్మే స్థితిలో లేరు. ఇప్పటికీ ప్రభుత్వ రంగ ఆధీనంలోని బ్యాంకులన్నీ నీరు గారి పోయాయి. రోజంతా కష్టపడి ..చెమట చుక్కలు చిందించి బతుకేందుకు కాసింత భద్రత ఉంటుందనే చిన్న ఆశతో దాచుకున్న డబ్బులు అవసరానికి ఉపయోగపడ కుండా పోతున్నాయి.
సర్వీసు ఛార్జీల పేరుతో , డబ్బులను డ్రా చేసుకునే విషయంలో లెక్కలేనన్ని నియమ నిబంధనలు బ్యాంకులు విధిస్తూ వస్తున్నాయి. దీంతో అసలు ఈ బ్యాంకులు ఎందుకు ఉన్నాయో అర్థం కావడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. నోట్ల రద్దుతో చిన్న, మధ్యతరగతి కుటుంబాలు వీధిన పడ్డాయి. కుల వృత్తులు కునారిల్లి పోయాయి. ఉపాధి లేక జనం అల్లాడుతున్నారు. నిరుద్యోగం, ఉపాధి ఎండమావిగా తయారైంది. అయినా కేంద్రం మాత్రం గత పాలకులపై నెట్టి వేసే ప్రయత్నం చేస్తోంది.
భారత ఆర్థిక రంగానికి ఆయువు పట్టుగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియని పరిస్థితి దాపురించింది. నైపుణ్యాభివృద్ధి పేరుతో నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పేరుతో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తామని చేసిన ప్రకటన నీరు గారి పోయింది. కాషాయధారులకు ఎన్ ఎస్ డీసీ కల్పతరువుగా మారింది. రాత్రికి రాత్రే 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించి పేదలను కోలుకోలేకుండా చేసిన ఘనత మన మోడీదే. దేశమంతటా ఒకే పన్నుల విధానం జీఎస్‌టీ పేరుతో నానా హడావుడి చేసిన సర్కార్ అన్నింటిని ..అందరిని కంట్రోల్ చేయలేక చతికిలపడింది.
ఇన్ని రోజులు గడిచినా ఇంకా డిమానిటరైజేషన్ విషయంలో ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నది. ఏటీఎంలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంకులు రోజు రోజుకు బలోపేతం అవుతుంటే..లెక్కలేనన్ని పథకాలతో వినియోగదారులను, ఖాతాదారులను ఆకర్షిస్తుంటే..ఎఫ్‌డిలు, ఆర్‌డిలతో డబ్బులను జమ చేసుకుంటూ పోతుంటే సర్కార్ బ్యాంకులు కస్టమర్లు లేక బోసిపోతున్నాయి.
యుద్ధప్రాతిపదికన తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అవినీతి సొమ్మ బయటకు వస్తుందని, నల్లధనం సమస్యకు పరిష్కారం లభిస్తుందని అనుకున్న మోడీ సర్కార్‌కు అక్రమార్కులు, అవినీతిపరులు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఎంతో మంది ఆర్థిక నిపుణులు, ఆఖరుకు ఆర్బీఐ గవర్నర్ కు తెలియకుండా నిర్ణయం ప్రకటించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విపక్షాలు ముప్పేట దాడికి దిగాయి. ఎన్నడూ లేనంతగా ప్రజా ధనానికి జవాబుదారీగా ఉంటూ..రక్షణాత్మకంగా వ్యవహరిస్తున్న ఈ అత్యున్నత ఆర్థిక సంస్థ పవర్స్ లేక సతమతమవుతోంది.
నవంబర్ 8న అర్దరాత్రి ఈ నోట్లు చెల్లవంటూ ప్రకటించారు. కొత్తగా 500 , 2000 నోట్లు తీసుకు వస్తున్నట్లు తెలిపారు. పాత నోట్ల కంటే కొత్త నోట్లు మరింత పలుచనగా ఉండడంతో జనం చూసి నవ్వుకున్నారు. ఉగ్రవాదులకు ఆర్థిక వనరుగా మారిన దొంగనోట్ల మాఫియాను దేశంలోని నల్లధనాన్ని దెబ్బ తీసేందుకు ఈ చర్య చేపట్టామని ప్రధాన మంత్రి చెప్పారు.
ఉన్న నోట్లు రద్దయి పోతాయన్న నెపంతో కుప్పల కొద్ది కుబేరులు రియల్ ఎస్టేట్, బంగారం, వెండి, డైమండ్స్, ప్లాట్లు, ఫ్లాట్స్, పొలాల మీద పెట్టుబడి పెట్టారు. అక్రమంగా సంపాదించినదంతా బయటకు వస్తుందని, ఆ డబ్బులు ప్రభుత్వ ఖజానాకు జమ అవుతాయని భావించిన మోడీకి అక్రమార్కులు చుక్కలు చూపించారు. దాచుకున్న డబ్బులు , సొమ్ము రాక పోగా ప్రజలు భద్రంగా దాచుకున్న కోట్లాది రూపాయలు ఆర్థిక నేరగాళ్ల పాలయ్యాయి.
విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, లాంటి నేర చరిత్ర కలిగిన వారు ఎంచక్కా దేశం విడిచి ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మాత్రం సామాన్యులు, పేదలు, మధ్య తరగతి ప్రజలు మాత్రం నోట్లు అందక లబోదిబోమంటున్నారు. ప్రతి దానికి డిజిటల్ మంత్రం జపిస్తున్న మోడీ ..జనానికి భరోసా కల్పించి..ఉపాధినిచ్చి..కడుపు నింపే కార్యక్రమాలేవీ చేపటలేక పోయారు.
చాయ్ పే చర్చా పేరుతో ..సోషల్ మీడియాలో విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తూ తనకు తాను ఓ బ్రాండ్‌గా మారిన మోడీ..తిరిగి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో యుద్ధానికి సిద్ధ పడటం, ఇతర దేశాల్లో పర్యటించడం చేస్తూ వస్తున్నారే తప్పా..ప్రజలు ఎదుర్కొంటున్న నోట్ల రద్దు విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నది ప్రతి భారతీయుడు ప్రశ్నిస్తున్నాడు. ప్రధాన రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కుచ్చు టోపీలు పెట్టిన వారి నుంచి డబ్బులు వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహించింది.
అంతేకాకుండా ప్రభుత్వ బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టిన వారు లక్షల్లో ఉన్నారు. వీరిందరి వివరాలు తెలియకుండా బ్యాంకులు దోబూచులాడుతున్నాయి. అన్నం పెట్టే రైతులకు రుణాలు ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెట్టే ఈ బ్యాంకులు కోట్లాది రూపాయలు ఎగ్గొట్టే వారికి ఎలా మంజూరు చేస్తున్నాయనేది మిలియన్ డాలర్ ప్రశ్న.
మోడీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా విపక్షాలు భారీ ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టాయి . అయినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా కేంద్ర సర్కార్ విపక్షాలను టార్గెట్ చేయడం మాని..ఈ దేశ పేదలు ఏం కోరుకుంటున్నారో వినాలి. అక్రమార్కుల నుండి తరలి వెళ్లిన సంపదను తీసుకు వచ్చేలా చర్యలు చేపట్టాలి. లేకపోతే రాబోయే ఎన్నికల్లో ఘోరమైన ఫలితాన్ని చవి చూసే ప్రమాదం పొంచి వున్నదనేది గ్రహించాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి