గుండెల్ని చీల్చుతున్న రంగుల పక్షి..!
జీవితాన్ని సుఖవంతం చేసి..గడ్డకట్టుకు పోయిన మనసు ముంగిట్లో సరాగాల ముగ్గుల్ని చల్లే ఆ స్వర విన్యాసం నిన్నటి దాకా ఎక్కడుందో కానీ ఇవ్వాళ ప్రపంచాన్ని తన గాత్ర మాధుర్యంతో తాకుతోంది. గజల్స్, భజన్స్..ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడేలా చేసేస్తోంది గీతాంజలి రాయ్. ప్రపంచ వ్యాప్తంగా తన స్వర విన్యాసంతో ఆకట్టుకుంటోంది. గుండె గుండెలో ప్రేమతనపు జల్లుల్ని చల్లుకుంటూ సేద తీరేలా చేస్తోంది. యూట్యూబ్ పుణ్యమా అని ప్రపంచాన్ని తమదైన ముద్రతో పాటలతో ఉర్రూతలూగిస్తున్న వారంతా అడ్డుగోడలను దాటుకుంటూ సంగీత ప్రేమికులకు దగ్గరవుతున్నారు.
అలాంటి వారిలో ముఖ్యంగా గజల్స్ గాయనీగాయకుల్లో గీతాంజలి తనదైన ఒరవడితో ఒక ట్రెండ్ సృష్టించారు. విభిన్నమైన కళలను పుణికి పుచ్చుకున్న ఆమె స్వస్థలం అమృత్‌సర్ . ముంబైలో స్థిరపడ్డారు. అక్కడే విద్యాభ్యాసం సాగింది. ముంబయి యూనివర్శిటీలో క్లినికల్ సైకాలజీలో పీజీ చేశారు. టీచర్‌గా, గురుణిగా, ఆధ్యాత్మిక సింగర్‌గా, మోటివేషనల్ స్పీకర్‌గా, లైఫ్ కోచ్‌గా పనిచేస్తున్నారు. లక్షలాది మందిని గానామృతాన్ని పంచుతూ భక్తులకు అలౌకికమైన ఆనందాన్ని కలుగ చేస్తున్నారు. ఎస్.ఎన్.డి.టి ఉమెన్స్ యూనివర్శిటీలో సైకాలజీ విభాగం హెడ్‌గా ఉన్నారు. అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో సీనియర్ టీచర్‌గా ఉన్నారు. డైనమిజం ఫర్ సెల్ఫ్ అండ్ నేషన్ పేరుతో అనుభవ పాఠాలు బోధిస్తున్నారు.
టీచర్ నుండి సింగర్ దాకా ఆమె ప్రస్థానం అద్భుతంగా సాగింది. ఆమె స్వరం బాగుండడంతో ఓ వైపు టీచింగ్ చెబుతూనే మరో వైపు ప్రొఫెషనల్ సింగర్‌గా స్థిర పడాలని అనుకున్నారు. మొదట గజల్స్ ప్రాక్టీస్ చేశారు. ఆధ్యాత్మిక రంగాన్ని ఎంచుకున్నారు. ప్రేమ..జీవితం..ఆధ్యాత్మికం..ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆమెను పరిపూర్ణమైన వ్యక్తిగా నిలబెట్టింది. అదే వేదికపై ప్రపంచాన్ని చుట్టి వచ్చింది. ఎన్నో కచేరీలలో పాలు పంచుకున్నారు. గీతాంజలి రాయ్‌లో ఉన్న టాలెంట్‌ను ప్రథమంగా పండిట్ ప్రతాప్ నారాయణన్ గుర్తించారు. ఆమెకు అన్ని మెళకువలు నేర్పించారు..ఇండియన్ క్లాసికల్ విభాగంలో మేవతి ఘరణ ద్వారా ప్రాక్టీస్ చేయించారు. దీంతో ఆ గాత్రంలో సప్తవర్ణాలు పురుడు పోసుకున్నాయి. రంగుల హరివిల్లులు నాట్యం ఆడేలా చేశాయి. ప్రతి పెదవిపై ఆమె రాగం పాటై పూసింది..దీనిని గమనించిన ముంబైలో ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ సర్దార్ మాలిక్ మరింత మెరుగులు దిద్దారు.
ఆగని స్వర ప్రస్థానం - అక్కడి నుంచి గీతాంజలి రాయ్ వెనుతిరిగి చూడలేదు. తన స్వర ప్రస్థానం నేటి దాకా నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. గజల్స్‌ను ఎంచుకుంది. గాయకి పేరుతో పాడటం ప్రారంభించింది. జనం ఒక్కరొక్కరుగా రావడం ..హాల్స్ నిండడం జరిగి పోయాయి. ఊహించని రీతిలో ప్రచారం లభించింది. అనుకోకుండా గజల్ ప్రక్రియలో కింగ్ గా పేరొందిన మెహదీ హస్సన్ తోడవడం..జగజ్జీత్ సింగ్‌తో కలిసి పాడే స్థాయికి చేరుకున్నారు గీతాంజలి. హిందీ, మరాఠీ, ఉర్దూ భాషలలో ఆమె ప్రావీణ్యం సంపాదించారు. అమోఘమైన గాత్రధారణతో సభికులను మైమరిచి పోయేలా చేశారు.
డివైన్ సింగర్ - దేవుడున్నాడో తెలీదు..కానీ ఆమె దైవాన్ని నమ్ముతారు. అందుకే తన గాత్రాన్ని దైవపరం చేశారు. డివైన్ సింగర్‌గా రాణిస్తున్నారు. అలానే పేరు తెచ్చుకున్నారు. కచేరీలు, గజల్స్, భజన్స్‌తో తన జర్నీని సాగిస్తున్నారు. జీవితం పరిపూర్ణం కావాలంటే అంతిమంగా ఆధ్యాత్మిక మార్గం తప్ప మరో దారి లేనే లేదంటారు ఆమె. అందుకే తాను ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో చేరడం..గురు రవిశంకర్ ఆశీస్సులతో కలిసి పని చేయడం ఆ దేవుని కృపనేనని చెబుతుంటారు. వేల పాటలు పాడారు. గురు హారతి, క్రిష్ణ క్రిష్ణ ఆల్బమ్స్ కూడా విడుదల చేశారు. భారతీయ భక్తి ఛానళ్లలో ఆమె గజల్స్, భజన్స్ తో ..భక్తి గీతాలతో సమ్మోహనం చేస్తున్నారు. ఆమె పేరుతో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు. 2 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్స్‌గా చేరడం ఇదో రికార్డుగా నమోదైంది. దేనితో సాధించలేనిదానిని ఆధ్యాత్మిక ప్రశాంతతతో చేరవచ్చంటారు తన గీతాల్లో గీతాంజలి.
లైఫ్ కోచ్ - జీవితంలో ఏముంది..అంతా అందులోనే ఉంది. అందుకే ఆమె సింగర్‌గా ..లైఫ్ కోచ్‌గా ..మోటివేషనల్ స్పీకర్‌గా విభిన్నమైన రంగాలలో రాణిస్తోంది. ఎవ్విరీథింగ్ ఈజ్ పాజిబుల్..బట్ సమ్‌థింగ్ యు మస్ట్ సీ ద రొటేడ్ థింగ్స్ అని సెలవిస్తారు. 20 ఏళ్లుగా టీచ్ చేస్తూనే వున్నారు. ఎయిర్‌టెల్, ఐడియా, వీఎస్ ఎన్ ఎల్, సింబసిస్ కాలేజీ, యశ్వంత్‌రావ్ డెంటల్ కాలేజీ ఇలా లెక్కలేనన్ని కంపెనీలు, కాలేజీలు, యూనివర్శిటీలలో లైఫ్ కోచ్‌గా పాఠాలు చెప్పారు. సింగర్‌గానే కాకుండా అందంగా ఉండడం ఆమె ప్లస్ పాయింట్. దీంతో కన్నడ సినిమా లో రీసెంట్‌గా అనంత్ నాగ్‌తో కలిసి హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆమె స్టోరీ టెల్లర్ కూడా..గీతాంజలి రాయ్ ప్రతిభాపాటవాలను గుర్తించిన ప్రభుత్వాలు, ఇతర దేశాలు సమున్నతమైన రీతిలో పురస్కారాలతో సత్కరించాయి. తన స్వర మాధుర్యంతో కోట్లాది జనాన్ని రంజింప చేస్తున్న గీతాంజలి రాయ్ ఇలానే అలరిస్తూనే ఉండాలని కోరుకుందాం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి