కాలజ్ఞానం..వీర బ్రహ్మేంద్ర మహోత్సవం

నాలుగు వందల ఏళ్ళు గడిచినా కాలజ్ఞానం చెక్కు చెదరలేదు. లోకానికి అడుగులు నేర్పించి, ప్రపంచ పోకడను, జీవన గమనాన్ని నిర్దేశించి, మానవ జాతికి మరింత భవిష్యత్తును అందజేసిన మహానుభావుడు. సామాజిక సంస్కర్త. కాలజ్ఞాని శ్రీ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. సజీవ సమాధి అయి తరాలు గడిచినా, కాలాలు మారినా ఆయన చెప్పిన కాలజ్ఞానం చెక్కు చెదరలేదు. సజీవంగా, జాతి జీవగర్రగా కొనసాగుతూ వస్తున్నది. తెలుగు వాకిళ్ళలో ఏది జరిగినా, ఏ సంఘటన చోటు చేసుకున్నా వెంటనే గుర్తుకు వచ్చేది, జ్ఞాపకానికి తెచ్చుకునేది వీర బ్రహ్మం గారినే. కుల, మతాలు మనకెందుకు అన్నాడు. మనుషులంతా సమానమేనని చెప్పాడు.
ఆయన జగమెరిగిన యోగి, హేతువాది, సాక్షాత్ దైవ స్వరూపుడు. తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. పరిపూర్ణయా చార్యులు, ప్రకృతాంబలకు కాశీ పట్టణంలో పుట్టారు. పాపాగ్ని మఠ అధిపతులు వీరభోజ యాచార్య, వీరపాప మాంబల వద్ద శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి పెరిగారు. కడప జిల్లా లోని కందిమల్లాయపల్లిలో చాలా కాలం నివసించి సజీవ సమాధి పొందారు. ఇదే ప్రాంతం ఇప్పుడు బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెందింది. జనులందరిని సన్మార్గంలో నడువమని బోధించారు. చిన్నతనములోనే తల్లి దండ్రులను కోల్పోయి అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. కాళికాంబ పై సప్తశతిని రచించాడు.

గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో గోపాలకుడిగా ఉంటూ, రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు. బ్రహ్మం గారి మహిమ తెలుసుకున్న అచ్చమ్మ తన కొడుకు బ్రహ్మానంద రెడ్డికి చూపు ప్రసాదించమని కోరింది. తన దివ్య దృష్టితో, చూపు వచ్చేలా చేశారు. గుహలో కూర్చుని రాసిన తాళపత్ర గ్రంథాలు మఠంలో నేటికీ భద్రంగా ఉన్నాయి. వడ్రంగి పని చేస్తూ గడిపాడు. తన మొదటి జ్ఞాన బోధ తల్లితో ప్రారంభించాడు. శరీరం పాంచ భౌతికమని ఆకాశం, గాలి, అగ్ని, పృధ్వి, నీరు అనే అయిదు అంశాలతో చేయబడిందని బోధించారు.

సమస్త ప్రకృతితో కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మము అనే జ్ఞానేంద్రియాల ద్వారా సంబంధం ఏర్పరచుకొని జ్ఞానం సంపాదిస్తామని చెప్పారు. 'నేను' అనే అహం జనిస్తుందని, ఆత్మ సాక్షిగా మాత్రమే ఉంటుందని, బుద్ధి జీవుని నడిపిస్తుందనీ, బుద్ధిని కర్మ నడిపిస్తుందని, దానిని తప్పించడం ఎవరికీ సాధ్యపడదనీ, ఈ విషయాన్ని గ్రహించి ఎవరు పర బ్రహ్మను ధ్యానిస్తారో వారు మోక్షాన్ని పొందుతారని బ్రహ్మం గారు బోధించారు. నేటికీ ఆ మహానుభావుడిపై ఎన్నో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

బ్రహ్మం గారి కుమార్తె వీర నారాయణమ్మ సంతతికి చెందిన ఏడవ తరం వీరభోగ వసంత వేంకటేశ్వర స్వామి ప్రస్తుత 11వ మఠాధిపతి గా ఉన్నారు. బ్రహ్మం గారి సాహిత్యం, సారస్వతాలను సామాన్యులకు అందుబాటు లోకి తెచ్చారు. మఠంలో నిత్యాన్నదానం జరుగుతోంది. బ్రహ్మంగారి పేరుతో పలు విద్యా సంస్థలు వెలిశాయి. ఇంజినీరింగ్ కళాశాల, జూనియర్ కళాశాల, వేద పాఠశాల నడుస్తున్నాయి. స్వాముల వారి 411వ జయంతి మహోత్సవాలకు బ్రహ్మం గారి మఠం సిద్ధమైంది.

కామెంట్‌లు