పసిడి విల విల..అమ్మకాలు వెల వెల
ఎన్నడూ లేని రీతిలో బంగారం ధరలు కొండెక్కడంతో అమ్మకాలు భారీగా తగ్గి పోయాయి. దీంతో జ్యుయెలరీ షాప్స్ కొనుగోలుదారులు లేక వెలవెల బోతున్నాయి. కస్టమర్స్ ను ఆకర్షించేందుకు అన్ని దుకాణదారులు పెద్ద ఎత్తున ఆఫర్స్, బహుమతులు, ఒకటి కొంటే మరొకటి ఉచితం అంటూ ప్రకటించినా జనం ఆ వైపు చూడలేదు. పండుగ వేళ కాసింతైనా పసిడిని కొనాలని ప్రచారం చేసినా మహిళలు వాటి జోలికి వెళ్ళ లేదు. ధంతేరాస్‌గా పిలిచే ధన త్రయోదశికి పసిడి మెరుపులు తగ్గాయి.
గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు ఏకంగా 40 శాతం దాకా తగ్గినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 10 గ్రాముల పసిడి ధర 40 వేలకు అటూ ఇటుగా కదులుతుండటంతో కొనుగోలుదారులు కొనేందుకు ఇష్టపడటం లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ధన త్రయోదశికి బంగారం, వెండి, లేదా విలువైన వస్తువులు కొనడం శుభ సూచకమని హిందువులు భావిస్తారు. 2018లో రికార్డు స్థాయి కొనుగోళ్లు జరిగాయి కూడా.
హైదరాబాద్‌లోని నగల షాపుల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 39,900 కాగా.. 22 క్యారెట్ల ధర 36,850 పలికింది. కిలో వెండి 50,600 ఉంది. ఈ సంవత్సరం ధన త్రయోదశికి 2,500 కోట్ల విలువైన సుమారు 6,000 కిలోల పుత్తడి అమ్ముడైనట్లు సీఏఐటీ అంచనా వేసింది. పసిడి ధర పెరగడంతో తక్కువ ధర ఉన్న వెండి వైపు మొగ్గు చూపడం విశేషం. మొత్తం మీద పెరిగిన ధరాభారం మహిళలకు పరీక్షలా మారింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి