నిబంధనలు సరళతరం..మార్గం సుగమం
ఇండియాలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాలంటే చాలా నిబంధనలు ఉన్నాయి. దీంతో డబ్బులున్నా బంకులు ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొని ఉన్నది. దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కఠినతరమైన నిబంధనలను సడలించింది. దీంతో వ్యాపారస్తులకు ఇది శుభసూచకమని చెప్పక తప్పదు. దేశమంతటా ప్రతి రోజు వేలాది వాహనాలు తిరుగుతూ ఉంటాయి. ప్రతి వాహనానికి పెట్రోల్ లేదా డీజిల్ అత్యవసరం. దేశీ ఇంధన రిటైలింగ్ రంగంలో భారీ సంస్కరణలకు ప్రభుత్వం తెర తీసింది. చమురు యేతర సంస్థలు కూడా పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసేలా, వెసులు బాటు కల్పిస్తూ నిబంధనలను మార్చేసింది.
అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత ఇంధనాల మార్కెట్లోకి ప్రవేశించేందుకు పలు ప్రైవేట్, విదేశీ సంస్థలకు తోడ్పాటు లభించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఆర్థిక వ్యవహారాల కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయాలన్న లక్ష్య సాధనకు, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ కొత్త పాలసీ తోడ్పడనుంది. ఈ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పనకు ఇది ఉపయోగ పడుతుంది. రిటైల్ అవుట్ లెట్స్ రాకతో పోటీ పెరిగి, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందుతాయి అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ తెలిపారు.
ప్రత్యామ్నాయ ఇంధనాల విక్రయానికీ ఊతం లభించనుంది. పెట్రోల్ బంకు లైసెన్సులు పొందే సంస్థలు .. మూడేళ్లలోగా కొత్త తరం ప్రత్యామ్నాయ ఇంధనాలైన సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ, బయో ఫ్యూయల్స్‌లో ఏదో ఒకదానికి అవుట్ లెట్ లేదా ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇంధన విక్రయ కార్యకలాపాలు ప్రారంభించిన రిటైలర్లు.. అయిదేళ్లలోగా అయిదు శాతం అవుట్‌లెట్స్‌ను నిర్దేశిత గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో అంతర్జాతీయ స్థాయి దిగ్గజాలు భారత ఇంధన మార్కెట్లోకి ప్రవేశించడానికి మార్గం సుగమం కానుంది.
ఫ్రాన్స్‌కి చెందిన టోటల్ ఎస్‌ఏ, సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్‌కో, బ్రిటన్ దిగ్గజం బీపీ, ప్యూమా ఎనర్జీ తదితర సంస్థలు భారత్‌లోని ఇంధన రిటైలింగ్ రంగంపై ఆసక్తిగా ఉన్నాయి. అదానీ గ్రూప్‌తో కలిసి టోటల్ 1,500 పెట్రోల్, డీజిల్ విక్రయాల అవుట్‌లెట్స్ ఏర్పాటు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకుంది. పెట్రోల్ బంకుల కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో అటు బీపీ కూడా జట్టు కట్టింది. ప్యూమా ఎనర్జీ రిటైల్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోగా, ఆరామ్‌కో ఇంకా చర్చల్లో ఉంది. మొత్తం మీద సర్కార్ నిర్ణయంతో భారీ ఆదాయం తో పాటు కొలువులు కూడా రానున్నాయన్న మాట.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి