కొలువుల పేరుతో టోకరా - విజ్డమ్ మాయాజాలం
టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి సాధించినా మోసాలు మాత్రం రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. కొలువుల ఆశ చూపి కోట్లు కొల్లగొట్టడం మామూలై పోయింది. ప్రభుత్వాల ఉదాసీన వైఖరి, చట్టాలలో నెలకొన్న లొసుగులు నేరగాళ్లు, మోసగాళ్లకు మరింత వెసలుబాటు కలుగుతోంది. తమకు ఉద్యోగం వస్తుందనే ఆశతో నిరుద్యోగులు లెక్కకు మించి డబ్బులు కన్సల్టెన్సీలకు కడుతున్నారు. చాలా మటుకు ఐటీ దిగ్గజ కంపెనీలన్నీ ముందే ఆయా కాలేజీలు, సంస్థలు, యూనివర్శిటీలతో ఒప్పందం చేసుకుంటున్నాయి. తమ కంపెనీల అవసరాలకు తగినట్టు శిక్షణ అందజేస్తున్నాయి. కొన్ని సంస్థలు ముందు జాగ్రత్త చర్యగా డైరెక్టుగా అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించి అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇస్తున్నాయి. ఇంకొన్ని జాబ్ కన్సల్టెన్సీలను సంప్రదిస్తున్నాయి.
దీనినే ఆసరాగా చేసుకున్న కొందరు ఏకంగా కోట్లకు ఎసరు పెట్టారు. వేలాది మంది ఉద్యోగార్థుల నుండి కోట్లు వసూలు చేసి..భారీ మోసానికి పాల్పడిన సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఎనీ టైం ఎంప్లాయిమెంట్ పేరుతో ..జాబులిస్తామంటూ జేబులు గుల్ల చేశారు. విదేశాల్లో, ఇండియాలో ఉన్నతమైన కంపెనీల్లో కొలువులు ఇప్పిస్తామంటూ స్మూత్ గా బురిడీ కొట్టించారీ ఘనులు. విజ్డమ్ జాబ్స్ పేరుతో ఓ వెబ్ పోర్టల్ ప్రారంభించారు. రెజ్యూమె ఫార్వర్డ్, ఇతర సర్వీసుల పేరుతో డబ్బులు వసూలు చేశారు. పెద్ద కంపెనీల పేరుతో ఫోన్లలో తెలివిగా ఇంటర్వ్యూలు కూడా నిర్వహించి నమ్మించారు. ఒక్కొక్కరి దగ్గర 10 వేల నుండి లక్షల్లో వసూలు చేశారు. సైబరాబాద్ పోలీసులు భారీ మోసాన్ని పసిగట్టి..బయట పెట్టారు.
ఈ దందా కొన్నేళ్ల నుండి కొనసాగుతోంది. ఒకటా ఏకంగా 70 కోట్లు కొల్లగొట్టారు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అజయ్ కొల్లా ...దీనికి స్కెచ్ వేశాడు. డీసెంట్‌గా కార్పొరేట్ కంపెనీగా ఆఫీస్ ఓపెన్ చేశాడు. ఆన్ లైన్ లో నిరుద్యోగులనే టార్గెట్ చేశాడు. సర్టిఫికెట్ వెరిఫికేషన్, సెక్యూరిటీ డిపాజిట్ అంటూ ఎర వేశాడు. లక్ష మందికి పైగా బాధితులు ఉన్నారు. ఈ సంస్థ చేతిలో మోసపోయిన ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. తీగ లాగితే డొంకంతా కదిలింది. ఈ భారీ చీటింగ్ బయట పడింది.
ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన అజయ్ కొల్లా ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. 2009లో విజ్డమ్ ఐటీ సర్వీసెస్ లిమిటెడ్ పేరుతో అందంగా వెబ్ సైట్ డిజైన్ చేయించాడు. ఇండియాతో పాటు ఇతర దేశాల్లో కొలువులు ఇప్పిస్తామంటూ ప్రచారం చేశాడు. రెండు వెబ్ పోర్టల్స్‌ను స్టార్ట్ చేశాడు. వేర్వేరు భాషల్లో ప్రావీణ్యం కలిగిన వారిని టెలికాలర్స్ గా ఏర్పాటు చేసుకుని నిరుద్యోగులకు గాలం వేశాడు. పేరున్న జాబ్ పోర్టల్స్ నుండి ఉద్యోగాలను కాపీ ..పేస్ట్ చేయడం..నిరుద్యోగులను నమ్మించడం చేశారు. ఆయా కంపెనీల హెచ్ ఆర్ ల పేరుతో తుతూ మంత్రంగా ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి నమ్మించాడు. వివరాల నమోదు, కంపెనీల కాలింగ్ దగ్గరి నుండి డబ్బులు డిపాజిట్ చేయడం దాకా అన్నీ ప్రొఫెషనల్‌గా ప్లాన్ చేశాడు.
69 వేల 962 మంది నుంచి సర్వీసెస్ ఫీజు కింద 30 కోట్లు, సెక్యూరిటీ డిపాజిట్ కింద 35 వేల నుంచి 40 కోట్లు వసూలు చేయడం విశేషం. మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలతో సహా ఇతర దేశాలలో సైతం బురిడీ కొట్టించాడు. ఏడుకొండలు అనే బాధితుడు తాను మోసపోయానని గ్రహించి ధైర్యంగా ముందుకు రావడంతో ఈ భారీ నేరం బయట పడింది. ఇలాంటి వారు ఇంకెందరు సైబరాబాద్‌లో తిష్ట వేశారో చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇకనైనా ఐటీ హబ్, ఐటీ శాఖ ముందుగానే ప్రభుత్వ శాఖ ద్వారానే నియామకాలు జరిపితే ఇలాంటి మోసాలు జరగవు.
నిరుద్యోగులు అన్నీ చూసుకున్నాకే అడుగు వేయాలి తప్పా ..ఏదో జాబ్ ఇస్తామంటే పరుగులు తీయడం..డబ్బులు ఇవ్వడం..తీరా లబోదిబోమనడం మామూలై పోయింది. కష్టపడి చదవకుండా పై పై చదువులు చదివి ఉద్యోగాలు కావాలంటే ఎక్కడ దొరుకుతాయి..అందుకే ముందు జాగ్రత్తగా ఏ కంపెనీ ..ఎక్కడుందో ఎంక్వయిరీ చేసి ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వాలి. లేక పోతే జేబుల్లో ఉన్న డబ్బులు పోయే ప్రమాదం పొంచి ఉంది..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి