ఆదిత్య అద‌ర‌హో

ఆధునికత హవా కొనసాగుతున్నా. సోషల్ మీడియా రాజ్యమేలుతున్నా ..స్మార్ట్ ఫోన్లు జిగేల్ మనిపిస్తున్నా ..సినిమా మాత్రం పవర్ ఫుల్ మాధ్యమంగా విరాజిల్లుతోంది. ఇప్పటి దాకా ఎందరో బతుకును పారేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆశల ఆరాటాలతో ఏదో జరగక పోతుందా అన్న నమ్మకంతో ట్రై చేస్తున్న వాళ్ళు వున్నారు. ఇండియన్ సినిమాను శాసించే స్థాయిలో తెలుగు సినిమా రికార్డులు తిరుగ రాస్తోంది. ఈ క్రమంలో కొందరు వెనుదిరిగిన వాళ్ళు వున్నారు . ఇంకొందరు గెలుపు ఓటములు ..జయాపజయాలు పరిగణలోకి తీసుకోకుండా తమ దారుల్లో వెళుతున్నారు. ఇప్పుడు క్రియేటివిటీ కి పెద్దపీట లభిస్తోంది. యూట్యూబ్ పుణ్యమా అంటూ సినిమా అప్రహతిహతంగా విరాజిల్లుతోంది. ఇదో మాయా మార్కెట్. ప్రేక్షకుల .. వీక్షుకుల పై ఆధారపడడంతో సినిమా అత్యంత నిర్ణయాత్మక పాత్రను పోషిస్తోంది. 

అప్పటికి ఇప్పటికీ తెలుగు సినిమా కొంగొత్త మార్పులతో పరుగులు తీస్తోంది. ఇటీవలి కాలంలో బడ్జెట్ ఎక్కువ కావడంతో వర్ధమాన యువతీ యువకులు తమ కలలకు జీవం పోసేందుకు లఘు చిత్రాలను ఎంచుకుంటున్నారు. వీరికి సీనియర్ దర్శకులు సలహాలు ..సూచనలు అందజేస్తూ ప్రోత్సహిస్తున్నారు. అలాంటి వారిలో సినీ దర్శకుడు పోతుగంటి విద్యా ప్రకాష్ అలియాస్ పీసీ ఆదిత్య ఒకరు . ఆయనది విజయనగరం జిల్లా.  వేపాడ మండలంలో పుట్టిన ఆయన  సినిమాపై మమకారంతో చెన్నపట్నం వరకు  వెళ్లారు . అక్కడ సినిమా మేకింగ్ లో మెళకువలు నేర్చుకున్నారు.  సృజనాత్మక దర్శకునిగా పేరు పొందారు. తక్కువ బడ్జెట్ తో సినిమాలు తీస్తూ జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘వైఎస్‌ఆర్ మహాప్రస్థానం’ సినిమా  మంచి పేరు తీసుకు వచ్చేలా చేసింది. 2004 లో పిల్లలు కాదు పిడుగులు, 2007 లో రేపటి పౌరులు , 2008 లో ఇదే ప్రేమంటే  సినిమాలు చేసారు. కేవలం వంద రోజుల్లో 100  షార్ట్ ఫిలిమ్స్ తీసిన ఘనత ఆదిత్యకే దక్కింది . 11 గంటలు పేరుతో తీసిన సినిమాను ఆయన 11 గంటల్లో తీశారు . 11 కెమేరాలు, 11 మంది నటులు, 11 లొకేషన్స్ లో తీసి రికార్డ్ సృష్టించారు. పోస్ట్ ప్రొడక్షన్ డైరెక్టర్ గా ఎంపికయ్యారు. ఇది కూడా ఓ రికార్డ్. 

చిన్నతనం నుండే నాటకాలపై ఉన్న మక్కువ ఆదిత్యను కళాకారుడిగా, సృజనశీలిగా ..దర్శకుడిగా మార్చింది. ప్రముఖ దర్శకుడు జంధ్యాల వద్ద ఆదిత్య శిష్యరికం చేసారు. తర్వాత కాలంలో సూపర్‌స్టార్ కృష్ణ వద్ద వర్క్ నేర్చుకున్నారు.  2004  జూన్ 11న విడుదలైన ‘పిల్లలు కాదు పిడుగులు’ మంచి సందేశాత్మక చిత్రంగా పేరొచ్చింది. ఇదే స్పూర్తితో ఆయన తనలోని కళకు మరింత మెరుగులు దిద్దారు. అదే లఘు చిత్రాల మీదకు మళ్లారు. ఉత్తరాంధ్రలో సినిమా పరిశ్రమ రావాలన్నది ఆయన కోరిక. ఎన్నో వసతులు ..వనరులు ఉన్నాయని ఆ దిశగా ప్రయత్నం చేయాలని అంటారు. 

 ప్రధానంగా విజయనగరం అటు శ్రీకాకుళానికి, ఇటు విశాఖకు మధ్యలో ఉంది.  సింగిల్ విండో సిస్టమ్‌లో ఏ లొకేషన్‌కైనా సులభంగా అనుమతినిచ్చే విధంగా ఉండాలి. చిన్న సినిమాలకు కనీసం రూ.10 లక్షలు సబ్సిడీని నిర్మాతకు అందజేస్తే ఎక్కువ సినిమాలు రూపుదిద్దుకుంటాయి. పూర్తయిన సినిమా విడుదలయ్యిందంటే థియేటర్‌కు ఇచ్చే విధంగా ప్రభుత్వం జీఓ విడుదల చేయాలి. ఉత్తరాంధ్రాలో నటీనటులు, సాంకేతిక నిపుణులకు కనీస సౌకర్యాలు కల్పిస్తే, చిత్రనిర్మాణం పెరుగుతుంది. దీనివల్ల స్థానికంగా ఉండే యువతకు అవకాశాలు లభిస్తాయని అంటారు. 
 
అప్పట్లో  వైఎస్ రాజశేఖర రెడ్డి 68 రోజుల పాటూ పాదయాత్ర చేశారు. చేవెళ్లలో పాదయాత్ర ప్రారంభించిన వైఎస్ ఇచ్ఛాపురం వరకూ మొత్తం వేల కిలోమీటర్లు  నడిచారు. మేము కూడా చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు షూటింగ్ చేశాం. ఇది మరిచిపోలేని అనుభూతి అని ఆదిత్య గుర్తు చేసుకుంటారు.  వంద రోజుల్లో వంద షార్ట్ ఫిల్మ్‌లు తీసినందుకు  లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ 2012లో చోటు దక్కించుకున్నారు.  
 
ఇప్పటి వరకూ 11 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు . . శాస్త్రీయ సంగీతానికి సంబంధించి శంకరాభరణం సినిమా అందుకున్నన్ని అవార్డులు ఏ సినిమాకూ రాలేదు. దీనికి సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉందని అంటున్నారు. కిట్టిగాడు సినిమాలో  ఆయన రాసిన ‘జీవి తం ఒక పాఠశాల.. ఆశయం ఒక ఆయుధం’ అనే టైటిల్ సాంగ్ ఇష్టమైన పాట అని . దానిని మర్చిపోలేనని చెపుతారు.  అంతరించిపోతున్న కళలకు జీవం పోయాలి . ఎందరో ఈ భూమి మీద ప్రతిభ కలిగిన కళాకారులు ఉన్నారు .  వారిని గుర్తించి సహకారం అందిస్తే మరిన్ని మంచి సినిమాలు వెలుగులోకి వస్తాయి. దీనికి సహృదయులు స్పందించాలి. అలా జరిగితే వారికి మేలు జరుగుతుందని అంటారు . . 

కళ సజీవం . కళ అజరామరం. లోకం ఉన్నంత దాకా కళ విరాజిల్లుతూనే ఉంటుంది. సజీవమైన కళకు ప్రోత్సాహమే కావాల్సింది. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు మరింత మెరుస్తాయి. వజ్రాల్లాంటి సినిమాలు జీవం పూసుకుంటాయి.  సినిమానే నమ్మనుకున్న సగటు కళాకారులకు ఉపాధి లభిస్తుంది. దీనికి పాలకులు ద్రుష్టి సారించాలని ఆదిత్య కోరుతున్నారు. ఆయన కల నెరవేరాలని ఆశిద్దాం. 

కామెంట్‌లు