ప్ర‌తిభా పుర‌స్కారాలు .. విరిసిన ప‌ద్మాలు .. మెరిసిన ర‌త్నాలు ..!

జీవితంలో అత్యున్న‌త‌మైన ప‌ద‌వుల‌ను అధిరోహించే క్ష‌ణాలు చాలా గొప్ప‌వి. భార‌త దేశ‌పు జెండాను త‌లుచుకున్న‌ప్పుడు..రాజ్యాంగాన్ని చ‌దువుతున్న‌ప్పుడు..ల‌క్ష‌లాది ప్ర‌జ‌ల సాక్షిగా జాతికి ప్ర‌తినిధిగా ఉన్న రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా అందుకుంటున్న‌ప్పుడు క‌లిగే ఉద్వేగం అక్ష‌రాల‌కు అంద‌నిది. ఎప్పుడూ లేనివిధంగా ఈ సారి తెలుగు వారు మెరిసారు. త‌మ నైపుణ్యానికి న‌గిషీలు చెక్కి కాల‌గ‌మ‌నంలో ఎన్నో ఆటుపోట్ల‌ను ఎదుర్కొని విజేతులుగా నిల‌బ‌డ్డ వారున్నారు. అన్నీ కోల్పోయి అత్యున్న‌త‌మైన స్థానాన్ని అందిపుచ్చుకున్న అతిర‌థ మ‌హార‌థులు కొలువుతీరారు. జాతిని ప్ర‌భావితం చేసి..స్ఫూర్తి దాయ‌కంగా నిలిచే ఇలాంటి పుర‌స్కారాలు..గౌర‌వాలు మ‌రింత బాధ్య‌త‌ను పెంచుతాయి. గ‌తంలో గ‌డిచిన జీవితం వేరుగా ఉంటుంది. కానీ ఒక్క‌సారిగా జాతీయ స్థాయిలో అవార్డులకు ఎంపిక‌య్యాక ప‌రిస్థితిలో మార్పు వ‌స్తుంది. వ్య‌క్తిగ‌తంగా కొన్ని విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉంటూనే వృత్తిని..ప్ర‌వృత్తిని మ‌లుచు కోగ‌ల‌గాలి.

ఇది మ‌రింత క‌ష్టంగా అనిపిస్తుంది. ప‌నిలో నైపుణ్యం..ప్ర‌వృత్తిలో విభిన్న‌త‌..సాధించిన గెలుపులు..మ‌లుపుల‌కు ద‌క్కిన గౌర‌వ‌మే ఇది. ఈ మ‌ట్టిలో పుట్టిన ప్ర‌తి ఒక్క‌రికి దేశం గ‌ర్వించేలా ఉన్న‌త‌మైన ప‌ద‌వులు అందుకోవాల‌ని కోరిక‌..క‌ల క‌ల‌గ‌డం స‌హ‌జం.
ఈ సారి ప్ర‌క‌టించిన ప‌ద్మ‌శ్రీ‌, ప‌ద్మ‌భూష‌ణ్‌, ప‌ద్మ విభూష‌ణ్, భార‌త ర‌త్న , త‌దిత‌ర అవార్డుల‌లో స‌రైన వ్య‌క్తుల‌నే భార‌త ప్ర‌భుత్వం ఎంపిక చేసింది. త‌న నిబ‌ద్ద‌త‌ను చాటుకుంది. రాజ‌కీయ ప‌రంగా ఎంతో ఉన్న‌త వ్య‌క్తిత్వం క‌లిగిన నాయ‌కుడిగా, దార్శ‌నికుడిగా ..కురువృద్ధుడిగా ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి పేరుంది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఈ యోధుడిని భార‌త ర‌త్న వ‌రించింది. మ‌ట్టిలోని గొప్ప‌త‌నాన్ని ..మ‌ట్టి మ‌నుషుల జీవితాల‌ను..వారి భావోద్వేగాల‌ను పాట‌ల్లోకి ఒలికించి ..ప్ర‌పంచం నివ్వెర పోయేలా త‌న సంగీతంతో మెస్మ‌రైజ్ చేసిన సంగీత ద‌ర్శ‌కుడు భూపేన్ హ‌జారికాతో పాటు త‌న కాల‌మంతా స‌మాజానికే అంకితం చేసిన నానాజీని వ‌రించింది. వీళ్లు త‌మ త‌మ రంగాల్లో అరుదైన ముద్ర‌ను వేశారు.

అవార్డుల ప‌రంగా చూస్తే 94 మందికి ప‌ద్మశ్రీ అవార్డులు రాగా..14 మందికి ప‌ద్మ భూష‌ణ్ పుర‌స్కారాల‌ను కేంద్ర స‌ర్కార్ ప్ర‌క‌టించింది. అవార్డుల ఎంపిక క‌మిటీ త‌మ‌లోని నిజాయితీని చాటుకుంది. ఎప్పుడూ పుర‌స్కారాలు ప్ర‌క‌టించ‌గానే ఎన్నో ఆరోప‌ణ‌లు..విమ‌ర్శ‌లు వెల్లువెత్తేవి. ఈసారి ఎలాంటి అభ్యంత‌రాలు వ్య‌క్తం కాక పోవ‌డం విశేషం. వ్య‌వ‌సాయం దండుగ కానే కాద‌ని..అదో అద్భుత‌మైన పండుగ అని ఆచర‌ణ‌లో చేసి చూపించిన వారిని స‌మాజానికి ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త రైతు నేస్తం సంపాద‌కులు వెంక‌టేశ్వ‌ర్ రావుకే ద‌క్కుతుంది. పాలేక‌ర్ వ్య‌వ‌సాయ విధానం వ‌ల్ల రైతుల‌కు ఎంతో మేలు జ‌రుగుతుంద‌న్న వాస్త‌వాన్ని ఆయ‌న తెలియ చేశారు. ఎన్నో ప్రోగ్రామ్స్ ద్వారా చైత‌న్య‌వంతం చేశారు. స‌ద‌స్సులు, స‌మావేశాలు నిర్వ‌హించ‌డం..చేశారు. రైతుల‌కు చేసిన సేవ‌ల‌కు గాను అత్యున్న‌త పుర‌స్కారం ద‌క్కింది. ఇది తెలుగు వారికి ద‌క్కిన గౌర‌వంగా భావించాలి.

ఒక‌రేమో రాజ‌కీయ ప‌రంగా చాణుక్యుడిగా పేరు తెచ్చుకుంటే..మ‌రొక‌రు సంగీతానికే స్ఫూర్తి శిఖ‌రంగా నిలిస్తే..ఇంకొక‌రు సంఘ సేవ‌కే కొత్త అర్థం చూపించి..త‌మ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. అందుకే భార‌త ర‌త్నాలై మెరిశారు. తీజ‌న్ బాయి, ఇస్మాయిల్, అనిల్ కుమార్, బ‌ల్వంత్ ల‌ను ప‌ద్మ‌విభూష‌ణ్ వ‌రించింది. మోహ‌న్ లాల్, కుల‌దీప్ న‌య్య‌ర్, బ‌చేంద్రిపాల్, క‌రియా ముండా ప‌ద్మ భూష‌ణ్ అవార్డుకు ఎంపిక‌య్యారు. మాజీ క్రికెట‌ర్ గౌతం గంభీర్, ప్ర‌భు దేవా, ఖాద‌ర్ ఖాన్, శంక‌ర్ మ‌హ‌దేవ‌న్, శివ‌మ‌ణి, మ‌నోజ్ బాజ్ పేయ్ , సిరివెన్నెల సీతారామ శాస్త్రిలకు ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాలు ద‌క్కాయి. క్రీడా కోటా నుండి తెలంగాణ నుండి సునీల్ ఛ‌త్రికి ద‌క్క‌గా..ఇదే హైద‌రాబాద్‌కు చెందిన శంత‌న్ నారాయ‌ణ్ కు విదేశీ కోటాలో అవార్డుకు ఎంపిక‌య్యారు. క‌విగా, ర‌చ‌యిత‌గా, సంగీత ద‌ర్శ‌కుడిగా , పాట‌ల సంచారిగా పేరు తెచ్చుకున్న భూపేన్ హ‌జారికా సాగించిన ప్ర‌స్థానం సంచార‌మే.

