అన్నార్థుల ప్రత్యక్ష దైవం..అక్షయపాత్ర ఆదర్శం !
జనమే జనం..ఎక్కడ చూసినా ఆకలి కోసం అలమటించే అన్నార్థులు ఉన్న ఈ దేశంలో తరాలు మారినా..పాలకులు మారినా..లెక్కలేనన్ని సంక్షేమ పథకాలు..కార్యక్రమాలు అమలు జరుగుతున్నా నాటి నుంచి నేటి వరకు అమ్మా ఆకలి అంటూ ఆర్తనాదాలు మిన్నంటుతూనే వున్నాయి. వ్యవస్థ ఈ ఆకలి కేకల నుండి రక్షించేందుకు నానా అవస్థలు పడుతోంది. కోట్లాది రూపాయలు నీళ్లలాగా ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితం అగుపించడం లేదు. కోట్లాది రూపాయలు కోల్పోతున్నా అంతకంతకూ ఆకలి చావులు ఆగడం లేదు. అన్నార్థుల బాధలు తీరడం లేదు.
పుట్టకొకరు చెట్టుకొకరు అన్నట్టు లక్షలాది మంది పిల్లలు..అభాగ్యులు కూటి కోసం వేడుకుంటున్నారు. ఆకలి అనే మహమ్మారి నుండి తట్టుకోలేక కన్నీటి పర్యంతమవుతున్నారు. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంది. చూస్తే పిల్లలు..పాపం వాళ్లది కాదు..ఈ సమాజానికి . లెక్కలేనంత..లెక్కించ లేనంత సంపద అంతా కొద్ది మంది చేతుల్లోనే వుంటే ఈ ఆకలి బాధలు ఎట్లా తీరుతాయి. ఉన్నోడు కడుపు నిండే వాళ్ల కే పెడుతుంటే మరి ఈ పేదబిడ్డల పరిస్థితి ఎట్లా. ఈ సమయంలోనే ప్రపంచ వ్యాప్తంగా పలు శాఖలను కలిగిన ఇస్కాన్ ముందుకొచ్చింది.
గొప్పోళ్లు..కార్పొరేట్ కంపెనీలు..ఐటీ దిగ్గజాలు ..మందీ మార్బలం..అధికార..ధన బలం కలిగిన ప్రభుత్వాలు చేయలేని మహత్తరమైన ..మహోన్నతమైన ..మానవత్వం కలిగిన కార్యక్రమానికి 2000 సంవత్సరంలో బెంగళూరు నగరంలో అక్షయపాత్ర పేరుతో ఓ స్వచ్ఛంధ సంస్థ..లాభాపేక్ష లేని వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా దేశ వ్యాప్తంగా వేలాది పాఠశాలలల్లో అక్షయపాత్ర పరిపూర్ణమైన..పరిపుష్టమైన ..పౌష్టికాహారాన్ని పిల్లలకు అందజేస్తూ వస్తోంది. లోకం మెచ్చిన శ్రీ వేంకటేశ్వరుని సాక్షిగా తిరుమలలో సాగుతున్న అన్నదానం కార్యక్రమంతో పాటే అక్షయపాత్ర తన ప్రస్థానాన్ని నిరాటంకంగా కొనసాగిస్తోంది.
లక్షలాది మంది పిల్లలు..వేలాది పాఠశాలలు ఇప్పుడు మధ్యాహ్న భోజనాన్ని స్వీకరిస్తున్నాయి. ఆకలి కేకల నుండి రక్షిస్తున్నాయి. పిల్లలే కాదు పెద్దల కడుపులు నింపుతోంది అక్షయపాత్ర. హెచ్ ఎం డిఏ వినూత్నంగా హైదరాబాద్‌లో మధ్యాహ్న భోజనాన్ని కేవలం 5 రూపాయలకే భోజనం అందించే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. వంద రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేసినా దక్కని సంతృప్తి కేవలం 5 రూపాయలకే అందుతోంది. నగర వాసులనే కాదు బతుకు దెరువు కోసం వలస పోయిన కూలీలు, నిరుద్యోగులు, కోచింగ్ సెంటర్లలో చదువుకునే విద్యార్థుల పాలిట ఈ కార్యక్రమం దైవంగా మారింది. ప్రభుత్వం 15 రూపాయలు అందజేస్తుండగా మిగతా 5 రూపాయలను అక్షయపాత్ర భరిస్తోంది. కడుపు నిండా అన్నం పెడుతోంది.
అన్నంతో పాటు సరిపడా కూరగాయ, సాంబారుతో పాటు మజ్జిగ అందజేస్తోంది. అంతేకాకుండా తాగేందుకు ఓ నీళ్ల ప్యాకెట్ ఇస్తోంది. నగరంలోని ప్రధాన కూడళ్లలో అక్షయపాత్ర మధ్యాహ్న భోజన కార్యక్రమ స్టాల్స్ ఏర్పాటు చేశారు. టంఛనుగా మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై గంటన్నర పాటు నిరాటంకంగా 5 రూపాయలకే అన్నం కార్యక్రమం కొనసాగుతోంది. ఒక్క హైదరాబాదే కాకుండా చుట్టు పక్కల మండలాలకు సైతం విస్తరించింది. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు, బాలానగర్, జడ్చర్ల దాకా అక్షయపాత్ర సాగుతోంది. వలసలకు పెట్టింది పేరైన పాలమూరు పట్టణంలో కూడా అన్నపాత్రను ప్రారంభించారు. దీంతో వందలాది మంది వలస జీవులతో పాటు వివిధ ప్రాంతాల నుండి చదువుకునేందుకు వచ్చే విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగస్తులు, కూలీలు, ఆర్టీసీ కార్మికులు, తదితరులకు సౌకర్యంగా ఉంటోంది.
బాహుబలి క్రియేటర్ ఎస్. ఎస్. రాజమౌళి తో పాటు నిర్మాత 80 లక్షల రూపాయలు అక్షయపాత్రకు అందజేశారు. తమ ఉదారతను చాటుకున్నారు. కనిపించని దైవం కోసం కోట్లు ఖర్చు చేసే కంటే కనిపించే దైవంగా మారిన అక్షయపాత్ర చేస్తున్న ఈ బృహత్ కార్యక్రమానికి ఎంతో కొంత చేయూతను అందిస్తే జీవితానికి సార్థకత చేకూరుతుంది. అక్షయపాత్ర చేస్తున్న ఈ ప్రయత్నం ఫలవంతం కావాలని..కోట్లాది ప్రజల ఆకలిని తీర్చే స్థాయికి చేరుకోవాలని ఆశిద్దాం. అన్నదాత సుఖీభవ.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి