ఏమివ్వగలం వీళ్లకు..కాసింత కృతజ్ఞత తప్ప..!
మానవ జాతి మనుగడలో ముఖ్య భూమికను పోషించే మహిళలు అనాది నుండి నేటి ఆధునిక ప్రపంచం దాకా అన్నీ అవస్థలే.ఎదుర్కొంటున్నారు. .అడుగడుగునా అడ్డంకులే. పుట్టినప్పటి నుంచి పెరిగి ..పెళ్లయి ..అత్తారింటికి వెళ్లే దాకా..అక్కడి నుంచి కాటికి ప్రయాణం చేసే వరకు అంతులేని కష్టాలు..అంతు చిక్కని ఇబ్బందులు. పురుషులకున్నంత వెసలుబాటు వీరికి లేకుండా పోయింది. ఎక్కడో ఒక చోట వివక్షకు లోనవుతున్నారు. చిరునామా లేని చావులకు గురవుతున్నారు.
హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు, ఈవ్ టీజింగ్‌లు..ఇలా ప్రతి చోట కొనసాగుతున్నవి. ఎన్ని చట్టాలు చేసినా..ఇంకెంతగా ఐ వాచ్ చేసినా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని నియంత్రించడంలో పాలకులు , ఉన్నతాధికారులు తీవ్ర వైఫల్యం చెందుతున్నారు. మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆనందించే రోజులు పోయాయి. ఆధునిక ప్రపంచపులో మార్కెట్ మనుషుల్ని పీల్చి పిప్పి చేస్తోంది. వస్తువుల కంటే హీనంగా మార్చేస్తోంది. తరాల నుంచి ఎంతో కష్టంతో కాపాడుకుంటూ వస్తున్న సంస్కృతి, సాంప్రదాయాలు మంటగలిసి పోతున్నాయి. మనిషిని మనిషి గౌరవించే పరిస్థితులు ఏనాడో పోయాయి.
ఉన్నదంతా మనీ సంబంధాలే. వంటిళ్లు నెట్టిళ్లు అయిపోయాక ఇంక బంధాలు ఎలా పటిష్టంగా ఉంటాయి. ఉషోదయం నుంచి రాత్రి అంతమయ్యే దాకా నిరంతరం వెట్టిచాకిరి చేసే మహిళలు, బాలికలు, యువతుల పట్ల ప్రతి చోటా తెలియని హింసోన్మాదానికి గురవుతున్నారు. చెప్పుకోలేని స్థితికి నెట్టివేయబడుతున్నారు. ఇదంతా కుటుంబ వ్యవస్థ బలహీనం కావడం. ఆర్థికపరమైన వ్యత్యాసాలు, బతికేందుకు కావాల్సినంత భరోసా దక్కక పోవడం, ఉపాధి లేక పోవడం, చదువుకున్నా చేసేందుకు కొలువులు రాక పోవడం, ఉన్న కొద్ది మంది బతికేందుకు ఇతర దేశాలను ఆశ్రయించడంతో వ్యవస్థ అవస్థను ఎదుర్కొంటోంది.
ఇక మహిళలు మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒడిదుడులకు లోనవుతున్నారు. కుటుంబ పరంగా వారికి తగినంత ప్రాధాన్యత అందక పోవడం, వారిని మనుషులుగా గుర్తించక పోవడం వల్ల మరింత వెనుకబడి పోతున్నారు. జాతి పునరుత్పత్తిలో కీలక భూమిక పోషించేది మహిళలే. అలాంటి వారు నేటి ఆధునిక యుగంలో ..అభివృద్ధి సమాజంలో తమకు 33 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించండంటూ చట్ట సభల్లో గొంతెత్తి నిలదీస్తున్నారు. అయినా స్పందన లేదు. ధర్నాలు, రాస్తారోకోలు, సమ్మెలు, ఆందోళనలు..ఇలా ప్రతి సందర్భంలోను తమ వాయిస్‌ను వినిపిస్తున్నా న్యాయం ఎండమావిగానే మిగిలింది.
ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ప్రాణం పోసే తల్లులకు సరైన వైద్యం అందడం లేదు. అన్నిటికంటే ప్రమాదకరమైన అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు. కోట్లాది మహిళలు ఆర్థికపరమైన ఇబ్బందులు, కొనేస్థోమత లేక పోవడం వల్ల ప్రతి నెలా ఉపయోగించే న్యాపికిన్ల బదులు ఇంట్లో వాడని చింపిరి దుస్తులను ఉపయోగించడం వల్ల చెప్పుకోలేని రోగాలకు గురవుతున్నారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు హెచ్చరించాయి. కార్పొరేట్ కంపెనీలకు మేలు చేకూర్చే ప్రభుత్వాలు, పాలకులు తమకు ప్రాణంపోసే మహిళలు ప్రతి నెలా వాడే లో దుస్తుల విషయంలో జీస్టీని మొన్నటి దాకా విధించింది.
దీంతో నారీమణులు తమకు న్యాయం జరగాలని కోరుతూ పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా ఉద్యమం లేవదీశారు. చోటు చేసుకున్న ఆధునికమైన మార్పుల వల్ల నేటి యువత తమకు ఏం కావాలో నిర్భయంగా కోరుకొంటోంది. గతంలో న్యాపికిన్స్‌ను వాడే వాళ్లను దూరంగా ఉంచడం, వాళ్ల పట్ల చులకనగా చూడడం, సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టడం, అందరి ముందు వ్యంగ్యంగా మాట్లాడం చేస్తూ వచ్చారు. సంప్రదాయ ఇళ్లలో ప్రతి నెలా వచ్చే మెన్సస్ విషయంలో మహిళలు కొంత ధైర్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. మహిళలు చాలా చోట్ల బయటి ప్రదేశాలకు వెళ్లలేని పరిస్థితుల్లో చెప్పలేని రోగాలకు గురవుతున్నారని ఇటీవల వైద్యులు నిర్ధారించడం పాలకుల వివక్షకు అద్దం పడుతోంది.
తమపై ఆధారపడే వాళ్లకు, తాము వంట చేసి, కుటుంబాలను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించే తాము వాడే న్యాపికిన్లపై జీస్టీ విధించడం అన్యాయమని దీనిని తక్షణమే ఎత్తి వేయాలని దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేశారు. యువత కూడా చురుకుగా పాల్గొన్నారు. ఈ విషయంపై ఛేంజ్ అనే సంస్థ ఏకంగా ఓటింగ్ నిర్వహించింది. మహిళలే కాకుండా పురుషులు కూడా వీరి న్యాయమైన డిమాండ్‌కు మద్ధతు తెలిపారు. అది కోట్లకు చేరుకుంది. అసోంకు చెందిన కాంగ్రెస్ ఎంపీ సుష్మితా దేవ్ ఒక్కరే పార్లమెంట్ సాక్షిగా నిలదీసింది..బీజేపీ సర్కార్‌ను కడిగి పారేసింది. కార్పొరేట్ కంపెనీల వస్తువులకు జీస్టీ తగ్గించే సర్కార్ తాము వాడే న్యాపికిన్లపై ఎందుకు జీఎస్‌టీ చెల్లించాలంటూ జూలై 2017లో ఢిల్లీ హైకోర్టులో యుపీకి చెందిన జర్మీనా ఇష్రార్ ఖాన్ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కింద పిటిషన్ దాఖలు చేసింది. దీంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆమె తెగువకు, ధైర్యానికి మహిళలు, యువత, బాలికలు ఫిదా అయ్యారు. ఆమె చేసిన పోరాటానికి లక్షలాదిగా మద్ధతు పలికారు. దీంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఏకంగా ఆర్థిక మంత్రి జైట్లీ జీఎస్టీ ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించారు. ఇదంతా వీరి పోరాట ఫలితమే.
ఇక మహిళలు ప్రతి నెలా ఎదుర్కొనే సమస్యకు పేదవారికి మేలు చేకూర్చేలా తమిళనాడుకు చెందిన మురుగనాదం ఓ కొత్త చరిత్రకు నాంది పలికారు. తన భార్య పడే అవస్థలను చూసి తట్టుకోలేక తానే ఆ ప్యాడ్లను వాడడం మొదలు పెట్టాడు. బడా కంపెనీలకు ధీటుగా చవకగా, నాణ్యవంతంగా ఉండేలా తానే మిషన్లను , న్యాపికిన్లను తయారు చేశాడు. మహిళా లోకం అతడు చేసిన ప్రయత్నానికి సలాం చేసింది. ప్రభుత్వం, దేశం, ప్రపంచం గుర్తించింది. ఒక సామాన్యుడు చేసిన ఈ ప్రయోగం ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. దీనిని గమనించిన బాలీవుడ్ సినీ దిగ్గజం అక్షయ్ కుమార్ ఏకంగా ప్యాడ్ మ్యాన్ సినిమా తీశాడు. ఈ మూవీకి మురగనాదమే ప్రేరణ. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సభ్య సమాజం తల ఎత్తుకునేలా చేసినందుకు ఈ నలుగురికి దేశంలోని మహిళా లోకం సలాం చేస్తోంది. ఏది ఏమైనా మనమూ తోటి మహిళల్ని,బాలికల్ని, యువతను గౌరవిద్దాం..మనుషులుగా బతికేందుకు ప్రయత్నిద్దాం...!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి