సుప్రీం ఝలక్..టెలికాం కు షాక్..జాబ్స్ కు బ్రేక్
టెలికాం కంపెనీలు జనాన్ని కోలుకోలేని షాక్ కు గురి చేస్తున్నాయి. ఎడాపెడా నిర్ణయాలతో ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీంతో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాయి. ఇదే క్రమంలో తాజాగా సుప్రీం కోర్టు నికర ఆదాయంపై కీలక తీర్పు చెప్పింది. తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్న టెలికాం కంపెనీలకు ఝలక్ ఇచ్చింది. టెలికం సెక్టార్‌లోకి రిలయన్స్ జియో రాకతో కుదేలైన ఈ రంగానికి ఏజీఆర్‌పై ప్రభుత్వం ఇచ్చిన వివరణతో ఏకీభవించిన సుప్రీం కోర్టు తీర్పు అశ నిపాతంలా తగిలింది. టెలికాం విభాగానికి టెల్కోస్ 92,641 కోట్లను వడ్డీతో సహా చెల్లించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.
భారీ నష్టాల్లో ఉన్న టెల్కోల లాభ దాయకతను ఇది తీవ్రంగా ప్రభావితం చేయనుంది. దీంతో టెలికాం కంపెనీలు తమ శ్రామిక శక్తిని 20 శాతం తగ్గించాల్సి ఉంటుంది. తీర్పు నేపథ్యంలో దీనిని అడ్డం పెట్టుకుని రానున్న కాలంలో ఉద్యోగులను తీసి వేసేందుకు కంపెనీలు రెడీ అవుతున్నాయి. టెలికం రంగం మొత్తం సుమారు 1.3 లక్షల కోట్లు మూడు నెలల్లో ప్రభుత్వానికి చెల్లించాలని సుప్రీం ఆదేశించింది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కే వరకు తాజా నియామకాలు చేపట్టరాదనే నిర్ణయంతో పాటు, ఉన్న ఉద్యోగాల్లో కూడా కోత పెట్టేందుకు మొగ్గు చూపుతున్నాయి. రాబోయే ఆరు నెలల్లో భారత టెలికాం రంగంలో సుమారు 40 వేల ఉద్యోగాల కోతకు దారి తీయనుంది.
అంతే కాదు ఆపరేటర్లలో ఎవరైనా దివాలా కోసం దాఖలు చేస్తే మరింత పెరగవచ్చు అని సీఐఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ సిఇఓ ఆదిత్య నారాయణ మిశ్రా చెప్పారు. టెల్కోస్, టవర్స్ కంపెనీలు ,ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ లను కలిగి ఉన్న ఈ రంగంలో సుమారు 2 లక్షల మంది ఉద్యోగులున్నారని తెలిపారు. కొన్ని కంపెనీలు దివాలా తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత మూడేళ్ళలో, నియామకం గణనీయంగా తగ్గింది. సీనియర్ స్థాయిలో పదవులు భర్తీ చేయ లేదు. భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా లాంటి సంస్థల ఆర్థిక పరిస్థితి అతలాకుతలం కానుంది. మొత్తంగా చూస్తే సుప్రీం తీర్పు గొడ్డలి పెట్టు లాంటిదేనని చెప్పక తప్పదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి