దాదా చేతిలో సెలెక్షన్ ఫ్యూచర్
బిసిసిఐ ప్రెసిడెంట్ గా దాదా కొలువు తీరడంతో మార్పులు శరవేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే బిసిసిఐ లో ఏం జరుగుతుందో అని గంగూలీ వాకబు మొదలు పెట్టారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే తనదైన మార్క్ ను స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం భారత క్రికెట్ సెలెక్షన్ కమిటీ భవితవ్యం ఇప్పుడు దాదా చేతుల్లోకి వెళ్లి పోయింది. గతంలో ఆటగాడిగా, టీమిండియా సారధిగా దుందుడుకు ప్రదర్శించారు దాదా. జట్టును కొత్త పుంతలు తొక్కించాడు. దూకుడైన నాయకత్వంతో ప్రపంచ క్రికెట్‌లో భారత్‌ను తిరుగులేని జట్టుగా నిలిపాడు. యువ ఆటగాళ్లను వెన్ను తట్టి వారు తమ ప్రతిభను వంద శాతం ప్రదర్శించేలా ప్రోత్సహించాడు.
గంగూలీ ఇప్పుడు బీసీసీఐ బాస్‌గా కొత్త పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యాడు. పరిపాలకుడిగా దాదా తీసుకొనే తొలి నిర్ణయం జాతీయ సెలెక్షన్ కమిటీపైనే కానుంది. లోధా సంస్కరణల నేపథ్యంలో బీసీసీఐకి కొత్త రాజ్యాంగం ఏర్పడింది. దానిపై బోర్డు కార్యవర్గంతో పాటు అనుబంధ సంఘాలూ పూర్తిగా అవగాహనకు రావాల్సి ఉంది. అధ్యక్షుడిగా సౌరవ్ తీసుకొనే మొట్ట మొదటి ప్రధాన నిర్ణయం జాతీయ సెలెక్షన్ కమిటీపైనే. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని టీమిండియా సెలెక్షన్ కమిటీ భవితవ్యం గంగూలీ చేతిలో ఉందన్న మాట. రాజ్యాంగం ప్రకారం ప్రస్తుత సెలెక్షన్ కమిటీ పదవీ కాలం ముగిసేందుకు ఇంకా చాలా సమయమే ఉంది. వాస్తవంగా బోర్డు పాత రాజ్యాంగం ప్రకారం సెలెక్టర్ల పదవీ కాలం నాలుగేళ్లే. కానీ సవరణల అనంతరం దాన్ని గరిష్ఠంగా ఐదేళ్లకు పెంచారు.
ఎమ్మెస్కే ప్రసాద్, గగన్ ఖోడా 2015లో జరిగిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం ద్వారా సెలెక్టర్లుగా నియమితులయ్యారు. సాంకేతికంగా వారి పదవీ కాలం 2020 సెప్టెంబరుతో ముగుస్తుంది. కమిటీలో మార్పులు చేర్పుల గురించి సెలెక్టర్లతో సమావేశంలో గంగూలీ చర్చించే అవకాశం ఉంది. మరోవైపు సెలెక్టర్ల కాంట్రాక్ట్‌లను ప్రతి ఏజీఎంలో పునరుద్ధరించాలన్న క్లాజ్ కూడా చర్చకు వస్తోంది. ఎమ్మెస్కే, ఖోడా స్థానాలను మరొకరితో భర్తీ చేస్తామని గంగూలీ ఈ పాటికే సంకేతాలిచ్చాడు. అన్ని ఫార్మాట్లలో అన్ని విభాగాలలో పటిష్ఠమైన రిజర్వ్ బెంచ్‌ను తయారు చేసినందుకు తమ సెలెక్షన్ కమిటీ గర్విస్తోందని ఎమ్మెస్కె చెప్పాడు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి