ఈ విజయం..అధికార దుర్వినియోగం
తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర సమితి హుజూర్ నగర్ లో గెలుపొందింది. ఇది గెలుపు అనుకుంటే పొరపాటే. జనం అధికార పార్టీ ప్రలోభాలకు లొంగలేదు. కానీ పూర్తిగా దుర్వినియోగం చేసింది. పోలీసుల జులుం కొనసాగింది. అయినా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎప్పుడో చచ్చి పోయింది. కేసీఆర్ నయా నిజం నవాబు ను తలపింప చేస్తూ పాలన సాగిస్తున్నాడు. రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు.
గెలిచేందుకు ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ చేసింది ఈ సర్కారు. అయినా అంతిమ విజయం ప్రజలదే..టీఅర్ఎస్ ది కాదన్నారు. డబ్బులు, మద్యం వెదజల్లారు. జనాన్ని బురిడీ కొట్టించారు. ఇలా ఎంతో కాలం సాగదన్నారు మందకృష్ణ. ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేశారు. తాను చెప్పిందే వేదం. తాను చేసిందే శాసనం అంటూ కేసీఆర్ అనుకుంటున్నారు. అది చెల్లుబాటు కాదు. ఆ విషయం ఆయనకు తెలుసు. ప్రపంచ చరిత్రలో రాజులు, రాజ్యాలు కాలగర్భంలో కలిసి పోయారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. వాస్తవం కూడా.
ఓ వైపు వందలాది కార్మికులు రోడ్డు పాలయ్యారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ రోజు వరకు ఆర్టీసీ సమస్యకు పరిష్కారం చూపించే దిశగా ప్రయత్నం చేయాల్సిన సీఎం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. మానవతా దృక్పథంతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సమ్మెను విరమింప చేయాలని, జీతాలు చెల్లించాలని కోర్టు ఆదేశించినా పట్టించు కోక పోవడం శోచనీయమన్నారు. కానీ అంతిమ విజయం మాత్రం కార్మికులదే అవుతుందని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి