రుణం కాకూడదు భారం
అప్పు ఆనందంతో ప్రారంభమై దుఖఃంతో అంతమవుతుందన్న ఓ ఆర్థికవేత్త మాటలు అక్షరాల వాస్తవాన్ని తలపింప చేస్తున్నాయి. ప్రపంచీకరణ పుణ్యమా అంటూ లెక్కలేనన్ని అవకాశాలు తలుపు తట్టాయి. దీంతో దేశాల మధ్యన అంతరాలు తొలగి పోయాయి. వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోంది. మార్కెట్ రంగం కళకళ లాడుతోంది. రియల్ ఎస్టేట్ రంగం ఇపుడిపుడే కుదురుకునే ప్రయత్నం చేస్తోంది. సరళీకృత ఆర్థిక విధానాల కారణంగా కొత్త బ్యాంకులు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు ధీటుగా ప్రైవేట్ బ్యాంకులు వినియోగదారులకు సేవలందిస్తున్నాయి. ఆకర్షణీయమైన పథకాలతో ఆకట్టుకుంటున్నాయి. తక్కువ వడ్డీ అంటూ జనాన్ని బురిడీ కొట్టిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకుల్లో ఉన్న కొంత వెసలుబాటును ఆసరాగా చేసుకున్న కొందరు బడా బాబులు మనీ ల్యాండరింగ్‌కు పాల్పడుతున్నారు. గత కొన్నేళ్లుగా వేలాది మంది ఆర్థిక నేరగాళ్లు బ్యాంకులను లూటీ చేశారు. జనం సొమ్మును అప్పనంగా మింగేశారు. ఇదంతా ఓ ఎత్తయితే పాలకులు తమ పవర్‌ను అడ్డం పెట్టుకుని బ్యాంకులను టార్గెట్ చేశారు. దొంగ పత్రాలు సృష్టించి లెక్కలేనన్ని రుణాలు పొందారు. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు సంబంధించి నిబంధనలను మరింత కఠినతరం చేసింది.
అయినా ఈ దేశంలో మార్పు రాలేదు. డీమానిటరైజేషన్ పుణ్యమా అంటూ బ్యాంకింగ్ వ్యవస్థ కునారిల్లి పోయింది. తాము కష్టపడి దాచుకున్న డబ్బుల కోసం ప్రజలు రోడ్లపైకి వచ్చిన సందర్భాలు మోడీ సర్కార్‌లో చోటు చేసుకుంది. నోట్ల కోసం పడిగాపులు పడ్డారు. వారిపై పోలీసులు తమ ప్రతాపం చూపారు. డిజిటలైజేషన్ దెబ్బకు బ్యాంకింగ్ వ్యవస్థ వినియోగదారుల నమ్మకాన్ని వమ్ము చేసింది. దీంతో తమ డబ్బులకు భద్రత ఉండదంటూ సామాన్య జనం ఒక్కసారిగా తమ డబ్బులు తమకు కావాలంటూ బ్యాంకుల మీద ఒత్తిడి పెంచారు. దీంతో బ్యాంకులను నియంత్రించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని వెసలుబాట్లు ఇచ్చింది. ఏటీఎంల ద్వారా మనీని తీసుకునే వాటిపై కూడా రూల్స్ విధించింది. కేవలం నాలుగు సార్లు, 20 వేల రూపాయల కంటే ఎక్కువ తీసుకోకూడదంటూ నిబంధన పెట్టింది.
ఎన్ని కఠినతరమైన నియమ నిబంధనలు విధించినా మోసగాళ్లు ..వెసలుబాటును ఆసరాగా చేసుకుని కోట్లు నొక్కేస్తున్నారు. వీరికి బ్యాంకుల్లో కొంత మంది లాలూచీగాళ్లు వీరికి సహకరిస్తుండడంతో అప్పులు ఈజీగా దొరుకుతున్నాయి. స్థలాలను తక్కువ ధరకు కొనుగోలు చేయడం. వాటికి మార్కెట్ విలువను అధికంగా జోడించడం.. ఆదాయ పన్నును ఎక్కువగా చూపించడం, ఐటీ పత్రాలను సమర్పించడంతో రుణాలు ఈజీగా దొరుకుతున్నాయి. వాటిని తీర్చకుండా ఐపీ పెట్టడం, నికర ఆస్తులను తాకట్టు పెట్టేలా ప్రోత్సహించడం..లోపాయికారీగా బ్యాంకర్లు, బడా బాబులు కలిసి ప్రజల సొమ్ముకు కన్నం వేస్తున్నారు. సాఫీగా దోచేస్తున్నారు. అత్యవసరమై డబ్బుల కోసం ఏటీఎంలకు వెళితే నో స్టాక్ అన్న బోర్డులు కనిపిస్తున్నాయి. కష్టపడి దాచుకున్న సొమ్ముకు భద్రత లేకుండా పోవడంతో బ్యాంకులు లూటీకి గురవుతున్నాయి. రాను రాను వాటిని కూడా మూసి వేస్తారన్న ఆందోళన వ్యక్తమవుతోంది అంతటా.
ఓ వైపు బ్యాంకింగ్ రంగం నిస్తేజంలో ఉంటే..ప్రభుత్వ రంగ సంస్థగా విశిష్ట సేవలందిస్తున్న పోస్టాఫీసులు మాత్రం పద్ధతి ప్రకారం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. పీఎఫ్, ఈపీఎఫ్, సంక్షేమ పథకాలు, డిపాజిట్ చేసిన డబ్బులకు పూర్తి భద్రత కల్పించడం, సేవింగ్స్ అకౌంట్స్‌కు మెరుగైన వడ్డీ ఇవ్వడంతో జనం దీనిపైనే ఆధారపడుతున్నారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఆర్డీలకు ఎక్కువ డిమాండ్ ఉంటోంది. ఇక స్టాక్ మార్కెట్‌లో రోజూ వారీగా ఒడిదుడుకులు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. ఐటీ, ఐరన్, స్టీల్, గోల్డ్, ఆయిల్, డైమండ్స్ , లాజిస్టిక్స్, ఆన్‌లైన్ ..డిజిటల్ వాటికి అధిక డిమాండ్ ఉంటోంది.
ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి రుణాల కోసం వెళ్లే సామాన్యులకు బ్యాంకర్లు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. సవాలక్ష నిబంధనలతో బెంబెలెత్తిస్తున్నారు. కానీ డబ్బున్న వాళ్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. తీసుకున్న రుణాలకు వడ్డీలు, చక్రవడ్డీలు కలుపుకుని తడిసి మోపెడవుతుంది. ఒక్క కంతు కట్టక పోతే ఇక డబుల్ వడ్డీ వడ్డిస్తూ నడ్డి విడుస్తున్నారు. ఏదైనా రుణం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. తీసుకున్నప్పుడు తేలికే అనిపిస్తుంది..కట్టేటప్పుడు తెలుస్తుంది అసలు కథ. సాధ్యమైనంత వరకు క్రమానుగత పద్ధతిలో పొదుపు చేసుకుంటూ వెళ్లాలి. వీలైనంత మేరకు ఖర్చులు తగ్గించు కోవాలి. రోజుకు కనీసం 10 రూపాయల నుండి వంద రూపాయల వరకైనా పొదుపు చేయాలి. అపుడు తీసుకున్న రుణం భారం కాదు..ఎంత శ్రమకోర్చి కట్టుకున్న ఇల్లయినా..లేక వ్యాపారమైనా ఇబ్బందిగా మారదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి