ముందుండి నడిపిస్తా..బిసిసిఐకి పేరు తీసుకువస్తా

బిసిసిఐకి ప్రెసిడెంట్ గా ఎన్నికై బాధ్యతలు స్వీకరించిన వెంటనే బెంగాల్ దాదా సౌరబ్ గంగూలీ తన మార్క్ ఏమిటో రుచి చూపిస్తున్నాడు. తాను ఏమేం చేయాలనీ అనుకుంటున్నాడో ముందుగానే ప్రకటించాడు. ఈ మేరకు తన ప్లాన్ వివరాలను వెల్లడించాడు దాదా. అదే ఆత్మ విశ్వాసం, తనపై పెట్టుకున్న నమ్మకం, అదే దుందుడుకు ధోరణి ఈ 47 ఏళ్ళ ఆటగాడిలో కనిపించాయి. ఎక్కడా తొట్రుపాటు అంటూ లేకుండా, చాలా స్పష్టంగా గంగూలీ చెప్పాడు.
సారధిగా టీమిండియాకు కొత్త దిశను అతను చూపించాడు. ఇప్పుడు అదే తరహాలోనే బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా పని చేస్తానని చెప్పాడు. తనకు తెలిసిన విధానంలోనే ఫలితాలు రాబడతానని వ్యాఖ్యానించాడు. బీసీసీఐకి ఇది కొత్త ఆరంభంగా భావిస్తున్నా. నేను కెప్టెన్‌గా ఎంపికైనప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి.

కొన్ని మార్పులు చేయాల్సి ఉంది. సంస్కరణలు తీసుకు రావాలి. రాష్ట్ర సంఘాలకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంది. ఇది పెద్ద సవాలే, అయినా మార్పు తీసుకు రాగలనని నమ్ముతున్నా. నాకు తెలిసిన పద్ధతిలో, భారత జట్టును సారధిగా ఎలా నడిపించానో ఇక్కడా అలాగే పని చేస్తా. విశ్వసనీయత దెబ్బ తినకుండా, అవినీతికి తావు లేకుండా వ్యవహరిస్తా. గత మూడేళ్లుగా కమిటీ లేదు, సమావేశాలు లేవు. ఏం జరిగిందో నాకు తెలీదు. ఇప్పుడు నేను ఏం చేసినా భారత బాగు కోసమే అని భావించాలి. ఐసీసీ నుంచి భారత్‌కు ఐదేళ్ల కాలంలో 372 మిలియన్‌ డాలర్లు రావాల్సి ఉంది.  దీనిపై ఐసీసీతో చర్చిస్తామని చెప్పారు గంగూలీ. కోహ్లి అద్భుతమైన ఆటగాడు. గత కొన్నేళ్లలో అతను జట్టును గొప్ప స్థాయికి తీసుకెళ్లాడు. అతనికి మేం అండగా నిలుస్తాం. రంజీ ట్రోఫీ ప్రారంభానికి ముందే తగిన చర్యలు తీసుకుంటాం.

రంజీ ట్రోఫీని పటిష్టంగా మార్చేందుకు, పోటీ పెరిగేందుకు సమగ్రంగా మార్పులు తీసుకొస్తాం. అప్పుడే మనకు గొప్ప క్రికెటర్లు వస్తారు. ఆటగాళ్లకు ఆర్థిక పరమైన భరోసా కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇదిలా ఉండగా మణికట్టు మాంత్రికుడు, మాజీ టీమిండియా సారధి, కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ కలిగిన హైదరాబాదీ రిస్ట్ ప్లేయర్ మహమ్మద్ అజహరుద్దీన్ గంగూలీని అభినందించాడు. బీసీసీఐ సమావేశానికి హెచ్‌సీఏ అధ్యక్షుడి హోదాలో అజహరుద్దీన్‌ హాజరయ్యాడు. అజహర్‌ సారథ్యంలోనే గంగూలీ తన తొలి వన్డే , తొలి టెస్టు మ్యాచ్‌ బరిలోకి దిగాడు. అజహర్‌తో గంగూలీకి మంచి సంబంధాలుఉన్నాయి. ఏడాది క్రితం విండీస్‌తో మ్యాచ్‌కు ముందు ఈడెన్‌ గార్డెన్స్‌లో అజహర్‌ గంట మోగించాడు. దీని వెనుక గంగూలీ ఉన్నాడు.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!