న‌న్ను నిలబెట్టింది..న‌న్ను తీర్చిదిద్దింది..ఇలా వేల పాట‌లు రాసేలా చేసింది..సంచార‌మే అంటారు. 2011లో సెల‌వంటూ లోకాన్ని వీడిన ఆ మ‌హా సంగీత ద‌ర్శ‌కుడి అంతిమ యాత్ర‌కు ల‌క్ష‌లాది ప్ర‌జ‌లు హాజ‌ర‌య్యారు. ఘ‌నంగా వీడ్కోలు ప‌లికారు. ప్ర‌జ‌ల కోస‌మే క‌డ‌దాకా జీవించిన వ్య‌క్తిగా ఆయ‌న చిర‌స్థాయిగా నిలిచి పోతారు. మ‌రొక‌రి గురించి చెప్పాలంటే..ఆయ‌న ఇంటి పేరే సిరి వెన్నెల‌. పాట‌ల తోట‌లో త‌న‌కంటూ శాశ్వ‌త స్థానం సంపాదించుకున్న వ్య‌క్తి సీతారామ శాస్త్రి. ద‌ర్శ‌కేంద్రుడు విశ్వ‌నాథ్ పుణ్య‌మా అంటూ సినీ రంగంలోకి ప్ర‌వేశించిన ఈ అరుదైన గేయ ర‌చ‌యిత వేలాది పాటల‌కు ప్రాణం పోశారు. తెలుగు సాహిత్యానికి స‌మున్న‌త గౌర‌వం ల‌భించేలా సాహిత్యానికి ప్రాణం పోశారు. గాయ‌కుడిగా ఆయ‌న చేయ‌ని ప్ర‌యోగ‌మంటూ లేదు.

దేశంలోని ప‌లు భాష‌ల్లో అన‌ర్ఘ‌లంగా ..అల‌వోక‌గా పాట‌ల‌ను పాడ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. అత‌నే శంక‌ర్ మ‌హ‌దేవ‌న్. గుక్క తిప్పుకోకుండా పాడ‌టంలో రికార్డులు తిర‌గ రాశారు. బాలు స‌హ‌కారంతో వెలుగులోకి వ‌చ్చిన మ‌రో దిగ్గ‌జం..శివ‌మ‌ణి. అమెరికా అమ్మాయి సినిమాలో ఆలా వ‌చ్చి ఇలా మెరిసిన ఇత‌ను చేసిన విన్యాసాలు ఇంకెవ్వ‌రూ చేయ‌లేదు. ప్ర‌పంచంలోనే అత్యున్న‌త‌మైన ..క్రియేటివిటీ క‌లిగిన డ్ర‌మ్మ‌ర్ గా పేరు తెచ్చుకున్నారు శివ‌మ‌ణి. స‌మాజం కోసం జీవితాన్ని అంకితం చేసిన ఆద‌ర్శ నీయుడు నానాజీ. ఇలాంటి ఎంద‌రో త‌మ త‌మ రంగాల‌లో ఎవ‌రూ సాధించ‌లేని విజ‌యాల‌ను న‌మోదు చేసుకున్నారు. భావి త‌రాల‌కు స్ఫూర్తిగా నిలిచారు. వీరంద‌రికీ కోట్లాది భార‌తీయుల త‌ర‌పున కృత‌జ్ఞ‌త‌లు చెప్ప‌డ‌మే..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!