తెలుగుదేశంకు రాం రాం..కమలం ఆహ్వానం


సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని షాక్ తగులుతోంది. ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో కోలుకోలేని రీతిలో జనం తీర్పు ఇచ్చారు. ఇదే సమయంలో పార్టీకి వెన్ను దన్నుగా ఉన్న, పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఒక్కరొక్కరుగా వీడుతున్నారు. వీరి బాటలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ, తన లేఖను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపారు. వంశీ రాజీనామాతో గన్నవరం నియోజకవర్గంలో టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లేనని భావించవచ్చు.

టీడీపీ కేవలం 23 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వంశీ టీడీపీకి రిజైన్‌ చేయడంతో ఆ సంఖ్య కాస్త 22కి పడిపోయింది. కాగా ఇప్పటికే ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరి, టీడీపీ పార్లమెంటరీ పక్షాన్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేశారు. గత కొంత కాలం నుండి వల్లభనేని వంశీ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయనను అధికార పార్టీకి చెందిన వైసీపీ నేతలు టార్గెట్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ హవాను తట్టుకుని నిలబడ్డారు వంశీ. ఏకంగా ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా చాటారు. తాజాగా వంశీ సీఎం ను మంత్రులు పేర్ని నాని,  నానితో కలిసి భేటీ అయ్యారు. వీరిలో  కొడాలి నానితో వంశీకి మంచి రిలేషన్ షిప్ ఉంది. దీంతో ఎప్పటి నుంచో వంశీ పార్టీ వీడుతారన్న పుకార్లు షికార్లు చేశాయి.

ఇదే సమయంలో వంశీ జగన్ ను కలిసిన వెంటనే ఇది నిజమని తేలిపోయింది. అయితే దీనిని కొట్టి పారేశారు. జగన్ రెడ్డిని కలిసే కంటే ముందే వంశీ బీజేపీలో ఇటీవలే చేరిన ఎంపీ సుజనా చౌదరిని కలిశారు. కొద్దీ సేపటికే జగన్ తో మీట్ అయ్యారు. తాను నియోజకవర్గం అభివృద్ధి కోసమే కలిశానని చెప్పారు. ఇంతలోనే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు బుజ్జగించినా ఫలితం లేక పోయింది. దీంతో వంశీ రిజైన్ చేయడంతో ఆయన ఏ పార్టీలోకి వెళతారన్న చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా బీజేపీలోకి రావాలని ఆ పార్టీకి చెందిన ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి కోరారు. ప్రజా క్షేత్రంలో బలం ఉన్న నాయకులు సగానికి సగం మంది బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!