బిడ్డా నిను మరువదు ఈ గడ్డ..!
నీ దగ్గర ఏమున్నది. మందీ మార్బలం..అందలాలు ఎక్కంచే మనుషులు. పొగిడే వాళ్లు..అధికార దర్పాన్ని ..రాజసాన్ని ప్రదర్శించే వాళ్లు ..లేకపోతేనేం..గుండె నిండా ధైర్యమున్నది. అంతకంటే ప్రపంచాన్ని శాసించే పట్టుదల నీ స్వంతం అయ్యాక. ఇక నిన్ను ఆపే దమ్ము ఎవరికి ఉన్నది కనుక.
పేరులో హిమం ఉన్నదేమో కానీ కష్టాలు దాటుకుని..కన్నీళ్లను దిగమింగుకుని ..యుద్ధ క్షేత్రంలో ఒంటరి సైనుకురాలి పాత్రను పోషించిన నీ తెగువ కోట్లాది ప్రజలకు అంతులేని బలాన్ని కలుగ చేసింది. తల్లీ నువ్వు సాగించిన ఈ పోరాట స్ఫూర్తి ఎందరో తల్లిదండ్రులకు భరోసా ఇచ్చింది. దేశం నిద్రలో జారుకున్న వేళ..నువ్వొక్క దానివి చిరుత పులి కంటే వేగంగా..రాకెట్ కంటే ఎక్కువగా మైదానాన్ని చుట్టుముట్టిన ఆ క్షణాలు ..కోట్లాది భారతీయుల గుండెలను ఛిద్రం చేసినవి.
ఎందరో నిన్ను చూసి కంటతడి పెట్టారు. ఇంకొందరు మౌనంగా రోదించారు. కార్పొరేట్ కంపెనీల మాయజాలంలో పడి ..జాతీయ పతాకాన్ని ఎగతాళి చేసే వాళ్లకు..జాతి కంటే కరెన్సీకే ప్రాముఖ్యత ఇచ్చే ప్రబుద్దులు ఉన్న ఈ కాలంలో నువ్వో ధృవతారలా వెలుగొందావు. ఏ కులమైతేనేం..ఏ మతమైతేనేం..ఒక్కదానివే ఒంటరిపోరు సాగించిన తీరు ఎందరికో పాఠం కావాలి.
విదేశాల మోజులో పడి తల్లిదండ్రులను వదిలేసి..మట్టిని ద్వేషింషే వారికి నువ్వొక గుణపాఠం కావాలి. నీ త్యాగం తరతరాలుగా నిలిచే ఉంటుంది. నీ జ్ఞాపకం వెంటాడుతూనే ఉంటుంది. హిమదాస్ నీకు పాదాభివందనం..ఈ దేశపు కాలగమనంలో నీవు సాగించిన ఈ ప్రస్థానపు ప్రయాణం ఎల్లప్పటికీ కన్నీళ్లు గుండెను తాకుతూనే ఉంటాయి.కళ్లను కప్పేస్తుంటాయి..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి