సోగకళ్ల సుందరికి ఈడీ షాక్


ఇండియాలో ఈడీ జనానికి చుక్కలు చూపిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ వాలి పోతోంది. ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టోరేట్ తో పాటు ఆదాయ పన్ను శాఖా అధికారులు కూడా వాలి పోతున్నారు. ఇదే సమయంలో పొలిటికల్ లీడర్స్ తో పాటు అన్ని వ్యాపార, వాణిజ్య రంగాలకు సంబంధించిన వారిని వదిలి పెట్టడం లేదు. ఐటీ, క్రీడా, తదితర శాఖలకు చెందిన వారిని టార్గెట్ చేస్తోంది ఈడీ. ఇదే సమయంలో ఇటీవల మాజీ హోమ్ శాఖా మంత్రి చిదంబరం తో పాటు కన్నడ రాజకీయాలను శాసిస్తున్న డీకే శివకుమార్ ను సైతం ఈడీ చుక్కలు చూపించింది. చిదంబరం తీహార్ జైలులో చిప్ప కూడు తింటుండగా, శివకుమార్ మాత్రం జైలు నుంచి విడుదలయ్యారు. తాజాగా బాలీవుడ్ లో నటిగా పేరున్న శిల్పా శెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రా కు మనీ లాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేశారు.

మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. 2013లో చనిపోయిన గ్యాంగ్‌స్టర్ ఇక్బాల్‌కు మిర్చికి సంబంథించిన కేసులో రాజ్ కుంద్రాపై ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో రాజ్ కుంద్రాను విచారించేందుకు ఈడీ రంగం సిద్ధం చేసింది. కేసుకు సంబంధించి రంజీత్ బింద్రా , బాస్టియన్ హాస్పిటాలిటీ అనే సంస్థతో కుంద్రా కున్న లావాదేవీలను పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో రాజ్ కుంద్రా స్టేట్ మెంట్ ను రికార్డు చేయాల్సి వున్నందున అధికారుల ముందు హాజరు కావాలని నోటిసులిచ్చినట్టు  తెలిపారు.

ముంబైలో విలువైన ఆస్తుల అమ్మకాలు, కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగినట్టు ఈడీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో మిర్చిపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత 2013లో గుండె పోటుతో మిర్చి మరణించాడు. పలు ఆర్థిక అవకతవకల నేపథ్యంలో రంజిత్ బింద్రాను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలను రాజ్ కుంద్రా ఖండించారు. కాగా ఇటీవల 44 ఏళ్ళు నిండిన భర్త రాజ్ కుంద్రా పుట్టిన రోజు వేడుకలను శిల్పా శెట్టిఘనంగా నిర్వహించారు. మొత్తం మీద శిల్ప శెట్టి, రాజ్ కుంద్రాకు ఈడీ వ్యవహారం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 

కామెంట్‌లు