టీఅర్ఎస్ కే జీ హుజూర్..కాంగ్రెస్ కు షాక్
నువ్వా నేనా అన్న రీతిలో సాగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ కాంగ్రెస్ పార్టీ తన సీటును కోల్పోయింది. అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ ఎన్నిక కాంగ్రెస్, టీఅర్ఎస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. 43 వేలకు పై చిలుకు మెజారిటీతో గులాబీ అభ్యర్థి శైనంపూడి సైదిరెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా హుజూర్‌నగర్ ఉంది. ఇప్పుడు ఇక్కడ గులాబీ జెండా ఎగిరింది. దీంతో గులాబీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ భవన్‌లో సంబరాలు జరిగాయి. తెలంగాణ అంతా హుజూర్ నగర్ వైపు చూసింది. ప్రజాస్వామ్యానికి, కేసీఆర్ నిరంకుశత్వానికి జరిగిన పోటీగా ఈ ఉప ఎన్నికను చూపించే ప్రయత్నం చేశారు.
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసి గెలుపొందడంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. మరోసారి గెలుపు ఖాయమన్న ధీమాతో ఉత్తమ్..తన సతీమణి పద్మావతిని బరిలోకి దింపారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడి పోయిన సైదిరెడ్డిని మరోసారి టీఆర్‌ఎస్ బరిలోకి దింపింది. బీజేపీ, టీడీపీ పార్టీలు బరిలో నిలిచినా..పెద్దగా ప్రభావం చూపలేదు. టీఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్టుగా సాగింది. ఇరుపార్టీల అగ్ర నేతలు పెద్ద సంఖ్యలో మోహరించి.. పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ సమ్మె జరగడం, ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర వాతావరణం ఉండటంతో ఆ ప్రభావం హుజూర్‌నగర్ ఉప ఎన్నికపై పడుతుందేమోనన్న ఆందోళన గులాబీ శ్రేణుల్లో కనిపించింది.
వాటన్నిటిని పటా పంచలు చేస్తూ ఓటర్లు సర్కార్ వైపు మొగ్గు చూపారు. గులాబీ అభివృద్ధి మంత్రానికి ఓటేశారు. మూడుసార్లు గెలిపించినప్పటికీ ఉత్తమ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేక పోయారని, గులాబీ గెలుపుతోనే ఇక్కడ అభివృద్ధి సాధ్యమంటూ సైదిరెడ్డి, టీఆర్‌ఎస్ నేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. ఈ ప్రచారం ఫలించినట్టు ఉప ఎన్నిక ఫలితాల్లో స్పష్టమవుతోంది. ప్రతిపక్ష పార్టీలు బొక్కా బోర్లా పడ్డాయి. తెలంగాణలో తామే ప్రధాన ప్రతిపక్షమంటూ గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీకి ఇక్కడ షాక్ తగిలింది. టీడీపీ ఉనికి కోసం హుజూర్‌నగర్‌లో పోటీచేసినా ఘోరమైన భంగ పాటు తప్పలేదు. ఇదిలా ఉండగా ఈ ఉప ఎన్నికపై భారీగా బెట్టింగ్ జరిగింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి