వీగిన విశ్వాసం..గెలిచిన ప్రజాస్వామ్యం..!
ఎన్నాళ్లకు ..ఎన్నేళ్లకు ..ఇలాంటి సన్నివేశాల కోసం ఎదురు చూసింది. తన ఇమేజ్ కోసమో లేక దేశ వ్యాప్తంగా ప్రచారం పొందాలనే ఉద్దేశంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పొలిటికల్ మార్క్‌ను మరోసారి చూపించారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం. దానిని పట్టించు కోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రజల సొమ్ముతో పదవులు పొందిన పార్లమెంట్ సభ్యులను పూర్తి స్థాయిలో చూసే అవకాశం లభించింది. ఎప్పుడూ లేనంతగా దేశం మొత్తం బీజేపీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠకు తెర లేపారు.
కొత్తగా ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్లు..అనుభవజ్ఞులు ..అన్ని పార్టీలకు చెందిన వారంతా ఆసీనులవడం ఆనందం అనిపించింది. ఓ వైపు పవన్ కళ్యాణ్ ఇంకో వైపు జగన్ ఎంతగా విమర్శలు, ఆరోపణలు చేసినా బాబు ఓ రకంగా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. టీడీపీకి సంబంధించి కొంత మంది మాత్రమే ఎంపీలున్నప్పటికీ తన ఇమేజ్ డ్యామేజ్ కాకుండా చూసుకోగలిగారు. పరిపాలన రంగంలో అపారమైన అనుభవం వున్న బాబు దేశ వ్యాప్తంగా చర్చ జరిగేలా చూడటంలో సఫలమయ్యారు. దీనిని ఎవరూ కాదనలేం. తీర్మానం వీగిపోతుందని, మోడీ సర్కార్ గెలుస్తుందని తెలుసు.
కానీ ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందనే దానిపై ఆయా పార్టీల బాధ్యులు లెక్కలు..సంఖ్యలతో సహా చెబుతుంటే మోడీ, రాజ్‌నాథ్ సింగ్ బలగం చట్ట సభలో మౌనంగా వింటూ కూర్చున్నారు. ఇక సర్వోన్నతమైన న్యాయస్థానం తన గొంతును సవరించుకుని జనం కోసం ప్రభుత్వమే తప్ప..సర్కార్ కోసం ప్రజలు కాదని స్పష్టం చేయడం శుభపరిణామం. తమకు రాష్ట్ర విభజన సమయంలో అన్యాయం జరిగిందని, ప్రత్యేక హోదా కావాలని గల్లా జయదేవ్ కోరారు. ఆయన తన బావమరిది మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాను కోట్ చేస్తూ మాట్లాడారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో కొందరు ఎంపీలు మాత్రం దేశ ప్రజలను ఆకట్టుకున్నారు. తమ వాగ్ధాటితో ఆశ్చర్య పోయేలా చేశారు.
అందులో నలుగురు మాత్రం తమదైన ముద్రతో ..పక్కా సమాచారం..పకడ్బందీ లెక్కలతో పార్లమెంట్‌ను దద్దరిల్లేలా చేశారు. ఓ వైపు రైతులు చనిపోతున్నారని, వారికి కనీస మద్ధతు ధర ఇవ్వడం లేదని, వ్యవసాయ రంగం సంక్షోభంలోకి కూరుకు పోయిందని, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, నిత్యావసర వస్తువులు దొరకడం లేదని, నీళ్లు, నిధులు, నియామకాల ఊసే లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. జన్ ధన్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తానన్న మోడీ ..బడా బాబులకు వత్తాసు పలుకుతూ దేశాన్ని దాటించడంలో సక్సెస్ అయ్యాడంటూ తీవ్ర స్తాయిలో ఆరోపణలు చేశారు. అయినా ప్రధాని చలించలేదు..స్పందించ లేదు..కానీ తనదైన స్టైల్‌లో నవ్వుతూ వుండి పోయారు.
ఏపీకి కావాల్సిందల్లా చేశామని చెప్పుకొచ్చారు. అవిశ్వాస తీర్మానం సమయంలో ఎక్కువగా ఆకట్టుకున్నది మాత్రం రాహుల్ గాంధీ. మాటల్లో తడబాటు లేకుండా సర్కార్ పనితీరును ఎండగట్టారు. ఏపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు హిందీలో చేసిన ప్రసంగం సభ్యులను..ప్రజలను మెస్మరైజ్ చేసింది. ఇక ఫరూక్ అబ్దుల్లా, అసదుద్దీన్ ఓవైసీ మైనార్టీల విషయంలో తీవ్ర ఆందోళనను వ్యక్త పరిచారు. తాము కూడా ఈ దేశంలో అంతర్భాగమేనంటూ చెప్పుకొచ్చారు.
దుమ్ము రేపిన భగవాన్ మాన్ - ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ భగవాన్ మాన్ పార్లమెంట్‌లో హైలెట్‌గా నిలిచారు. తనదైన హావభావాలతో రియల్ హీరోనని అనిపించుకున్నారు. బీజేపీ ఏ రకంగా ప్రజలను నిట్ట నిలువునా మోసం చేస్తుందో అద్భుతంగా ..మాటల తూటాలను పేల్చారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు సభ్యులంతా ఆశ్చర్యచకితులై ఉండిపోయారు. పంజాబ్ రైతుల పట్ల, వివిధ రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తున్న నరేంద్ర మోడీపై తీవ్ర ఆరోపణలు చేశారు. జనం సొమ్ముతో సోకులు అనుభవిస్తున్న మిగతా ఎంపీల కంటే భగవాన్ నూరు రెట్లు బెటర్.
బాబు ఓడిపోయాడా..లేక గెలిచాడా అంటూ చర్చోపచర్చలు చేస్తున్న వారు అసలైన వాస్తవాన్ని గుర్తించడం లేదు. అంకెల పరంగా టీడీపీ ఓడి పోయి ఉండవచ్చు..కానీ అత్యంత అర్ధ, ఆర్థిక, అధికార , సైనిక బలగం కలిగిన మోడీని ఢీ కొనడం..వ్యతిరేకంగా పార్టీలను, ఎంపీలను కూడగట్టడం సామాన్యమైన విషయం కాదు. అది రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈపాటికి అర్థమై ఉంటుంది. మొత్తం మీద ఈ వ్యవహారంలో నైతికంగా టీడీపీదే పై చేయి సాధించింది..అంతేకాదు కొత్త రాజకీయ సమీకరణాలకు తెర లేపింది. ఈ దేశం ఎటు పోతుందోనని ఆందోళన చెందుతున్న ఈ ఆపత్కాల సమయంలో జాతికి చుక్కానిలా .రాహుల్, రామ్మోహన్, భగవాన్ కనిపించారు. కీప్ ఇట్ అప్..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి