శివ సేన ఎంపీ హాట్ కామెంట్స్
మహారాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కిస్తున్నాయి. బీజేపీ, శివ సేన పార్టీల మధ్య ఇంకా చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో సీఎం కుర్చీపై పీటముడి వీడలేదు. ఇదే సమయంలో శివ సేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సంచలన కామెంట్స్ చేశారు. ఇవి ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇది మహారాష్ట్ర. ఎవరి తండ్రి అయితే జైలులో ఉన్నారో అటువంటి దుష్యంత్ ఎవరూ ఇక్కడ లేరు అంటూ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన బీజేపీ, శివసేన అత్యధిక సీట్లు దక్కించుకున్న విషయం తెలిసిందే. బీజేపీ 105 సీట్లు గెలుచుకోగా..శివసేన 56 సీట్లలో జయ కేతనం ఎగుర వేసింది.
మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, ఎన్సీపీ కూడా చెప్పుకో దగ్గ స్థాయి లోనే శాసన సభ స్థానాలు కైవసం చేసుకున్నాయి. కాగా బీజేపీతో పొత్తు ఖరారైన నాటి నుంచి రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవి తమకు కేటాయించడంతో పాటుగా కేబినెట్‌లో కూడా సముచిత స్థానం కల్పించాలని శివసేన డిమాండ్ చేస్తోంది. తొలిసారిగా ఠాక్రే కుటుంబం నుంచి వర్లీ అసెంబ్లీ బరిలో దిగిన శివసేన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ఘన విజయం సాధించారు. ముఖ్యమంత్రి పదవి కోసం మరాఠా పార్టీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది.
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో బీజేపీ మాత్రం సీఎం పదవి పంచుకునేందుకు సుముఖంగా లేనట్లుగానే కనిపిస్తోంది. దీంతో శివసేన కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయంటూ సంకేతాలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ, శివసేన పార్టీలు విడి విడి గానే గవర్నర్‌తో భేటీ అయ్యాయి. దీంతో మహారాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మరాఠా పీఠంపై ఎవరు కోలుతీరుతారో తెలియని ఉత్కంఠ నెలకొంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి