స్వామీజీ జీవిత‌మే ఓ సందేశం



పాఠాలు వల్లె వేసినంత మాత్రాన గురువై పోతామా. కాదు దానికి అకుంఠితమైన సాధన చేయాలి . కాలం పెట్టే కఠినమైన పరీక్షలను ఎప్పటికప్పుడు తట్టుకోవాలి . సన్యాసం పుచ్చు కోవాలి . అన్నిటిని వదులు కోవాలి . నా అన్న వారుండరు . బంధాలు ..బాంధవ్యాలు అన్నీ సమాజ సేవకు ఉపయోగ పడేలా తన మనసును ..తన శరీరాన్ని అర్పించేసు కోవాలి . ఇదంతా ఓ పద్ధతి ప్రకారం సాగే నిరంతర ప్రక్రియ .

దీనిని పొందాలంటే అహోరాత్రులు కష్టపడాలి . కన్నీళ్లు గుండెను తాకుతున్నా..సరే నిక్షలంగా ముందుకు సాగి పోవాలి . ఈ ప్రయాణం సజావుగా సాగాలంటే తనను తాను తెలుసు కోవాలి . వేదాలు ..పురాణాలు ..గీత ..ఇలా అన్నిటినీ అర్థం చేసుకోవాలి . ఇదంతా ఒక్క రోజులో నో లేదా ఓ ఏడాది కష్టపడితే వచ్చేది కాదు . ఇదంతా కొన్నేళ్ల పాటు సాగించే ప్రయాణం . దైవం కోసం సాగించే యజ్ఞం.

60 ఏళ్ళ మజిలీలో చినజీయర్ సాగించిన ప్రస్థానం బహు గొప్పది . భావి తరాలకు ఓ 

పాఠం లాంటిది . తరచి చూస్తే ఎంతో ఉద్విగ్నత . ఆయన అందరికి ఆప్తుడు .కానీ ఎవ్వరికీ అర్థం కాడు. అదే ఆయన ప్రత్యేకత . ఈ భువి మీద కొందరు బతకాడానికి వస్తారు . ఇంకొందరు చిరునామా లేకుండానే వెళ్లి పోతారు . కానీ ఇలాంటి మహా పురుషులు మాత్రం నూటికో కోటికో ఒక్కరు మాత్రమే జన్మిస్తారు .

ఆయన అంతరంగం పడిలేచే కెరటం కాదు ..సప్త నదులు కలిసే సముద్రం . ఆయన మార్గం అనితర సాధ్యం . ఆయన గమ్యం దైవాన్ని ప్రతి ఒక్కరికి చేర్చటం . దేవుడి పట్ల నమ్మకాన్ని ..సేవా గుణం అలవడేలా చేయడం . స్వామీజీ బతుకంతా సమాజ ఉద్ధరణే ..అందుకే ఆయన మనకాలం కొండగుర్తు .

సకల శాస్త్రాలను అర్థం చేసుకుని ..అవి పామరులకు అర్థమయ్యేలా చినజీయర్ చేస్తున్నారు . ఇదో మహా సంకల్పం . ఆయన కొన్నేళ్లుగా ఒక్కరే ఒంటరి పోరాటం చేస్తున్నారు . విద్యా దానం ..అన్నదానం ..వైద్య సహాయం మన ముందున్న కర్తవ్యం..వీటిలో ఏ ఒక్కదానిలో భాగం పంచుకున్నా ..లేదా ఎంతో కొంత సహాయ పడినా సరే వారి జన్మ ధన్యమవుతుందని స్వామిజీ అంటారు . సేవ చేయడంలో ఉన్నంత ఆత్మ సంతృప్తి ఇంకెందులోనూ లభించదంటారు .

దీనికి కూడా ధైర్యం కావాలి. ప్రతి దానికి ఓ ప్రత్యేకత ఉంటుంది . దానిని గుర్తించి ముందుకు వెళితే ప్రతి మనిషి అద్భుతాలు సృష్టించవచ్చు. దుస్తులు ధరించినంత మాత్రాన యోగులు కాలేరు . సన్యాసం అన్నది జీవితం కంటే గొప్పది. ఓ వైపు కోరికలు .ఇంకో వైపు వస్తువుల మాయాజాలం ..భౌతికపరమైన ఆలోచనలు ..అన్నిటికంటే భయపెట్టేది ..వెనక్కి నెట్టేది బంధం.

వీటిని వదిలేసుకోవడం అంటే మనతో మనం మరో యుద్ధం చేయడం అన్నమాట. మరి దానిని పొందాలంటే దమ్ముండాలి ..దానిని స్వీకరించాలంటే నిన్ను నీవు అర్పణ చేసుకోగలగాలి. అదే దైవం కోసం సాగించే ప్రయాణం .

దిక్కుతోచని స్థితిలో ఉన్న భారతీయ ఆధ్యాత్మిక సమాజానికి చినజీయర్ ఓ దిక్సూచిలా నిలబడ్డారు . విలువలే ప్రాతిపదికగా ఆయన కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఆధునిక సమాజానికి కాయకల్ప చికిత్స చేయడం మొదలు పెట్టారు . భావసారూప్యత కలిగిన ప్రతి ఒక్కరిని ఒకే ఆధ్యాత్మిక వేదికపైకి తీసుకు వచ్చారు . ఇదీ ఆయన సాధించిన కృషికి తార్కాణం . ఆయన తో పాటు పరిపూర్ణానంద స్వామిజీ అడుగులు వేస్తున్నారు . హిందూ సమాజాన్ని ఒకే స్వరమై నినదించేలా చేస్తున్నారు .

ఇదో బృహత్తర ప్రయత్నం . చినజీయర్ స్వామిజీ ఏది మాట్లాడినా అదో సంచలనమే. ఇటీవల ఆయన ఓ మాటన్నారు . దేవుడు కూడా పక్కా కమ్యూనిస్ట్ అని . ఇలా చెప్పడానికి ఎంతో దమ్ముండాలి. ఎవ్వరూ చేయలేని పనిని ఆయన చేస్తున్నారు . స్వామిజీ ముందున్న లక్ష్యం ఒక్కటే . అందరు బాగుండాలి . అందరికీ సమాన అవకాశాలు దక్కాలి . ఇది కమ్యూనిజం చెబుతుంది .

దైవం ముందు అంతా సమానులే .. భేదభావాలు ఉండవు . అందరికీ అందే తీర్థం ఒక్కటే . అందుకే ఆయనను కోట్లాది మంది అనుసరిస్తున్నారు . వేలాది మంది భక్తులుగా మారి పోతున్నారు . గుడ్డిగా అనుకరించడం ఎవ్వరికీ మంచిది కాదు . దైవ భావం వుంటే సరిపోదు ..దాని కోసం మీరంతా సాధన చేయాలి అంటారు స్వామిజీ .

వెలుగులు పంచుతూ సమాజ హితం కోసం జీవితాన్ని త్యాగం చేసిన ఆ మహనీయుడైన స్వామీజీని కలిసే ప్రయత్నం చేయండి . అది మిమ్మల్ని కొత్త లోకాలకు తీసుకు వెళుతుంది . ఆధ్యాత్మిక శోభతో పాటు మానవతా బాంధవ్యాల పూల పరిమళాలు ఆస్వాదించేలా చేస్తుంది . ఇంకెందుకు నిరీక్షణ ..మనముందున్న ఆ దివ్య సాకేతంలోకి అడుగులు వేయండి .

కామెంట్‌లు