జనం కోసం జీవితం - ప్రజా సేవకు అంకితం - మరికంటి భవానీ రెడ్డి ప్రస్థానం
తెలంగాణ ఎన్. ఆర్. ఐలలో మరికంటి భవానీ రెడ్డిది ప్రత్యేకమైన స్థానం. ఆంట్రప్రెన్యూర్ గా , తెలంగాణ ఉద్యమ కాలంలో ఆమె అందరిని కూడగట్టింది. ప్రత్యేక రాష్ట్రం కోసం తన వంతు కృషి చేసింది. తెలంగాణ సాధనలో మమేకమైన వారిలో కొందరికి వెన్ను దన్నుగా నిలిచింది. సిద్ధిపేట జిల్లాకు చెందిన భవానీ రెడ్డి కుటుంబానికి చెప్పుకోదగిన చరిత్ర వున్నది. మాటివ్వడం..ఇచ్చిన మాట నిలబెట్టు కోవడం కోసం అలుపెరుగకుండా కృషి చేయడం ఆమె నైజం. అందరి మహిళల లాగానే ఆమె కూడా కష్టాలను దాటుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ఏకంగా తన స్వంత కాళ్లపై నిలబడేందుకు ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందింది.
ఆర్టీసీ సంస్థలో మెకానికల్ ఇంజనీర్‌గా సమర్థవంతంగా విధులు నిర్వహించింది. వనపర్తి జిల్లా పెద్దమందడి మండల పరిధిలోని పెద్ద మునగాల్ చేడ్‌కు చెందిన వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకుంది. భర్తకు చేదోడు వాదోడుగా వుంటూనే మరో వైపు సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నది. తనతో పాటు మరికొందరు మహిళలను భాగస్వాములయ్యేలా చేసింది. బతుకు దెరువు కోసం కుటుంబంతో సహా ఆస్ర్టేలియాకు వలస వెళ్లింది. ఇక్కడ తాను పనిచేస్తున్న ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టి భర్తకు చేదోడుగా ఆమె కూడా ప్రయాణం చేసింది. అక్కడ అందరితో కలుపుగోలుగా వుంటూ ..తెలంగాణ ఎన్. ఆర్. ఐ సంస్థలో ముఖ్య భూమికను పోషించింది. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన బతుకమ్మ సంబురాలు విజయవంతమయ్యేలా తాను ముందుండి నడిపించింది.
అక్కడ భర్త ఐటీ కంపెనీలో ఉన్నత స్థాయిలో ఉంటూనే ఇక్కడ పేద విద్యార్థులు చదువుకునేందుకు ఆర్థిక సహాయం అందజేసేలా భవానీ రెడ్డి కృషి చేసింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లిన ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డను తమ ఇంట్లో ఆతిథ్యం కల్పించి తమ మట్టి మీదున్న రుణాన్ని ఆమె తీర్చుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నారు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చినప్పుడల్లా సభలు, సమావేశాలు, వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఆ తర్వాత తెలంగాణలో మహిళా పారిశ్రామికవేత్తలకు తోడ్పాటు అవుతుందని ఆమె భావించారు. కానీ ఇక్కడి ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించలేక పోవడంతో ఆమె ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరంలో భవానీ రెడ్డి సభ్యురాలిగా ఉన్నారు. ప్రజల కోసం ఏదైనా సేవ చేయాలన్న సంకల్పం, సమాజపు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్న తలంపుతో స్వంత ఖర్చులతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు.
జీవితంలో బాల్యం ఎంతో విలువైనదని, చదువుకుంటేనే సమాజం గుర్తిస్తుందని, ఎన్ని కష్టాలు వచ్చినా సరే విద్య, విజ్ఞానం , జ్ఞానం లభించేదాకా కష్టపడాలని ..ఏనాటికైనా అక్షరాలు వెలుగులు నింపుతాయని, ప్రతి ఒక్కరు పొలంలోకి కాకుండా బడిలో ఉండాలని కోరుతూ లఝు చిత్రాన్ని నిర్మించారు. ఇదంతా తెలంగాణ కోసం చేశారు. బంగారు తెలంగాణలో బతుకులన్నీ ఛిద్రమవుతున్నవని భవానీ రెడ్డి బాధ పడ్డారు. నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. అయినా ఆమె జీవితం, ప్రయాణం, సంచారం అంతా తెలంగాణ కోసమే.. ప్రజలతో మమేకం కావడమే తన గమ్యమని ఆమె కలిసిన ప్రతి ఒక్కరితో చెబుతూనే ఉంటారు. అంతేకాకుండా తెలంగాణ ఆడబిడ్డలను గుర్తుకు తెస్తారు. యాస, భాష, గోసను భవానీరెడ్డి ప్రజలకు అర్థమయ్యేరీతిలో వివరిస్తారు. బలిదానాలు, ఆత్మత్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 80 శాతానికి పైగా జనం సమస్యలతో సతమతమవడాన్ని ఆమె జీర్ణించుకోలేక పోయారు.
తట్టుకోలేక ఆమె జనం కోసం ఏదో చేయాలన్న సంకల్పంతో కార్యక్షేత్రంలోకి ప్రవేశించారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులు, కార్యక్రమాలను ధైర్యంగా నిలదీశారు. ఇందు కోసం సంఘాలు, పార్టీలు ఆమెను ఆహ్వానించినా తాను మాత్రం నిజాయితీకి మారుపేరైన కోదండరాం రెడ్డి స్థాపించిన తెలంగాణ జనసమితిలో చేరారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే ఎన్నికల్లో నిలబడటమే తప్ప మరో మార్గం లేదని ఆమె నమ్మారు.
ఇందు కోసం ఏకంగా ట్రబుల్ షూటర్‌గా పేరొందిన సీఎం కేసీఆర్ అల్లుడు తన్నీరు హరీష్‌రావు అడ్డా అయిన సిద్ధిపేట జిల్లాను భవానీరెడ్డి ఎంచుకున్నారు. టీజేఏసీ ఆధ్వర్యంలో ఏకంగా మహిళా విభాగం బాధ్యతలను స్వీకరిస్తూనే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. జనాన్ని జాగృతం చేస్తూ రాబోయే ఎన్నికలకు ఇప్పుటి నుంచే సన్నద్ధమవుతున్నారు. ఇందు కోసం చాప కింద నీరులా ప్రచారం ప్రారంభించారు. ఎవరైనా అర్థబలం, అంగబలం, అధికార దర్పం కలిగిన హరీష్ రావుతో పోటీ అంటే జడుసుకుంటారు. కానీ ఆమె మాత్రం జనంతో మమేకమవుతున్నారు. అందరికి అందుబాటులో ఉండడమే కాక వారితో కలిసిపోతున్నారు.
మాయమాటలతో జనాన్ని బురిడీ కొట్టిస్తూ నీళ్లు, నిధులు, నియామకాల్లో పూర్తి అలసత్వాన్ని చేస్తున్న టీ.ఆర్. ఎస్ సర్కార్‌కు రాబోయే రోజుల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పడం ఖాయమంటున్నారు. ఎన్నికలు వచ్చేనాటికి ఎవరు ఏ వైపున ఉన్నారో తేలుతుందని..అప్పుడు ప్రజాక్షేత్రంలో విజేతలెవరో బయటపడుతుందని అంతదాకా వేచి చూడటమేనని భవానిరెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఎన్.ఆర్.ఐగా, ఉన్నత స్థానంలో ఉద్యోగం చేసే అవకాశం ఉన్నా ..తన లక్ష్యం ..గమ్యం జనం కోసం..సమాజ హితం కోసమేనంటూ స్పష్టం చేస్తున్నారు..మరికంటి భవానీ రెడ్డి. ఆమె సదాశయం నెరవేరాలని..ఆమె లక్ష్యాన్ని చేరుకోవాలని ఆశిద్దాం..!

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి