బీఎస్ఎన్ఎల్ కు కాయకల్ప చికిత్స
కేంద్రంలో రెండవ సారి కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం ఇన్నేళ్ళలో ఓ మంచి నిర్ణయం తీసుకున్నది. అదేమిటంటే దేశంలోనే అతి పెద్ద నెట్ వర్క్ తో పాటు బ్యాండ్ విడ్త్ కలిగిన సంస్థగా పేరున్న భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కు కాయకల్ప చికిత్స అందించే పనిలో పడ్డది. నిన్నటి దాకా నష్టాల్లో కూరుకు పోయిన బీఎస్ఎన్ఎల్ ను ప్రైవేట్ పరం చేస్తారన్న అనుమానాలను సిబ్బంది వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. దీనిపై నెలకొన్న ఉత్కంఠకు చెక్ పెట్టింది. నష్టాల్లో ఉన్నప్పటికీ ఆ సంస్థను మూసేయ బోమని క్లారిటీ ఇచ్చింది. బీఎస్ఎన్ఎల్లో, ఎంటీఎన్ఎల్ విలీనానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ రెండు సంస్థల్లో ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించు కోబోమని, కొత్తగా 29,937 కోట్ల రివైవల్ ప్యాకేజీని అందిస్తామని టెలికాం శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. కుంటి నడకన నడుస్తున్న బీఎస్ఎన్ఎల్లో, ఎంటీఎన్ఎల్ కంపెనీలను రివైవ్ చేసే దిశలోనే విలీన ప్రతిపాదనను ఆమోదించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌కు సబ్సిడరీగా ఎంటీఎన్‌ఎల్ ఉంటుందని, రాబోయే రెండేళ్లలో ఈ రెండూ లాభాల బాట పడతాయని ప్రసాద్ వెల్లడించారు. రెండు సంస్థలకు చెందిన 38 వేల కోట్ల ఆస్తుల అమ్మకం ద్వారా రెండు సంస్థలూ నిధులు సమ కూర్చుకునే లాగా,15 వేల కోట్లను సావరిన్ బాండ్స్ జారీ చేయడం ద్వారా రివైవల్ ప్లాన్ రూపొందించినట్లు వెల్లడించారు.
వచ్చే నాలుగేళ్లలో ఈ ప్లాన్ అమలవుతుందని చెప్పారు. సంస్థలలోని ఉద్యోగుల వీఆర్‌ఎస్‌కు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యాభై మూడున్నర ఏళ్ల లోపు ఉద్యోగులు వీఆర్‌ఎస్ తీసుకోవాలను కుంటే వారికి మిగిలిన సర్వీసుకు గాను 125 శాతం పే అవుట్, జీతం, గ్రాట్యుటీ, పెన్షన్ ఈ వీఆర్‌ఎస్ కింద లభిస్తుంది. మార్చి 2018 నాటికి బీఎస్‌ఎన్‌ఎల్ చేతిలో 70 వేల కోట్ల విలువైన భూమి, 3,760 కోట్ల విలువైన బిల్డింగ్స్ ఉన్నాయి. రెండు సంస్థలకూ కలిపి అప్పులు 40 వేల కోట్లు. ఈ సంస్థలు రెండూ వ్యూహాత్మకంగా దేశానికి చాలా ముఖ్యమైనవి. బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌లలో ఏ ఒక్క దానినీ మూసి వేయడం లేదని రవిశంకర్ స్పష్టం చేశారు. మంత్రి నిర్ణయంతో ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి