నువ్వా నేనా..పీఠం కోసం పట్టు
మహారాష్ట్ర లో రాజకీయాలు రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మరాఠా రాజకీయం వేడెక్కుతోంది. సంకీర్ణంలో పదవుల పంపకంపై శివసేన పట్టు వీడడం లేదు. మరో వైపు కమలం బెట్టు దిగడం లేదు. ముఖ్యమంత్రి పదవి ఆదిత్య ఠాక్రేకు ఇవ్వడంతో పాటు మంత్రి పదవుల్లో సమాన వాటా కల్పిస్తామని లిఖిత పూర్వక హామీ ఇవ్వాలంటూ బీజేపీపై ఒత్తిడి తెస్తోంది. గెలిచిన ఎమ్మెల్యేలతో తన నివాసం మాతోశ్రీలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే భేటీ అయ్యారు. సమావేశం అనంతరం శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ తో కలిసి మాట్లాడారు. మా పార్టీ ఎమ్మెల్యేలంతా రెండున్నర ఏళ్ళు ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రి పదవుల్లో సమాన వాటా ఇవ్వాలని కోరారని చెప్పారు. అంతే కాకుండా ఆదిత్య ఠాక్రే కు సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ విషయంలో బీజేపీ హామీ ఇచ్చే దాకా ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే సమాన వాటా ఇస్తామంటూ లోక్‌సభ ఎన్నికల సమయంలో ఉద్ధవ్ ఠాక్రేకు ఇచ్చిన హామీని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నెర వేర్చాల్సిందేనని పట్టు బట్టారన్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి పీఠం తమ పార్టీ దేనని బీజేపీ మహారాష్ట్ర ఇన్‌చార్జి సరోజ్ పాండే స్పష్టం చేశారు. ఊహించిన దాని కంటే 17 సీట్లు తగ్గినా 105 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. మిత్రపక్షమైన శివసేనకు కూడా ఏడు సీట్లు తగ్గి, 56 సీట్లు గెలుచుకుందని తెలిపారు.
ప్రభుత్వ ఏర్పాటుపై ఉద్ధవ్‌తో సీఎం ఫడ్నవిస్ చర్చలు జరుపుతారని కేంద్ర మంత్రి రావు సాహెచ్ దన్వే వెల్లడించారు. అయితే అధికారం ఏర్పాటులో శివసేనకు ఎన్‌సీపీ మద్దతు ఇస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. మేం ప్రతిపక్షంలో ఉండాలని ప్రజలు తీర్పునిచ్చారు. ఆ తీర్పును పాటిస్తాం అని స్పష్టం చేశారు. మొత్తం మీద మరాఠాలో చోటు చేసుకున్న ఉత్కంఠ ఆ పార్టీలకంటే అమిత్ షా కు తలనొప్పిగా మారాయి. అటు హర్యానాలో ఇటు మహారాష్ట్రలో బీజేపీకి జనం షాక్ ఇచ్చారు. గతంలో కంటే ఈసారి ఓట్ల శాతం గణనీయంగా పడి పోయింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి