అంపశయ్యపై ఆర్టీసీ..యూనియన్లపై సీఎం ఫైర్

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో చర్చలు జరుపం. కార్మికులు, అధికారులు మంచి వారే, కానీ యూనియన్ల కారణంగానే ఇదంతా జరుగుతోంది. ఎస్మా కూడా వీరిపై ఉంది. కోర్టుకు కూడా అధికారం లేదు. కేవలం ప్రజలకు ఇబ్బంది ఎదురవుతోంది, దానిని దృష్టిలో పెట్టుకుని పరిష్కరించమని కోరింది. ఎవడో వెధవ చెబితే సమ్మెకు దిగుతారా. కూర్చున్న కొమ్మను వారే నరుక్కుంటున్నారు. దానికి నేనేం చేయలేను. ఒక్క సంతకంతో పర్మిట్ ఇచ్చేస్తా. ఇక రోడ్లపై వద్దంటే బస్సులు నడుస్తాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫిట్ మెంట్ ఇచ్చా, వేతనాలు పెంచా అయినా గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారు. ఇలీనం చేయాలని అంటున్నారు. వీరిని చేస్తే మిగతా కార్పొరేషన్స్ కూడా తమను విలీనం చేయాలని కోరుతాయి.

ఇది జరగని పని. ఇప్పుడు ఉన్న ఆర్టీసీ భవిష్యత్తులో ఉండ బోదని కేసీఆర్ స్పష్టం చేశారు. కార్మికులు పిచ్చి పంథాలో సమ్మె చేస్తున్నారని మండి పడ్డారు. సమ్మె ముగియడం కాదని, ఇక ఆర్టీసీనే ముగుస్తుందని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఆర్టీసీని ఎవరూ కాపాడలేరని, దివాళా తీసిందని సీఎం వ్యాఖ్యానించారు. కార్మికుల భవిష్యత్తుతో యూనియన్లు నాయకులు ఆడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. కార్మికులు తక్షణమే దిగి రావాలని లేదంటే ఒక్క సంతకంతో వేల బస్సులను రోడ్లపైకి తీసుకోస్తామని హెచ్చరించారు. రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థపై నా కంటే ఎక్కువ అనుభవం ఎవ్వరికీ, ఏ నాయకుడికీ లేదు. గతంలో మూడేళ్లు మంత్రిగా పనిచేశా. అప్పుడు ఆ సంస్థ 13  కోట్ల 80 లక్షల నష్టంలో ఉంది. నేనే కష్టపడి ఆ సంస్థను 14 కోట్ల లాభాల్లోకి తెచ్చా. నేను ముఖ్యమంత్రి అయ్యాక  వైస్రాయి హోటల్లో ఆర్టీసీ అధికారులతో సమావేశం నిర్వహించా.

ఈ రోజు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆర్టీసీ ప్రభుత్వంలో లేదు. దిక్కు మాలిన యూనియన్‌ ఎన్నికల కోసం ఇలాంటి సమ్మెలు చేస్తారు. ఈ రోజుకి ఆర్టీసీకి 5 వేల కోట్లు అప్పు ఉంది. ఒక నెల కిస్తీ కట్టకుంటే ఆర్టీసీ ముగుస్తుంది. ఫీఎఫ్‌ డబ్బులు కార్మికులకు ఇచ్చే దమ్ము ఆర్టీసీకి లేదు. నెలకు 100 కోట్ల నష్టం. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ అన్ని లాభాల్లో ఉంటే.. ఆర్టీసీ మాత్రం నష్టాల్లో ఉంటాయి. ఎందుకు అలా?  ఇదేనా యూనియన్లు చేసే పని. గత ప్రభుత్వాలు 712 కోట్లు ఇస్తే.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 4250  కోట్లు విడుదల చేశాం. అది కాక ఓ చట్టం తీసుకొచ్చాం. దాని ద్వారా 330 కోట్లు వచ్చాయి. ఏడాదికి 900 కోట్లుకు పైగా ఇచ్చాం. ఈ ఏడాది 550 కోట్లు పెట్టాం. 425 కోట్లు విడుదల చేశాం. ఇంకెన్ని ఇవ్వాలి..అని అన్నారు కేసీఆర్.

సెప్టెంబర్‌ నెల జీతాలు ఇవ్వాలంటూ హైకోర్టులో కేసులు వేశారు. ఆర్టీసీకి నిధులు లేవని నివేదించాం. డబ్బులు లేవని చెప్పాం. హైకోర్టు ఏం చేస్తది కొడుతదా అని తిరిగి ప్రశ్నించారు. యూనియన్ల నేతలు మహా నేరం చేస్తున్నారు. వంద శాతం ఆర్టీసీ ఇప్పుడు ఉన్నట్లు ఉండదు. మోదీ ప్రభుత్వం తెచ్చిన చట్టం ప్రకారం. ఆర్టీసీపై రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ అధికారాలు ఇచ్చారు. ఆర్టీసీలో పోటీని పెంచాలని సూచించారు. ఆర్టీసీకి పోటీ దారిని సృష్టించమని అధికారాలు ఇచ్చారు. సెప్టెంబర్‌ నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. మేము అదే చేస్తాం. హైకోర్టుకు తీర్పు చెప్పే హక్కు లేదు. లేబర్‌ కోర్టుకు వెళితే ఆస్తులు అమ్మి జీతాలు ఇవ్వమంటారు. అప్పుడు బస్సులు, బస్టాండ్లు అమ్మి జీతాలు ఇవ్వాలి. ప్రభుత్వం ఇవ్వదు. బ్యాంకులు అప్పులు ఇవ్వరు. వెయ్యి శాతం పాత ఆర్టీసీ ఉండదు. యూనియన్లు లేకుండా ఆర్టీసీ పని చేస్తే కచ్చితంగా లాభాల్లోకి వస్తుంది. మొత్తం మీద సీఎం తన మనసులోని మాటల్ని బయట పెట్టారు. మరో వైపు తమ పరిపాలనకు దక్కిన గౌరవం హుజూర్ నగర్ లో విజయం అని పేర్కొన్నారు. 

కామెంట్‌లు